నగరంలో నరక దారి

ABN , First Publish Date - 2021-12-05T05:48:02+05:30 IST

నగరంలో నరక దారి

నగరంలో నరక దారి
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ప్రమాదకరంగా గొయ్యి

ప్రమాదకరంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు

సితార నుంచి రామవరప్పాడు వరకూ అదే తీరు

అడుగడుగునా భారీ గోతులు, కంకర లేచిన దారులు

భారీ వాహనాల తాకిడితో  అడ్డదిడ్డంగా..

పట్టించుకోని సీఆర్‌డీఏ, రోడ్డు సేఫ్టీ కమిటీ

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : మీకు ‘థార్‌’లాంటి ఫోర్‌వీల్‌ డ్రైవ్‌ వాహనం ఉందా! లేక... సర్రున దూసుకెళ్లే బైక్‌ ఉందా? ఎగుడు దిగుడు దారిలో ‘ఆఫ్‌ రోడ్‌’ డ్రైవింగ్‌కు ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తున్నారా! ఆగండాగండి! మరెక్కడికీ వెళ్లక్కర్లేదు! ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లో పాలఫ్యాక్టరీ ఫ్లై ఓవర్‌ (సీవీఆర్‌ వంతెన) మీదుగా వైఎస్సార్‌ కాలనీ సర్కిల్‌, పైపుల రోడ్డు జంక్షన్‌, పాయకాపురం భవానీ బార్‌ సెంటర్‌ మీదుగా రామవరప్పాడు ఫ్లైఓవర్‌ వరకు డ్రైవ్‌ చేయండి! అసలు మీకు ఎక్కడా రోడ్డుమీద ప్రయాణించినట్లే ఉండదు! మట్టి గుట్టలు, గుంతలు, రివ్వున ఎగిరే దుమ్ముతో అచ్చంగా ఏ లఢక్‌ మట్టి రోడ్లలోనో వెళ్తున్నట్లు ఉంటుంది! కారైనా, బైక్‌ అయినా... రెండో గేరు దాటితే ఒట్టు! ఉన్నా లేనట్లుగా అనిపించే తార్రోడ్డు మధ్య చీలికల్లో, గోతుల్లో పడకుండా ఒడుపుగా పక్కకు వెళుతుంటే ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్‌ బైక్‌ రైడర్‌గా ఫీల్‌ కావొచ్చు. ఎక్కడైనా ఒక్క టైరు గోతిలో పడిందంటే మనిషి కూడా కింద పడాల్సిందే! అంత జాగ్రత్తగా నడపాలి మరి! పైపులరోడ్డు ఎన్టీఆర్‌ బొమ్మ సర్కిల్‌ నుంచి భవానీ బార్‌ జంక్షన్‌ వరకు ఉన్న రోడ్డు ‘అందం’ గురించి ఎంత చెప్పినా తక్కువే! తప్పించుకోలేనన్ని పెద్ద, విశాలమైన గోతులు ఈ రోడ్డుకు సొంతం. ‘రోడ్లపై పడిన గుంతలను తారు-కంకరతో పూడ్చాలి’ అనే సంగతి అధికారులు ఎప్పుడో మరిచిపోయారు. వాటి ముఖాన ఇంత మట్టి పడేస్తున్నారు. కాస్త వాన పడితే... ఆ మట్టి బురదగా మారి, మళ్లీ గొయ్యిగా పూర్వస్థానానికి వస్తుంది. ఎండకాస్తే... వాహనాలు వెళ్లినప్పుడల్లా దుమ్ము ఆకాశానికి ఎగురుతుంది. అన్నట్లు... ఈ మార్గంలో నిత్యం భారీ లోడుతో టిప్పర్లు, లారీలు వెళ్తూనే ఉంటాయి. అంటే... ఇరవై నాలుగు గంటలూ దుమ్ము దుమారమే! పాపం... అక్కడి జనం! ఎవరిని అడగాలో తెలియక, అడిగినా ఎలాంటి స్పందన రాక... ఆ దుమ్మునే పీలుస్తూ, ఆ ధూళిలోనే దుకాణాలు నడుపుతూ, అక్కడే కొనుగోళ్లు చేస్తూ ఓ రకంగా మట్టి మనుషుల్లా మారిపోయారు. అక్కడ ఓ అరగంట రోడ్డు పక్కన నిలబడితే... శరీరంపై మట్టి పొర పేరుకుంటుంది. అక్కడున్న చెట్ల ఆకులన్నీ ధూళితో నిండుకుని... కొత్తరంగు పులుముకున్నాయి. దుకాణాల బోర్డులపై అక్షరాలు కనిపించనంతగా ధూళి చేరుకుంది. ఇదేమీ ఆషామాషీ రోడ్డు కాదండోయ్‌! హైదరాబాద్‌ వైపు నుంచి విశాఖపట్నం వైపు సులువుగా వెళ్లేందుకు నిర్మించిన ఘనమైన చరిత్ర ఉన్న ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌! మొదటిసారి ఈ రోడ్డెక్కిన వాళ్లకు... టైర్ల కింద నరకం కనిపిస్తుంది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే వారికి మాత్రం నరకం బాగా అలవాటైపోయింది. ఈ దారి పొడవునా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు బోలెడు కనిపిస్తాయి. వారికి మాత్రం ఈ రహదారి కష్టాలు కనిపించవు. జనం గోడును నేతలు పట్టించుకోవడంలేదు. అధికారులు పట్టించుకునే అవకాశమూ కనిపించడం లేదు. ఎవరి కర్మ వారిదే!

