ఈ పది మంది నేతలు.. దేశ రాజకీయాల్లో వెరీ స్పెషల్.. విద్యార్హతలో టాప్..!

ABN , First Publish Date - 2021-05-01T18:26:17+05:30 IST

ఉన్నత చదువులు చదువుకున్న వారు, విదేశీ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన వారు కూడా భారత రాజకీయాల్లో చక్రం తిప్పారు.

ఈ పది మంది నేతలు.. దేశ రాజకీయాల్లో వెరీ స్పెషల్.. విద్యార్హతలో టాప్..!

ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నా ఎంతో కొంత చదువుకుని ఉండాలి. కానీ, ఆ ప్రభుత్వాన్ని నడిపే అధినాయకుడికి మాత్రం ఎలాంటి క్వాలిఫికేషనూ అక్కర్లేదు. పెద్ద చదువులు చదువుకోని వారు.. ఇతర ఉద్యోగం లేని వారు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారనేది కేవలం అపోహ మాత్రమే కాదు.. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని ఐయేఎస్‌గా సెలెక్ట్ అయిన అధికారులు.. నిరక్ష్యరాస్యుడైన మంత్రి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందేననేది సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. ఈ వాదనలన్నీ కాదనలేని వాస్తవాలే. అయితే దీనికి మరో పార్శ్వం కూడా ఉంది.


ఉన్నత చదువులు చదువుకున్న వారు, విదేశీ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన వారు కూడా భారత రాజకీయాల్లో చక్రం తిప్పారు. తమ జ్ఞానంతో ప్రగతిని పరుగులు పెట్టించారు. అలాంటి ఉన్నత విద్యావంతులైన రాజకీయనాయకుల్లో కొందరి వివరాలు.. 



మన దేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో అత్యున్నత విద్యావంతుడు మన్మోహన్ సింగ్. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ చేశారు. యూనివర్సీటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి `ఎకనమిక్స్ ట్రిపోస్` కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆర్థిక సలహాదారుగా, రిజర్వ బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయిన తర్వాత మన్మోహన్‌ను ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు. మన్మోహన్ హయాంలోనే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై భారత్‌ వృద్ధి బాట పట్టింది. 


యూపీఏ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన కపిల్ సిబల్ న్యాయ కోవిదుడు. ఢిల్లీ యూనివర్సీటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎమ్ఏ (హిస్టరీ) పూర్తి చేసిన కపిల్ సిబల్.. హార్వార్డ్ న్యాయ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం కొంత కాలం న్యాయవాదిగా పనిచేశారు. న్యాయ శాఖకు, మానవ వనరుల శాఖకు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 


రాజకీయ నాయకుడిగా, రచయితగా ప్రసిద్ధుడైన శశి థరూర్ తన లాంగ్వేజ్ స్కిల్స్‌తో అబ్బురపరుస్తుంటారు. ఈయన ఆంగ్ల భాషలో 19 పుస్తకాలు రాశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న శశి థరూర్.. టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. కేవలం 22 సంవత్సరాలకే పీహెచ్‌డీ పట్టా అందుకున్న వ్యక్తిగా ఘనత సాధించారు. 


ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నత విద్యావంతుడే. శ్రీ జయరామచంద్ర యూనివర్సిటీ నుంచి సివిల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో అఖిలేష్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం అస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ నుంచి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 


రెండేళ్ల క్రితం మరణించిన అరుణ్ జైట్లీ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా తనదైన ముద్ర వేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకామ్ పట్టా అందుకున్న అరుణ్ జైట్లీ.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేశారు. 


మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పళనియప్పన్ చిదంబరం హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో ఏమ్‌బీఏ పూర్తి చేశారు. మద్రాస్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, చెన్నై లయోలా కాలేజ్‌లో న్యాయశాస్త్రంలో పీజీ, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల నుంచి స్టాటస్టిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 


రాజకీయాల్లోకి రాక ముందు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటికల్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గణిత శాస్త్రంలో పీజీ పట్టా అందుకున్నారు. అలాగే ఇండియన్ స్టాటస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం హార్వార్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. 


భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడైన మురళీ మనోహర్ జోషి అలహాబాద్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేసిన జోషి అక్కడే ప్రొఫెసర్‌గా సేవలందించారు. మీరట్ కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. 


భారత్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలి ఐఐటియన్‌గా గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రికార్డు సాధించారు. పారికర్ ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెటాలుర్జికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 


భారతీయ జనతా పార్టీ మాజీ ఉపాధ్యక్షురాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా కూడా ఉన్నత విద్యా వంతురాలే. ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో ఆమె కార్డియాక్ ఎనాటమీలో పీహెచ్‌డీ, జూవాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 

 




మన్మోహన్ సింగ్


కపిల్ సిబల్


శశి థరూర్


అఖిలేష్ యాదవ్


అరుణ్ జైట్లీ


పి.చిదంబరం


సుబ్రహ్మణ్య స్వామి


మురళీ మనోహర్ జోషి


మనోహర్ పారికర్


నజ్మా హెప్తుల్లా

Updated Date - 2021-05-01T18:26:17+05:30 IST