Abn logo
Oct 27 2021 @ 00:15AM

జోరందుకున్న వరి కోతలు

జిల్లాలో 145 కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రోజురోజుకూ పెంచుతున్న అధికారులు

కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు

నిజామాబాద్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వరి కోతలు జోరందుకోవడంతో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 145 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 8వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రోజురోజుకూ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచుతూ ధాన్యాన్ని సేకరిస్తున్నారు. వ్యవసాయ, సహకార, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులను సమన్వయం చేస్తూ వెంట వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వెంటనే మిల్లులకు తరలించే విధంగా వాహనాలను సమకూర్చారు. ప్రతీరోజు 10వేల మెట్రిక్‌ టన్నులకు తగ్గకుండ కొ నుగోళ్లు చేపడుతున్నారు. 

జిల్లాలో వరికోతల మొదలై 20 రోజులు దాటింది. ముందే వేసిన వరి పంట చేతికి రావడంతో రైతులు హార్వెస్టర్‌ ల ద్వారా కోతలు చేస్తున్నారు. ధాన్యం ఆరబోసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వారం క్రితమే జిల్లాలో కొనుగోలుచేసేందుకు ఏర్పాట్లను చేశారు. జిల్లాలో ఈ దఫా 3లక్షల 85వేల ఎకరాలకుపైగా వరి పంటను సాగు చేశారు. సాగు ఆధారంగా 9లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 458 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోపు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతీ రోజు పదివేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే చేశారు. వాహనాలకు ఇబ్బందిలేకుండా సంఖ్యను పెంచి 1,200ల వాహనాలను అందుబాటులో ఉ ంచారు. ప్రతీ కేంద్రం వద్ద వాహనాలను ఉంచి తరలించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులను సమకూర్చడంతో పాటు హమాలీల ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

ఈ దఫా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడం, కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వచ్చే అవకాశం ఉండడంతో ప్రధానశాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించారు. వీరి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ శాఖలకు చెందిన అధికారులందరినీ కొనుగోళ్లలో ఉండేవిధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో డివిజన్‌స్థాయిలో పర్యవేక్షించగా ఈ దఫా ధాన్యం కొనుగోళ్లన్నీ మండలస్థాయిలోనే చేయనున్నారు. జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా వెంటనే కొనుగోలు చేపట్టేవిధంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. మండలస్థాయి అధికారులందరికీ అవగాహన కల్పించడంతో పాటు ప్రతీరోజు క్షేత్రస్థాయిలో ఉండి ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చూసేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ధాన్యం గ్రామాల పరిధిలో నిండుగా ఉండడంతో త్వరగా కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే ధాన్యం చేతికి రావడంతో జిల్లాలో ఏ గ్రామం పరిధిలో చూసినా రోడ్లపైన ధాన్యం కుప్పలు ఉండడంతో కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో త్వరగా కొనుగోళ్లు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ధాన్యం ముందుగా రావడంతో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌లు తెలిపారు. ప్రతీరోజు కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు వెంట వెంటనే కొనుగోళ్లు జరిగేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. నెలాఖరులోపు అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు.