Inspirational story: పుట్టగానే ఆ బాలికను పాతిపెట్టేశారు.. బతిక బయటపడిన ఆ బాలిక ఏ స్థాయికి వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2022-08-08T21:46:23+05:30 IST

మగవారితో అన్ని రంగాల్లోనూ పోటీపడుతూ.. వారి కంటే తామేం తక్కువ కాదని నిరూపిస్తున్న ఆడపిల్లలంటే ఇప్పటికీ చాలా మందికి చులకనే.

Inspirational story: పుట్టగానే ఆ బాలికను పాతిపెట్టేశారు.. బతిక బయటపడిన ఆ బాలిక ఏ స్థాయికి వెళ్లిందంటే..

మగవారితో అన్ని రంగాల్లోనూ పోటీపడుతూ.. వారి కంటే తామేం తక్కువ కాదని నిరూపిస్తున్న ఆడపిల్లలంటే ఇప్పటికీ చాలా మందికి చులకనే. ఆడపిల్ల పుట్టిందని బాధపడే తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నారు. అలాంటిది దాదాపు 50 ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. రాజస్థాన్‌లోని పురాతన కల్‌బెలియా (Kalbaliya community) హరిజన తెగలో 1973లో ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు గులాబో సపేరా (Gulabo Sapera). ఆడపిల్ల అనే కారణంతో ఆ చిన్నారిని పుట్టిన వెంటనే తండ్రి, భూమిలో పాతపెట్టేశాడు. అయినా ఆ బాలిక శ్వాస ఆపలేదు. నాలుగు గంటల తర్వాత తల్లి, అమ్మమ్మ వచ్చి కాపాడే వరకు ఆ చిన్నారి బతికే ఉంది. 


ఇది కూడా చదవండి..

Viral Story: ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.. ఎన్నో లోపాలతో పుట్టిన ఆమె ఆత్మవిశ్వాసంతో ఎలా ముందడుగు వేసిందంటే..


భూమిలో నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన ఆ బాలికను చూసి గ్రామస్తులు భయపడ్డారు. ఆ బాలికను మంత్రగత్తె అని పిలవడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతోనూ, సమాజంతోనూ గులాబో పోరాడింది. ఎన్నో అవహేళనలను భరించింది. మొండితనం, ధైర్యంతో నాట్యాకారిణిగా మారింది. కల్‌బెలియా నృత్యంలో ఉత్తమ కళాకారిణిగా ఎదిగింది. గులాబో 1981లో తొలిసారి అమెరికా వెళ్లి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అలా ఇప్పటికి ప్రపంచంలోని 165 దేశాలలో గోలాబో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. ఆమె ప్రదర్శనలపై అనేక డాక్యుమెంటరీలు తయారయ్యాయి. పలు పుస్తకాలు కూడా ప్రచురణ అయ్యాయి. 


ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. `నేను పుట్టినప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. 1985లో అమెరికా నుంచి తిరిగి వచ్చాక మా కమ్యూనిటిలోని ప్రజల దృక్పథాన్ని మార్చడానికి ప్రయత్నించాను. అడపిల్లలపై వివక్షను తగ్గించాలనుకున్నాను. ఎంతో మందితో మాట్లాడాను. కూతుర్ని చంపబోమని చాలా మంది మాట ఇచ్చారు. నా తర్వాత మా కమ్యూనిటీలోని స్త్రీలు అద్భుతమైన కళాకారిణులుగా ఎదిగారు. ఆడపిల్ల పుట్టినందుకు చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషపడుతున్నారు. అదే నేను సాధించిన పెద్ద విజయం` అని గులాబో చెప్పారు. గులాబో 2011లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T21:46:23+05:30 IST