న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌లు శనివారంనాడు తమ అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో దౌత్య మార్గంలో ఏకకాలంలో ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకున్నట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సమాచార మార్పిడి జరిగినట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి
అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందంపై 1988 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ సంతకం చేశాయి. 1991 జనవరి 27 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పట్నించి 31 ఏళ్లుగా ఏటా జనవరి 1న ఇరుదేశాలు ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఈ ఆనవాయితీని కొననసాగించారు.