ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు తీసుకోవలసిందే... ట్విటర్, ఫేస్‌బుక్‌లకు తెగేసిన చెప్పిన ప్రభుత్వం...

ABN , First Publish Date - 2022-02-02T22:36:47+05:30 IST

సామాజిక మాధ్యమాల వేదికలపై బూటకపు వార్తలను తొలగించేందుకు

ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు తీసుకోవలసిందే... ట్విటర్, ఫేస్‌బుక్‌లకు తెగేసిన చెప్పిన ప్రభుత్వం...

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల వేదికలపై బూటకపు వార్తలను తొలగించేందుకు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్‌లను కేంద్ర ప్రభుత్వం నిలదీసింది. ఈ బిగ్ టెక్ కంపెనీల ప్రతినిధులు, భారత ప్రభుత్వ అధికారుల మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. ఈ వివరాలను ఓ వార్తా సంస్థకు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా బుధవారం వెల్లడించింది. ఈ సమావేశం సోమవారం వర్చువల్ విధానంలో జరిగినట్లు పేర్కొంది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కంపెనీల తీరును తీవ్రంగా విమర్శించారు. ఫేక్ న్యూస్‌పై ఈ కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందువల్ల ఆ కంటెంట్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించవలసి వస్తోందని, పర్యవసానంగా వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను భారత ప్రభుత్వం అణచివేస్తున్నట్లు అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఈ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వాధికారుల చర్చలు వాడివేడిగా, ఉద్విగ్న వాతావరణంలో జరిగినట్లు జాతీయ మీడియా తెలిపింది. దీనినిబట్టి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, అమెరికన్ టెక్ జెయింట్స్ మధ్య సంబంధాలు మరింత బలహీనపడినట్లు అర్థమవుతోందని తెలిపింది. అయితే కంపెనీలకు ఎటువంటి అల్టిమేటమ్‌ను జారీ చేయలేదని, కంటెంట్ మోడరేషన్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పారని పేర్కొంది. టెక్ సెక్టర్ రెగ్యులేషన్స్‌ను ప్రభుత్వం కఠినతరం చేస్తున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో భారతీయ కంటెంట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ షేర్‌చాట్, కూ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు పేర్కొంది. 


డిసెంబరు, జనవరి నెలల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అత్యవసర అధికారాలను వినియోగించి 55 యూట్యూబ్ చానళ్ళు, ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాలను నిలిపేసింది. ఈ చానళ్లు ఫేక్ న్యూస్‌ను, భారత దేశ వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్లు తెలిపింది. ఈ తప్పుడు సమాచారాన్ని పాకిస్థాన్ కేంద్రంగా ఖాతాలుగలవారు వ్యాపింపజేస్తున్నారని తెలిపింది. 



Updated Date - 2022-02-02T22:36:47+05:30 IST