మహనీయుల పోరాట స్ఫూర్తి.. స్వాతంత్రోద్యమ దీప్తి..

ABN , First Publish Date - 2022-08-14T06:18:55+05:30 IST

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయింది. ఎందరో సమర వీరులు, సూరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నాం.

మహనీయుల పోరాట స్ఫూర్తి.. స్వాతంత్రోద్యమ దీప్తి..

ఎందరో మహనీయుల త్యాగఫలం

రేపు 75వ స్వాతంత్య్ర దినోత్సవం


రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 13 :  భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయింది. ఎందరో సమర వీరులు,                 సూరుల త్యాగ  ఫలమే నేడు మనం అనుభవిస్తున్నాం. ఉద్యమ కాలంలో ముఖ్య భూమిక పోషించిన పట్టణాలు, నగరాలు, ఆయా ప్రాంతాల్లో రగిలించిన ఉద్యమ స్ఫూర్తి జ్ఞప్తికి వస్తుంది. అటువంటి చరిత్ర రాజమహేంద్రవరానికి ఉంది. రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ వీరుల త్యాగాలను ఒకసారి స్మరించుకుందాం.. జేజేలు పలుకుదాం..


 ఇక్కడి నుంచే అల్లూరి..


రాజమహేంద్రవరంలో చదువుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేక బీజం పడింది రాజమహేంద్రవరంలోనే..  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అల్లూరి తన తండ్రి వృత్తి రీత్యా రాజమహేంద్రవరం లో స్థిరపడాల్సి వచ్చింది.ఆ సమయంలో గుర్రాల పై సంచరించే తెల్లదొరలకు సలామ్‌ చెప్పడాన్ని ఆ పిన్న వయసులోనే వ్యతిరేకించారు అల్లూరి సీతారామరాజు.. స్వాతంత్రోద్య మం లో గాంధీ మార్గం అహింసా వాదాన్ని వ్యతిరేకించారు. తెల్లదొరలపై గెరిల్లా పోరాటాలకు పురిగొల్పి బ్రిటీష్‌ పాలకులను పరుగులు పెట్టించారు. విద్యాబుద్ధులు నేర్చుకుని అల్లూరి అడవి బాట పట్టారు. గిరిజనులను చైతన్యవంతం చేసి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని నిర్మించారు. తూర్పు, విశాఖ ఏజన్సీలు కేంద్రంగా అల్లూరి పోరాటం చేశారు. దేశం కోసం బ్రిటీష్‌ తుపాకి తూటాలకు గుండెలు ఎదురొడ్డి ప్రాణాలు విడిచారు. 


స్వాతంత్య్ర సమరయోధుల పార్కు చరిత్ర ఇదే..


స్వాతంత్రోద్యమ సమయంలో రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో బిపిన్‌ చంద్రపాల్‌ పర్యటించారు. ప్రజలను స్వాతంత్రోద్యమం వైపు మరల్చేందుకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.ఈ సభ తర్వాత రాజమహేంద్రవరం ఉద్యమం రూపం మారింది. అప్పటి నుంచి బిపిన్‌ చంద్రపాల్‌ సభ నిర్వహించిన ప్రాంతానికి పాల్‌ చౌక్‌గా నామకరణ చేశా రు.అటుపై స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన 19 మంది ఉద్యమకారుల విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసి దానిని స్వతం త్య్ర సమరయోదుల పార్కుగా నామకరణ చేశారు. అక్కడే లైబ్రరీని ఏర్పాటు చేసి మహనీయుల పుస్తకాలు అందుబాటులో వుంచారు. పార్కులో మహాత్మగాంధీ, టంగుటూరి ప్రకాశం పంతులు, చిలకమర్తి లక్ష్మినరసింహం, మద్దూరి అన్నపూర్ణయ్య, బారు అలివేలమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, కాశీ భట్ల రమణమ్మ, దేవతా శ్రీరామ్మూర్తి,గుజ్జు నాగరత్నం, శివరాజు సుబ్బ మ్మ, చేబియ్యం సోదెమ్మ, తల్లా పగ్రడ విశ్వసుందరమ్మ,డాక్టర్‌బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం,పాలకోడేటి శ్యామలాంబ, కం దుల వీరరాఘవ స్వామి నాయుడు,వరదరావు, శేఠ్‌ జీవన్‌లాల్‌, బుద్ధవరపు సూర్యనారాయణ, దాసరి సుబ్బారావు, ఏబి నాగేశ్వరరావు విగ్రహాలను ఏర్పాటు చేశారు.స్వాతం త్రోద్య మంలో మహిళలు కీలకంగా వ్యహరించారనడానికి ఈ పార్కులో పెట్టిన మహిళా ఉద్యమ కారుల విగ్రహాలే నిదర్శనం. తమ ఆస్తుల ను,జీవితాలను త్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని అందించారు. 


