Abn logo
Feb 26 2021 @ 23:22PM

సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం

సేంద్రియ వ్యవసాయంతోనే భవిష్యత్తు

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సేంద్రియ రైతు కుటుంబాల సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయనకు గుస్సాడీ నృత్యాలతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోమాత పూజా కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాతనే రసాయన ఎరువుల వాడకం మొదలైందన్నారు. వేద గ్రంథాలలోను సేంద్రీయ వ్యవసాయంపై పేర్కొనడం జరిగిందన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతుందన్నారు. నీటి లభ్యత ఆధారంగా పంటలుచేసుకోవాలన్నారు. రసాయన మందులను పిచికారీ చేయడంతో ఆహారం కలుషితం కావడంతో పాటు వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతే యజమానిగా మారే అవకాశం ఉందన్నారు. ప్రకృతి పరమైన సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని ఆరోగ్యవంతమైన పంటలు పండించడంతోనే భావితరాలకు భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయం చేస్తూ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయం, రైతుకు యాజమాన్యపు హక్కులు, సంఘటితం కావడం సేంద్రియ సాగుతోనే సాధ్యపడుతుందన్నారు. అనంతరం ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సేంద్రి య వ్యవసాయాన్ని మరింత విస్తరింప చేయాలన్న ఉద్దేశంతోనే రైతుల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ర్టాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణను కల్పిస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని నారాయణ మహరాజ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఐదఉ రైతు జంటలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఎంపీలు సోయం బాపూరావు, అర్వింద్‌, గిరిజన రైతులతో పాటు ఉమ్మడి జిల్లాలోని ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement
Advertisement