‘నోవావాక్స్‌’.. భారత వ్యాక్సినేషన్‌కు ఊపు

ABN , First Publish Date - 2021-06-19T07:41:37+05:30 IST

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఐదు నెలలు దాటింది. ఇప్పటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగారు. ఇంకా వంద కోట్ల మంది వరకు ఎదురుచూస్తున్నారు. కానీ, తగినన్ని టీకాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ‘‘నోవావాక్స్‌’’ ఊపునివ్వనుంది. అమెరికాలోని

‘నోవావాక్స్‌’.. భారత వ్యాక్సినేషన్‌కు ఊపు

సెప్టెంబరు-డిసెంబరు మధ్య 20 కోట్ల డోసులు 

‘కొవావాక్స్‌’ పేరిట దేశంలో సీరం సంస్థ పంపిణీ


న్యూఢిల్లీ, జూన్‌ 18: దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఐదు నెలలు దాటింది. ఇప్పటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగారు. ఇంకా వంద కోట్ల మంది వరకు ఎదురుచూస్తున్నారు. కానీ, తగినన్ని టీకాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ‘‘నోవావాక్స్‌’’ ఊపునివ్వనుంది. అమెరికాలోని మేరీల్యాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న నోవావాక్స్‌ సంస్థ తయారు చేస్తున్న ఈ టీకాను మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ).. ‘‘కోవావాక్స్‌’’ పేరిట పంపిణీ చేయనుంది. సెప్టెంబరు-డిసెంబరు మధ్య 20 కోట్ల డోసులు భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ధర వివరాలను సీరం ఇంకా బహిర్గతం చేయాల్సి ఉంది. ఒక్కో డోసు రూ.1,100కు అటుఇటుగా ఉండొచ్చని భావిస్తున్నారు.  ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 150 కోట్ల టీకాల తయారీని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అటు కొవిడ్‌తో పాటు ఇటు టీకాల కొరత ఎదుర్కొంటున్న పేద, మధ్యస్థ ఆదాయ దేశాలకు వీటిని అందించాలని భావిస్తోంది. 


90 శాతం సామర్థ్యం

దక్షిణాఫ్రికాలో 30వేల మందిపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో నోవావాక్స్‌ టీకా సమర్థత (ఎఫికసీ) 90.4గా తేలింది. ఇది ఫైజర్‌, మోడెర్నా టీకాల సమర్థతకు సమానం. మోడరేట్‌, సివియర్‌ కేసుల్లో నోవావాక్స్‌ సమర్థత వంద శాతమని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. కాగా, గతేడాది సెప్టెంబరులో అసలు కరోనా వైరస్‌ వేరియంట్‌పై చేసిన మూడో దశ ట్రయల్స్‌లో నోవావాక్స్‌ సామర్థ్యం 96 శాతం ఉండటం విశేషం. ఈ సంస్థ ప్రస్తుతం కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా టీకాను అభివృద్ధి చేస్తోంది. 12 ఏళ్ల పిల్లలపైనా క్లినికల్‌ ట్రయల్స్‌ చేపడుతోంది. నోవావాక్స్‌.. పునఃసంయోగకారి ప్రొటీన్‌ టీకా. స్పైక్‌ ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటూ కరోనాకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో శరీరాన్ని నిర్దేశిస్తుంది.

Updated Date - 2021-06-19T07:41:37+05:30 IST