రాజమహేంద్రికి నాలుగు సార్లు గాంధీ..


 స్వాతంత్య్ర సముపార్జనలో తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ.. స్వాతంత్ర్యానికి ముందు రాజమహేంద్రవరం నాలుగు సార్లు వచ్చారు. ఆయన తొలిసారి 1921 మార్చి 30న విజయనగర నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అప్పుడు ప్రజలకు స్వదేశీ వస్తువులు వినియోగించాలని, స్వరాజ్యనిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.  1921 ఏప్రిల్‌ 6న కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చి పాల్‌ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారకు. 1929 మే 7న గాంధీ రాజమహేంద్రవరం పాల్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు సుమారు 20 వేల మంది వచ్చారు. 1933 డిసెంబరు 25న గాంధీజీ మద్రాసు నుంచి  రాజమహేంద్రవరం పాల్‌ చౌక్‌కు చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు. 1946లో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆయన ఆ రోజు మౌనవ్రతంలో ఉండటం వల్ల తాను మాట్లాడాలను కున్న ప్రసంగాన్ని ఒక పేపరుపై రాసి వేరోకరితో చదివించారు. ఇలా రాజమహేంద్రవరంతో మహాత్మాగాంధీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 


స్వాతంత్య్ర సమరయోధుల కోరుకొండ


కోరుకొండ, ఆగస్టు 13 : భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోరుకొండ ప్రాంతానికి చెందిన సుమారు 10 మంది గాంధీ వెంట నడిచారు. వారంతా ప్రస్తుతం గతించినప్పటికీ జ్ఞాపకాలు ఇంకా పదిలంగా  ఉన్నాయి. కోరుకొండకు చెందిన నండూరి శోభనాదాచార్యులు, తేజోమూర్తుల సూర్యనారా యణమూర్తి, దోసకాయలపల్లి గ్రామానికి చెందిన మార్ని సత్యనారా యణ, సూదిన కొండయ్య, మార్ని ధర్మరాజు, అనే వెంక ట్రాయుడు, నెక్కంటి రామారాయుడు, కోరిన ప్రకాశం,మార్ని రంగారావు స్వాత్రంత్య పోరాటంలో గాంధీ అడుగులో అడుగు వేశారు. నండూరి శోభనాదాచార్యులు హిందీ పండిట్‌గా పని చేసేవారు. గాంధీజీ పిలుపుమేరకు స్వాతంత్రద్యోమంలో పాలుపంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గాంధీజీ పర్యటించినప్పుడు ఆయన ఉపన్యాసాలను శోభనాదా చార్యులు తెలుగులో అనువదించేవారు. బ్రిటీష్‌ ప్రభుత్వం శోభనా దాచార్యులను అరెస్ట్‌ చేసి రెండు నెలల పాటు బళ్ళారి జైల్లో ఉంచింది. ఆయనకు నలుగురు కుమా రులు, ఇద్దరు కుమార్తెలు. శోభనాదాచార్యులు చిన్న కుమారుడు నండూరి శేషాచార్యులు 2014లో కోరుకొండలో శోభనాదాచార్యుల పేరున శోభనాద్రి నిలయం నిర్మించుకుని ఆయన జ్ఞాపకాలు నెమరు వేసుకుని విశ్రాంతి తెలుగు పండిట్‌గా కాలక్షేపం చేస్తున్నారు. నండూరి శోభనాదాచార్యులు 92 ఏళ్ల వయసులో 2002 సెప్టెంబరులో పరమపదిం చారు. ప్రస్తుతం కోరుకొండ పరిసరాల్లో స్వతంత్య్ర సమరయోధుల పేరు చెప్పగానే ముందుగా         గుర్తు వచ్చేది శోభనాదాచార్యులే.  