డేంజర్‌.. ఇన్నర్‌..

భారీ వాహనాల రాకపోకల కారణంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పెద్దపెద్ద గోతులు, గతుకులు, పగుళ్లు, కుంగుదలతో అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవల కాలంలో ఈ గతుకుల రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఎందరో క్షతగాత్రులవుతున్నారు. నగరాన్ని అనుకుని వెళ్లే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రమాదాల నిలయంగా మారితే జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ చేష్టలుడిగి చూస్తున్నది. భారీ గోతులను స్థానికులే స్పందించి కొన్నిచోట్ల మట్టితో పూడ్చుతున్నారు. వాహనాల తాకిడికి ఆ మట్టికాస్తా దుమ్మురేపుతోంది. ధూళి కారణంగా వాహనాలు కనిపించే పరిస్థితి లేకుండా పోతోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఐదేళ్ల కిందట అప్పటి వీజీటీఎం-ఉడా నేతృత్వంలో నిర్మించారు. కేంద్ర పట్టణాభివృద్ధి పథకం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ.127 కోట్ల వ్యయంతో అరవై ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) దగ్గర గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి పదహారవ నెంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) రామవరప్పాడు రింగ్‌కు అనుసంధానమౌతుంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మొత్తం 10 కిలోమీటర్లు నిడివితో ఉంది. గొల్లపూడి నుంచి సితార జంక్షన్‌ వరకు రోడ్డును ఇటీవల కార్పొరేషన్‌ మరమ్మతులు చేయగా.. సితార జంక్షన్‌ నుంచి మిల్క్‌ఫ్యాక్టరీ ఫ్లై ఓవర్‌ వరకు రోడ్డు ధ్వంసమైంది. మిల్క్‌ ఫ్యాక్టరీ ఫ్లై ఓవర్‌పైనా ఏడాది కిందట భారీ గోతులు ఉండేవి. వాటిని కార్పొరేషనే బాగు చేసినా మూన్నాళ్ల ముచ్చటే.. ఫ్లై ఓవర్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. కాంక్రీట్‌ కొట్టుకుపోయి లోపల ఉండాల్సిన చువ్వలు బయటకు తేలి కనిపిస్తున్నాయి. 



Updated Date - 2021-12-05T05:48:02+05:30 IST