ప్రతిమలు, ప్రశ్నలు

ABN , First Publish Date - 2022-05-28T06:28:05+05:30 IST

కైకేయి తన వాగ్దానాన్ని నెరవేర్చమని పట్టుబట్టడంతో, శ్రీరాముడి పట్టాభిషేకం నిలిచిపోయి అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు,

ప్రతిమలు, ప్రశ్నలు

కైకేయి తన వాగ్దానాన్ని నెరవేర్చమని పట్టుబట్టడంతో, శ్రీరాముడి పట్టాభిషేకం నిలిచిపోయి అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు, పుత్రశోకంతో దశరథుడు చనిపోయినప్పుడు– భరతుడు ఎక్కడున్నాడు? ఏ కారణం వల్లనో అతను అయోధ్యలో లేడు. అట్లా లేకపోవడాన్ని సంస్కృత నాటకకర్త భాసుడు తన ప్రతిమానాటకంలో ఒక కొత్త సన్నివేశాన్ని కల్పించడానికి ఉపయోగించుకున్నాడు. ఆ ఘట్టమే, నాటకానికి ‘ప్రతిమ’ అన్న పేరు పెట్టడానికి కూడా కారణమయింది. తాతగారింటికో ఎక్కడికో బయటికి వెళ్లిన భరతుడికి, అయోధ్య విశేషాలు ఏమీ తెలియవు. దశరథుడి మరణం తరువాత, వెంటనే రమ్మని మాత్రం కబురు వచ్చింది. ప్రయాణమై, అయోధ్య శివారులో మంచి ఘడియల కోసం ఆగుతాడు భరతుడు. అక్కడ ఒక భవనం ఉంటుంది. అది ప్రతిమల కొలువు ఉన్న భవనం. తన వంశ పూర్వీకుల విగ్రహాలు ఉన్న భవనం అది అని తెలుస్తుంది. గతించిన వారి ప్రతిమలను దాటుకుంటూ వెళ్లినప్పుడు, చివరకు దశరథుడి బొమ్మ కూడా తారసపడుతుంది. తండ్రి గతించాడన్న విషయం భరతుడికి అట్లా తెలుస్తుంది. అప్పటికి దశరథుడు మరణించి కొద్దిరోజులే అయింది. ఇంకా అంత్యక్రియలు జరగలేదు. దశరథుడి భౌతిక శరీరాన్ని తైలభాండంలో భద్రపరిచారు.


మృతదేహాన్ని భధ్రపరిచే సాంకేతిక పరిజ్ఞానం ఆ నాటికే, అంటే రామాయణం కాలం నాటికి కాకున్నా, కనీసం భాసుడి కాలం నాటికి, మన పూర్వీకులకు తెలుసునని ఆశ్చర్యపోతాం. నాటక సంవిధానంలో భాసుడి నేర్పు, ఆ సన్నివేశ కల్పనలోని ప్రతిభ వంటివన్నీ సరే, కానీ, మనుషుల రూపురేఖలతో ప్రతిమలను చేయడం ‘అప్పటికే’ ఉన్నదన్నది మరొక ఆసక్తికరమైన సమాచారం. ఇంతకీ భాసుడు ఎప్పటివాడు? ఆయన పేరు పదిహేనువందల ఏళ్ల నుంచి ఉటంకింపులలో ఉన్నది కానీ, 1913 దాకా, ఆయన రచనలు సుదీర్ఘకాలం అలభ్యంగా ఉన్నాయి. జీవితవిశేషాలు ఏమీ తెలియకపోవడం వల్ల ఆయన రాసినట్టు గుర్తించిన పదమూడు నాటకాలలో అంతర్గత సాక్ష్యాల ఆధారంగా కాలనిర్ణయం చేయడానికి ప్రయత్నం జరిగింది. భాసుడి భాష, శైలి కాళిదాసు కాలపు సంస్కృతానికి దగ్గరగా ఉన్నాయి. కాళిదాసు కాలం క్రీస్తుశకం ఐదో శతాబ్దం అని అధికులు అంగీకరిస్తున్నారు. రామాయణంలో కానీ, మరెక్కడ గానీ లేని ప్రతిమాభవనం అన్న భాసుడి కల్పనకు ఆధారం, అప్పుడప్పుడే విస్తరిస్తున్న శిల్పకళావైభవమేనా? మనుషులు రాతి మీద, మట్టితోను, లోహాలతోను బొమ్మలు గీయడం, చేయడం ఎప్పటినుంచో ఉన్నది. కానీ, ప్రతిమలు వేరు. రాతితో అన్ని పార్శ్వాలు కలిగిన గుండ్రటి శిల్పాన్ని రూపొందించడం భారతదేశంలో క్రీస్తుపూర్వ కాలంలో కనిపించదు. బుద్ధుడి, మహావీరుడి విగ్రహాలు కూడా భారతదేశంలో క్రీస్తుశకారంభం తరువాతనే కనిపిస్తాయి. అశ్వమేధంలో సీతాదేవి ప్రతిమను సహచరిగా పరిగణించాలని రాముడు ప్రయత్నించినట్టు చెప్పిన ఉత్తరరామాయణం అనంతరకాలపు రచన అనే వాదనలున్నాయి.