నేటికీ మిగిలిన రచ్చబండ..


కోరుకొండ, ఆగస్టు 13 : కోరుకొండ మండలం కోటికేశవరంలోని నాగంపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారికి అనుకుని ఉన్న ఈ రచ్చబండకు ఎంతో చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమం నలుదిశగా ఉధృతంగా సాగుతున్న రోజులవి.. ఆ సమయంలో గ్రామస్థులందరూ కలిసి చర్చించుకోవడానికి వీలుగా ఒక రచ్చబండను ఏర్పాటు చేసుకున్నారు. కొండను ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో పెద్దపెద్ద బండరాళ్ళను వందల మంది ప్రజా నీకం దొర్లించుకుంటూ గ్రామం లోని ముఖ్య కూడలి ప్రాంతానికి చేర్చారు. సుమారు 12 బండరాళ్ళు ఓ చోట చేర్చి దానిపైన తాటాకులతో పాక వేశారు. గాంధీజీ నాయకత్వం పట్ల, అభిమానాన్ని పెంచుకున్న గ్రామపెద్దలు స్వాతంత్య్రం అనంతరం ఈ పక్కనే మహత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ములగాల సత్యం నాయకత్వంలో గ్రామంలో కొందరు ఈ బండరాళ్ళపై కూర్చు ని అప్పట్లో స్వాతంత్రోద్యమ గురించి చర్చించుకుంటూ ఉండేవారు. నేటికీ గ్రామంలోని పెద్దలందరూ బండరాళ్ళపై కూర్చుని దేశ రాజకీయాలపై చర్చించుకుంటూనే ఉంటారు. 




మల్లవరంలో గాంధీ ఆశ్రమం


చాగల్లు, ఆగస్టు 13 : స్వాతంత్రోద్యమంలో చాగల్లు మండలం మల్లవరంలోని ఆనందనికేతన్‌ గాంధీ ఆశ్రమం ప్రముఖ పాత్ర వహించింది. 1921 సంవత్సరంలో లకంసాని రంగారావు సోదరులు ఎకరం పొలాన్ని విరాళంగా అందజేయగా తల్లాప్ర గడ నరసింహశర్మ సతీమణి విశ్వసుందరమ్మ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ పొలంలో కాశీనా ధుని నాగేశ్వరరావు ఒక పెంకుటిల్లు నిర్మించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశా రు.ఆ ఆశ్రమాన్ని 1929 ఏప్రిల్‌ 13వ తేదీన మహాత్మగాంధీ సంద ర్శించారు. వందేమాతరం మనదే రాజ్యం నినాదంతో ఇక్కడకు విచ్చేసి స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. రాత్రి బసచేశారు.రాట్నం తిప్పి నూలు వడిశారు. స్వాతంత్రోద్యమానంతరం శిథిలా వస్థకు చేరిన ఆశ్రమం 2008 సంవత్సరం నుంచి గాంధీజి గ్రామ సేవా కేంద్రంగా రూపాంతరం చెందింది.నిడదవోలుకు చెందిన చర్ల విదుల, మృదుల సోదరిమణులు పర్యవేక్షణలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాంధీ మ్యూజియం, కస్తూ రిబా గ్రంథాలయం ఏర్పాటు చేసి గాంధీ అధ్యయన కేంద్రంగా నిర్వహిస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇందుకూరి ప్రసాదరాజు కోరుతున్నారు. 



