Advertisement
Advertisement
Abn logo
Advertisement

శిశువుల అపహరణ ముఠా అరెస్టు

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా ఎస్‌పీ కృష్ణారావు, ఏఎస్‌పీ జగదీశ్‌ తదితరులు

ప్రధాన నిందితురాలు ఘోషాస్పత్రిలో సెక్యూరిటీ గార్డు

పోలీసులకు చిక్కిన పది మంది సభ్యులు

నిందితుల నుంచి నలుగురు శిశువులు, రూ.4.2 లక్షల నగదు స్వాధీనం 

జిల్లా ఎస్‌పీ బి.కృష్ణారావు 


పాడేరు (విశాఖపట్నం జిల్లా), డిసెంబరు 8: శిశువులను అపహరించి, పిల్లలు లేని వారికి విక్రయించే పది మంది సభ్యుల ముఠాను అరకులోయ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అపహరణకు గురైన నలుగురు శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పీ బొడ్డేపల్లి కృష్ణారావు బుధవారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు అరకులోయ ప్రాంతంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారి ఆరు నెలల మగ శిశువు ఈ నెల మూడో తేదీ రాత్రి అపహరణకు గురైందని ఎస్‌పీ తెలిపారు. పాడేరు ఏఎస్‌పీ జగదీశ్‌ పర్యవేక్షణలో అరకులోయ సీఐ జీడీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి శిశువులను అపహరించే ముఠా గుట్టు రట్టు చేశారన్నారు. 


ప్రధాన నిందితురాలు ఘోషాస్పత్రి సెక్యూరిటీ గార్డు

విశాఖపట్నంలోని ఘోషాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నీలపు మణి, ఆమెతో సహజీవనం సాగిస్తున్న పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్‌ పొలమరశెట్టి రమేశ్‌ కలిసి కొన్నాళ్లుగా శిశువుల అపహరణకు పాల్పడుతున్నట్టు ఎస్‌పీ కృష్ణారావు తెలిపారు. వారిద్దరూ చినముషిడివాడకు చెందిన పెంటకోట మహేశ్వరి, అల్లిపురానికి చెందిన కొప్పుల క్రాంతితో కలిసి ఈ పని చేస్తున్నారన్నారు. ఈ నలుగురు అనంతగిరి మండలం చిలకలగెడ్డకు చెందిన కాపు సంపత్‌, డుంబ్రిగుడ మండలం బోందుగుడకు చెందిన సావుకారి సురేశ్‌, అరకులోయ మండలం ఎండపల్లివలసకు చెందిన డ్రైవర్‌ అప్పలభక్తుని కృష్ణ, పెందుర్తికి చెందిన సురవరపు నాగమణి, సబ్బవరం మండలం గాలిభీమవరం గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసరావు, పెందుర్తికి చెందిన పెతకంశెట్టి మోహన్‌రావులను తమ వ్యవహారాల్లో భాగస్వాములను చేశారన్నారు. అరకులోయలో శిశువు అపహరణపై పోలీసు బృందాలు ఆరా తీస్తే..నీలపు మణి ఆధ్వర్యంలో వీరంతా కలిసి ఇటీవల నలుగురు శిశువులను అపహరించినట్టు  తేలిందన్నారు. ఈ ముఠాలో సభ్యులైన పెంటకోట మహేశ్వరి, కొప్పుల క్రాంతి కలిసి ఈ ఏడాది మార్చిలో కేజీహెచ్‌లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును అపహరించి పెందుర్తికి చెందిన కుసుమకుమారికి రెండున్నర లక్షల రూపాయలకు విక్రయించినట్టు సమాచారం సేకరించామన్నారు. ఈ ముఠా కదలికలపై నిఘా పెట్టి..బుధవారం సబ్బవరం మండలం గాలిభీమవరం సమీపంలో పది మందిని అరెస్టు చేసినట్టు ఎస్‌పీ కృష్ణారావు ప్రకటించారు. వారి నుంచి నలుగురు శిశువులను, రూ.4.2 లక్షల నగదు, మూడు బైక్‌లు, తొమ్మిది సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  నలుగురు శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, తెర వెనుక వున్న మరింత మందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ముఠా గుట్టు రట్టు చేసిన స్థానిక ఏఎస్‌పీ జగదీశ్‌, అరకులోయ సీఐ జీడీ బాబు, ఆ సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్‌పీ అభినందించి నగదు రివార్డులను అందించారు.

Advertisement
Advertisement