అన్నిటికీ పరిణామం ఉన్నట్టే, భారతదేశంలో విగ్రహాలకు, దేవాలయాలకు కూడా ఒక క్రమచరిత్ర ఉన్నది. గుడులూ గోపురాలూ చరిత్రపూర్వయుగం నుంచి ఉన్నాయని నమ్మేవారుంటారు. రామాయణంలో కానీ, భారతంలో కానీ దేవాలయాల ప్రస్తావనే లేదన్న సంగతి వారికి తెలియదు. అంతేకాదు, విగ్రహారాధన కూడా కాలక్రమంలో ప్రవేశించిందే తప్ప, బౌద్ధంలో కానీ, వైదిక మతంలో కానీ తొలినాళ్లలో విగ్రహారాధన లేదు. బౌద్ధంలో థేరవాద నిర్మాణాలలో సంకేతాలు ఉంటాయి కానీ సంపూర్ణ మానవాకారాలు ఉండవు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి వేదకాలపు దేవుళ్లకు ఆలయాలు కానీ, ఆకారాలు కానీ లేవు. భారతీయ తత్వశాస్త్రంలో సగుణ, నిర్గుణ దైవ చర్చ సుదీర్ఘకాలం సాగిందే. వేదకాలపు పద్ధతులు తప్ప మరిదేనినీ సమ్మతించనని చెప్పిన దయానంద సరస్వతి విగ్రహారాధనను ససేమిరా అన్నారు. బుద్ధుడికి, బౌద్ధానికి సంబంధించి తప్ప, చారిత్రక స్మారకస్థలాలు మరే దైవానికీ ఉన్నట్టు వినము. అశోకుడితో మొదలుకొని సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాజపోషణను, జనాదరణను కలిగి ఉన్న బౌద్ధయుగంలో జరిగిన మహా నిర్మాణాలే, వైదికం నుంచి పరిణమిస్తూ వచ్చిన హైందవంలో ఆలయనిర్మాణాలకు ప్రేరణ అయిందని, గుప్తుల కాలంలో వర్ధిల్లిన తొలినాటి వైష్ణవం గుడుల విప్లవానికి కారణమయిందని అంటారు.


బౌద్ధం, జైనం, తొలినాటి వైష్ణవం, అద్వైత శైవం, విశిష్టాద్వైత వైష్ణవం, వీరశైవం, వీర వైష్ణవం ఈ మతాలన్నీ ఆయాకాలాలలో ఉచ్చస్థితిలో ఉండి, అనంతర మతాల వెల్లువ వల్ల క్షీణించిపోయాయి. మతాల మధ్య స్పర్థ చర్చలకు వాదాలకు పరిమితం కాలేదు. అనేక ఆలయాలు కొత్త మతాలలోకి బలవంతంగా పరివర్తన చెందాయి. అనేక ఆలయాలు, ఆరాధకులు లేక పాడుపడిపోయాయి. ఊర్లకు ఊర్లు ప్రాంతాలకు ప్రాంతాలు యుద్ధాలలోనో, కాటకాలలోనో నిర్మానుష్యమై పోయాయి. దేశీయమతాలు అంతర్గతంగా పోటీపడినట్టే, బయటి నుంచి వచ్చిన ఇస్లామ్ కూడా తన వ్యాప్తి కోసం ప్రయత్నించింది. కుల అంతరాల భారతీయ సామాజిక వ్యవస్థతో ఘర్షణపడి పరిపాలన చేయడం సాధ్యం కాదని తెలుసుకుని, మత స్పర్థను పరిమితం చేసుకున్నది. అయినా అనేక విధ్వంసాలు జరిగి ఉండవచ్చు. అనేక నిర్మాణాలూ జరిగి ఉండవచ్చు. భారతదేశంలోని ప్రార్థనాస్థలాలన్నిటి కింద అనేక పొరల మతచరిత్రలు ఉండవచ్చు. మన ప్రస్తుత విశ్వాసాలు కూడా ఎప్పటినుంచో చెక్కుచెదరకుండా ఉన్నవి కావు. అనేకం చెదిరిపోయి, కొత్తవి రూపొంది, సమన్వయం పొందినవి.


చరిత్ర అంతా దేవుళ్ల పేరిట తగవులాటలే. దేవుడు, ఒక మహిమాన్విత శక్తి, ఉంటే సర్వశక్తిమంతుడిగానే కాదు, సర్వవ్యాపిగాను, అందరి దేవుడుగాను ఉంటాడు కదా, ‘ఎందెందు వెదకి చూచిన అందందే’ కనిపించే దేవుడి కోసం మనం ఏ శిథిలాలలో వెదుకుదాం? ఒక దేవుడి పక్షాన మరో దేవుడి మీదికి ఎందుకు పోరాడడం?

Updated Date - 2022-05-28T06:28:05+05:30 IST