ఇండోనేషియా సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2020-03-30T01:44:50+05:30 IST

కరోనా వైరస్ కట్టడి కోసం ఇండోనేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని జకార్తా, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన

ఇండోనేషియా సంచలన నిర్ణయం!

జకార్తా: కరోనా వైరస్ కట్టడి కోసం ఇండోనేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని జకార్తా, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మిలియన్ మంది ప్రజలను వెంటనే క్వారంటైన్ చేయాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో నాలుగోదైన ఇండోనేషియాలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.


గ్రేటర్ జకార్తా ప్రాంతంలో ప్రజల కదలికలను నియంత్రించేందుకు పోలీసులు, రవాణాశాఖ అధికారులు ఈ వారాంతంలో డ్రిల్స్ నిర్వహించినట్టు ‘జకార్తా పోస్ట్’ తెలిపింది. వెస్ట్ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ మాట్లాడుతూ.. వైరస్ ప్రభావిత ప్రాంతాలు సహా జకార్తాలో లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. నిర్ధారిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయంవైపు మొగ్గుచూపినట్టు పేర్కొన్నారు.


జకార్తాలో ప్రస్తుతం కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 675కు పెరిగింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం కంటే ఇది ఎక్కువ. అలాగే, ఈ మహమ్మారి బారినపడి 114 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగ్నేయాసియాలో ఇదే అత్యధికం. లాక్‌డౌన్ నేపథ్యంలో రాజధాని ప్రాంత ప్రజలను తమ స్వగ్రామలకు వెళ్లకుండా అడ్డుకుంటారు.


జకార్తా లాంటి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ ఇళ్లకు వెళ్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు మరింత క్లిష్టతరంగా మారతాయని కామిల్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అధికారులు ఇప్పటికే జకార్తాలో ఏప్రిల్ 19 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని, అత్యవసర సేవలకు మాత్రమే బయటకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు.  

Updated Date - 2020-03-30T01:44:50+05:30 IST