సీతానగరంలో కస్తూర్భాగాంధీ ఆశ్రమం


సీతానగరం, ఆగస్టు 13 : రాజమహేంద్రవరానికి 25 కి.మీ దూరంలో ఉన్న సీతానగరంలో 1924లో బ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యం గోదావరి గట్టుకు సమీపంలో  గౌతమి సత్యాగ్రహాశ్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని బాపూజీ రెండు సార్లు సందర్శించారు.గాంఽధీ తన ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా సీతానగరం ఆశ్రమానికి 1929 మే 8,9వ తేదీల్లో తొలిసారిగా వచ్చి ఆశ్రమ కార్యక్రమాలను చూసి సుబ్రహ్మణ్యంను అభినందించారు.హరిజనోద్ధరణయాత్రలో భాగంగా 1933 డిసెంబరులో ఈ ఆశ్రమానికి 2వ సారి వచ్చి ఆశ్రమవాసులను ఉత్తేజపర్చారు. బాపూజీ సతీసమేతంగా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. కస్తూర్బాగాంధీ పరమపదించిన అనంతరం ఆమె పేరుతో గౌతమి సత్యాగ్రహా శ్రమానికి కస్తూర్భాగాంధీ ఆశ్రమంగా పేరు మార్చి సేవాకార్యక్రమాలను ప్రారంభించారు.  ప్రస్తుతం ఈ ఆశ్రమానికి నిధులు నిలిచిపోవడంతో ఆశ్రమంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు స్థంభించిపోయాయి. రోజూ ఆశ్రమంలో చేరిన మహిళలకు భోజనం పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆశ్రమ ప్రతినిధి జి.సుశీల దాతలను ఆశ్రయిస్తున్నారు.  



తణుకులో సత్యాగ్రహ దీక్ష చేసి..


నిడదవోలు, ఆగస్టు 13 :  ఎందరో మహాను భావులు ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొ న్నారు.గాంధీ వెంట నడిచి స్వాతంత్య్రం సాధించి పెట్టారు. వారి వారసులు నేటికీ మన మధ్యనే ఉన్నారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన బలిజేపల్లి రామకోటి వెంకట్రావు  చిన్న తనం నుంచే స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.తూర్పు గోదావరి జిల్లా రామచంద్ర పురంలో ఇంటర్‌ విద్యను పూర్తి చేసి వచ్చిన అనంతరం తణుకు సమీపంలోని రేలంగి గ్రామంలో స్థిరప డ్డారు. స్వాతంత్య్ర సమర యోధులను స్పూర్తిగా తీసుకుని 1941 జనవరి 7వ తేదీన తణుకులో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీంతో ఆరు నెలల పాటు జైలు శిక్ష, రూ.వంద జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడిం చడంతో వెల్లూరు అల్లిపురం జైలులో శిక్ష అనుభవించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రియశిష్యుడిగా స్వాతంత్రోద్యమం లోను విరివిగా పాల్గొన్నారు.  స్వాతంత్య్రం వచ్చిన తరువాత  రేలంగి గ్రామానికి కరణం గాను అనంతరం ఆ ఊరికి ఐదేళ్ళపాటు ప్రజా సేవకుడిగాను సేవలం దించారు. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నందుకు అప్పటి భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రం సైతం అందుకున్నట్టు నిడదవోలులో స్థిరపడిన వారి మూడో కుమారుడు బలిజేపల్లిరామకోటి సూర్యనారాయణ మూర్తి తెలిపారు.  



Updated Date - 2022-08-14T06:18:55+05:30 IST