డ్వాక్రాకు వడ్డీ భారం.. ఆ మూడు నెలలకు అదనంగా వడ్డీ

ABN , First Publish Date - 2020-04-09T20:15:48+05:30 IST

కరోనా కారణంగా నెలకొన్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో ప్రజలకు భారంగా మారాయి. పనులు కోల్పోయి

డ్వాక్రాకు వడ్డీ భారం.. ఆ మూడు నెలలకు అదనంగా వడ్డీ

పశ్చిమ గోదావరి జిల్లాలో డ్వాక్రా రుణాల మొత్తం రూ.2,741 కోట్లు 

నెలవారీ వడ్డీ రూ.25.13 కోట్లు 

మూడు నెలలకు కలిపి రూ.75.4 కోట్ల భారం 


ఏలూరు (ఆంధ్రజ్యోతి) : కరోనా కారణంగా నెలకొన్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో ప్రజలకు భారంగా మారాయి. పనులు కోల్పోయి ఆదాయం పడిపోయిన ప్రజలకు మూడునెలలపాటు బకాయిలు తాలూకూ కిస్తీ (ఈఎంఐ)లు చెల్లించకుండా ఉండేలా వెసులుబాటు కల్పించింది. అయితే ఈ వెసులుబాటు కాలానికి సంబంధించి వడ్డీ విషయంలో ఆర్బీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో బ్యాంకులన్నీ ఈ మూడు నెలల కాలానికి కూడా వడ్డీ చెల్లించాలని చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే సమస్య డ్వాక్రా మహిళలను వెంటాడుతోంది. 


పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్థి శాఖ పరిధిలో 74,253 స్వయం సహాయక బృందాలున్నాయి. వీటిలో 7.8 లక్షల మంది మహిళలు సంఘటితమై ఉన్నారు. వీరిలో మైదాన ప్రాంతానికి చెందిన 69,956 గ్రూపులు, జిల్లాలోని ఐదు ఏజెన్సీ మండలాల్లో ఉన్న 4,227 గ్రూపులు మహిళలు రుణాలు తీసుకుని ఉన్నారు. వీరికి జిల్లాలో ఉన్న 17 సహకార, వాణిజ్య బ్యాంకులకు చెందిన 631 బ్రాంచ్‌ కార్యాలయాలు స్వయంగా సహాయక రుణాలు అందజేశాయి. జిల్లా వ్యాప్తంగా వీరు తీసుకున్న రుణాల తాలూకు బకాయిల మొత్తం 2,740 కోట్ల రూపాయలు. దీనిపై 11 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. మారటోరియం కింద అదనంగా ఇచ్చిన ఈ మూడునెలలకు కూడా వీరు 11 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సిందే. 


స్పష్టత రాలేదు : శరత్‌, ఏపీఎం, డీఆర్‌డీఏ 

డ్వాక్రా రుణాలు చెల్లింపులకు మూడునెలల ఊరట ఇచ్చారు. వడ్డీ విషయం చెప్పలేదు. దీంతో బ్యాంకులు వడ్డీ వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ భారం డ్వాక్రా గ్రూపులే భరించాలి. కేంద్రం వడ్డీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటేనో.. రాష్ట్ర ప్రభుత్వం అదనపు వడ్డీని చెల్లిస్తేనో తప్ప ఆ భారం తగ్గదు.


రూ.75.4 కోట్ల భారం 

జిల్లాలో ప్రస్తుతం ఉన్న డ్వాక్రా రుణ మొత్తం 2,740 కోట్లు. దీనికి 11 శాతం చొప్పున బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. ఈ లెక్కన ప్రతీనెలా డ్వాక్రా మహిళలు 25.13 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మూడు నెలలపాటు కిస్తీల చెల్లింపుకు ఊరట ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. వడ్డీ విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో బ్యాంకులు అదనంగా పెరిగిన మూడు నెలలకు కూడా వడ్డీ వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. అదే గనుక జరిగితే ప్రతీ నెలా రూ.25.14 కోట్ల చొప్పున మూడునెలలకు కలిపి 76 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇది బారు వడ్డీ లెక్క. సాధారణంగా బ్యాంకులు చక్ర వడ్డీని అమలు చేస్తాయి. ఆ విధంగా చూసుకుంటే మరో కోటి రూపాయలు అదనంగా భారం తప్పకపోవచ్చు.

Updated Date - 2020-04-09T20:15:48+05:30 IST