పెంపుడు కుక్క కోసం ఉక్రెయిన్‌లోనే భారత విద్యార్థి

ABN , First Publish Date - 2022-02-27T19:14:51+05:30 IST

యుద్ధ వాతావరణంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఉక్రెయిన్ నుంచి తన పెంపుడు కుక్కను వదిలి రాలేనంటున్నాడు ఒక భారత విద్యార్థి. భారత్‌కు చెందిన రిషభ్ కౌశిక్ అనే విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

పెంపుడు కుక్క కోసం ఉక్రెయిన్‌లోనే భారత విద్యార్థి

యుద్ధ వాతావరణంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఉక్రెయిన్ నుంచి తన పెంపుడు కుక్కను వదిలి రాలేనంటున్నాడు ఒక భారత విద్యార్థి. భారత్‌కు చెందిన రిషభ్ కౌశిక్ అనే విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యుద్ధం నేపథ్యంలో భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రిషభ్ మాత్రం తన పెంపుడు కుక్క లేకుండా ఆ దేశాన్ని వదిలి రావడానికి ఇష్టపడటం లేదు. నిబంధనల ప్రకారం ఆ కుక్కను తెచ్చేందుకు ఇబ్బందులు ఎదురవడంతో, ఏం చేయాలో తెలియక రిషభ్ సతమతమవుతున్నాడు. ఎవరైనా తనకు సాయం చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు ఒక వీడియో ద్వారా తన పరిస్థితిని వివరించాడు.


‘‘ప్రస్తుతం నా పెంపుడు కుక్కతో ఒక బంకర్‌లో దాక్కున్నా. నేను కుక్కతోపాటే ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే, ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కుక్కను తీసుకొచ్చే విషయంలో సాయపడటం లేదు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించినా, ఇంకొన్ని డాక్యుమెంట్లు కావాలంటూ అడుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. భారత ప్రభుత్వ యానిమల్ క్వారంటైన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్‌ను సంప్రదిస్తున్నా ఎలాంటి స్పందనా ఉండటం లేదు. ఢిల్లీలో ఉన్న తెలిసిన వాళ్లను సంప్రదించినా సాయం అందడం లేదు. యుద్ధ వాతావరణంతో కుక్క చాలా భయపడింది. తనను వదిలేసి రాలేను. నాకు ఆదివారం రోజే ఇండియాకు ఫ్లైట్ ఉంది. అయితే, ఈ పరిస్థితుల్లో ఇక్కడే ఉండిపోయా. ఈ విషయంలో ఎవరైనా సాయం చేస్తారని ఆశిస్తున్నా’’ అంటూ రిషభ్ పేర్కొన్నాడు.

Updated Date - 2022-02-27T19:14:51+05:30 IST