అదే జరిగితే దేశంలో కరోనా థర్డ్ వేవ్: ఎయిమ్స్

ABN , First Publish Date - 2021-05-05T01:22:34+05:30 IST

దేశం థర్డ్ వేవ్‌ను చూడాల్సి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు

అదే జరిగితే దేశంలో కరోనా థర్డ్ వేవ్: ఎయిమ్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కనుక ఇలానే చెలరేగుతూ రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునేలా అభివృద్ధి చెందితే దేశం థర్డ్ వేవ్‌ను చూడాల్సి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధించడంపై మాట్లాడుతూ.. వాటివల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. దేశంలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడమే పరిష్కారమా? అన్న ప్రశ్నకు డాక్టర్ గులేరియా బదులిస్తూ.. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నిర్ణీత కాలంపాటు లాక్‌డౌన్ విధించడం అవసరమేనని నొక్కి చెప్పారు.  


ఇక్కడ మూడు విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. అందులో మొదటిది ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, రెండోది యుద్ధ ప్రాతిపదికన కరోనా కేసులు తగ్గించడం, మూడోది వ్యాక్సినేషన్ అని పేర్కొన్నారు. వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు ఈ మూడే మార్గాలన్నారు.


మనుషుల మధ్య కాంటాక్ట్‌ను తగ్గించగలిగితే కేసులు దిగి వస్తాయన్నారు. దానినే మనం లాక్‌డౌన్ అంటామన్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తే కనుక బ్రిటన్ విధించినంత కఠినంగా ఉండాలని అన్నారు. అయితే, అది ఎలా ఉండాలన్నది అక్కడి పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలు ఆలోచించాల్సి ఉంటుందన్నారు. అత్యవసర సేవలు, ప్రజల జీవితాలు, ముఖ్యంగా దినసరి కార్మికులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ అమలు చేయాల్సి ఉంటుందన్నారు.  


వీకెండ్ లాక్‌డౌన్‌లు, నైట్ కర్ఫ్యూలు ఇక్కడ సమస్య కాదని, కనీసం రెండు వారాలపాటైనా దూకుడుగా లాక్‌డౌన్ విధించడమే దీనికి పరిష్కారమన్నారు. కొవిడ్ కేసులను తగ్గించడంపై దృష్టి పెట్టకుండా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాత్రమే దృష్టి సారించడం వల్ల కూడా ఉపయోగం ఉండబోదని డాక్టర్ గులేరియా తేల్చి చెప్పారు.


ఇక్కడ మనం రెండు విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని, ప్రజల్లో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు మనం ఎంత వేగంగా టీకాలు వేయగలమన్నది మొదటిదైతే, వైరస్ ఎలా రూపాంతరం చెందుతోందన్నది రెండోదని అన్నారు. రోగ నిరోధక శక్తిని ఏమార్చేలా వైరస్ అభివృద్ధి చెందితే.. అప్పుడు ప్రజల్లో రోగ నిరోధకశక్తి చాలా తక్కువ ప్రభావం చూపిస్తుందన్నారు. కాబట్టి మళ్లీ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు కరోనా మూడో దశను కూడా చూడాల్సి వస్తుందని డాక్టర్ గులేరియా వివరించారు. 

Updated Date - 2021-05-05T01:22:34+05:30 IST