'స్వయం సమృద్ధి భారత్' మా విజన్: యూఎన్‌జీఏ డిబేట్‌లో మోదీ

ABN , First Publish Date - 2020-09-27T01:26:50+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 'స్వయం సమృద్ధి భారతం'గా పురోగమిస్తోందని...

'స్వయం సమృద్ధి భారత్' మా విజన్: యూఎన్‌జీఏ డిబేట్‌లో మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 'స్వయం సమృద్ధి భారతం'గా పురోగమిస్తోందని, 26 వారాల పాటు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవు కల్పించడం ద్వారా మహిళల ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. న్యూయార్క్‌లో శనివారంనాడు జరిగిన 75వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) జనరల్ డిబేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొని, ప్రసంగించారు.


'మహమ్మారి (కరోనా) శకం అనంతరం మారిన పరిస్థితుల్లో స్వయం సమృద్ధి భారత్ విజన్‌తో మేము ముందుకు వెళ్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు స్వయం సమృద్ధ భారతం ఒక శక్తిలా నిలుస్తుంది. ఎలాంటి వివక్షకు తావులేని విధంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తున్నాం' అని మోదీ తెలిపారు. మహిళలకు 26 వారాల పాటు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ కల్పిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇదేవిధంగా భారత్‌లో ట్రాన్స్‌జెండర్స్‌ హక్కులను కూడా కాపాడుతున్నామని చెప్పారు. చట్టపరంగా తగిన సంస్కరణలు తీసుకు రావడం ద్వారా ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాపాడుతున్నామని వివరించారు.


బహిరంగ మలమూత్ర విసర్జన (ఓపెన్ డిఫకేషన్) నుంచి 600 మిలియన్ల మందికి విముక్తి కలిగించామని, 500 మిలియన్ల మందికి ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పించామని మోదీ వివరించారు.'రిఫార్మ్-పెర్‌ఫార్మ్-ట్రాన్స్‌ఫార్మ్' మంత్రంతో లక్షలాది మంది దేశప్రజల్లో జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు బృహత్ ప్రయత్నాలు చేశామని, కేవలం 4 నుంచి 5 ఏళ్లలోనే ఓపెన్ డిఫకేషన్ నుంచి 600 మిలియన్ల మందికి విముక్తి లభించిందని, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాకున్నా అనుకున్న లక్ష్యాన్ని భారత్ సాధించగలిగిందని వివరించారు. కేవలం 2-3 ఏళ్లలోనే 500 మిలియన్ల మందికి ఉచిత హెల్త్ కేర్ సౌకర్యం కల్పించామని, ఇది కూడా ఆషామాషీ వ్యవహారం కాదని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-27T01:26:50+05:30 IST