‘నిఘా’ దగా!

ABN , First Publish Date - 2022-01-18T06:28:54+05:30 IST

ఇంటెలిజెన్స్‌... పోలీసు శాఖకు మూడో నేత్రం..

‘నిఘా’ దగా!

గన్నవరాన్ని ఏలుతున్న ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐ

పోలీసులకు సమాంతరంగా ప్రైవేటు సైన్యం

ఇంటెలిజెన్స్‌ సమాచారంతో పైరవీలు

ఆరేళ్లుగా పాతుకుపోయిన పునాదులు

ఎస్‌ఐ అండతో చెలరేగుతున్న ప్రైవేటు వ్యక్తులు

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కార్యాలయానికి పాపాల చిట్టా


ఇంటెలిజెన్స్‌... పోలీసు శాఖకు మూడో నేత్రం.. ఒక ప్రాంత రాజకీయ పరిస్థితులు... పాలకులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలు.. వీటన్నింటికీ సంబంధించిన సమాచారాన్ని సేకరించేది ఈ విభాగమే. ఈ సమాచార సేకరణలో కీలకంగా వ్యవహరించే ఓ ఎస్‌ఐ ఆ ముసుగులో ప్రైవేటు వ్యవస్థను నడుపుతున్నాడు. అసలు పనుల కంటే ‘పంచాయితీ’లనే ప్రధాన పనిగా మార్చుకుంటున్నాడు. తనకు వచ్చిన సమాచారాన్ని ప్రైవేటు వ్యవస్థకు అందజేసి, రహస్య పంచాయితీలతో లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నాడు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా జరుగుతున్న ఇంటెలిజెన్స్‌ విభాగంలోని ఓ ఎస్‌ఐ బాగోతం ఇది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఒక నియోజకవర్గంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఇంటెలిజెన్స్‌ నుంచి ఒక ఎస్‌ఐని నియమిస్తారు. ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. ఆరేళ్లుగా గన్నవరం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎస్‌ఐ పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తాను నిర్వర్తించాల్సిన విధులను పక్కన పెట్టి, ప్రైవేటు వ్యవహారాలను భుజాన వేసుకుంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలను చక్కబెట్టడానికి, పంచాయితీలను నిర్వహించడానికి  సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు వచ్చిన సమాచారాన్ని ముందుగా ఈ సైన్యానికి చేరవేస్తాడు. ఆ తర్వాత రహస్య ప్రదేశాల్లో పంచాయితీలు నిర్వహించి, వారి నుంచి సొమ్మును సైన్యం లాక్కుంటుంది. ఆ తరువాత ఎస్‌ఐ తన వాటా అందుకుంటాడు. ఇసుక, బియ్యం, గుట్కా, గంజాయి రవాణాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు కాకుండా ప్రైవేటు సైన్యానికి చేరవేస్తారు. ఈ కేసులతో ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐకు సంబంధం లేదు. ఒకవేళ ఇలాంటి సమాచారం వచ్చినా, పోలీసుశాఖలో ఉన్నతాధికారులకు ఇవ్వాలి. గన్నవరం నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించేలా ఆయన కొంతమంది వేగులను నియమించుకున్నాడు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ప్రైవేటు సైన్యాన్ని ఉపయోగించుకుని సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని గన్నవరం మొత్తం కోడై కూస్తోంది. ఇంటెలిజెన్స్‌లోని నిబంధనల ప్రకారం ఒక ఎస్‌ఐకి నియోజకవర్గంలో మూడేళ్లు పూర్తవగానే బదిలీ చేయాలి. పశ్చిమగోదావరి జిల్లాలో శాంతిభద్రతల విభాగంలో పనిచేసి జిల్లాకు వచ్చిన ఆ ఎస్‌ఐ ఆరేళ్లుగా గన్నవరంలోనే విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఆయన స్వస్థలం గన్నవరం కావడంతో పరిచయాలు పెరిగాయి. ఈ పరిచయాల ఆధారంగా అక్రమ రవాణా విషయాల్లోనే కాకుండా సివిల్‌ పంచాయితీలను సైతం ఈయన తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు ఆరోపణలున్నాయి.


అయితే అటు... కాకపోతే ఇటు...

ఇసుక, బియ్యం, గుట్కా, గంజాయి అక్రమంగా వాహనాల్లో వెళ్తున్నట్టు టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు తెలిసినా, తెలియకపోయినా ఈ ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐకు మాత్రం పక్కాగా తెలుస్తుంది. ఈ సమాచారం రాగానే వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా ప్రైవేటు సైన్యంలోని ముఖ్యుడికి చేరవేస్తాడు. అతడు మరికొంతమందిని వెంటబెట్టుకుని పొట్టిపాడు టోల్‌ప్లాజాకు చేరుకుంటాడు. కుదిరితే టోల్‌ప్లాజాకు ముందు, కుదరకపోతే దాటిన తర్వాత ఆ వాహనాలను నిలిపివేస్తారు. అందులో ఉన్న వాళ్లను ఇంటెలిజెన్స్‌ పేరు ఉపయోగించి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు ముట్టగానే అందులో నుంచి 50 శాతం వాటా ఎస్‌ఐకి చేరుతుంది. ఈ విధంగా ఆరేళ్లలో లక్షలాది రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం.


చీఫ్‌ కార్యాలయానికి చేరిన చిట్టా

ఆరేళ్లుగా ఇంటెలిజెన్స్‌ ముసుగులో అడ్డూఅదుపు లేకుండా సాగించిన ఈయన పాపాల చిట్టా ఇప్పుడు బట్టబయలైంది. గన్నవరం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ ఎస్‌ఐ సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా విజయవాడలోని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కార్యాలయానికి చేరాయి. కొద్దిరోజుల క్రితం ఆయన పెట్టే వేధింపులు భరించలేక ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి తూర్పు డివిజన్‌ కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. ఆమె చెప్పిన కథను విన్నా, పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆయన ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తుండడం, పైగా ఎస్‌ఐ కావడంతో కేసు నమోదు చేయకుండా ఆమెను ఇంటెలిజెన్స్‌ విభాగంలోని ఉన్నతాధికారుల వద్దకు పంపినట్టు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2022-01-18T06:28:54+05:30 IST