Internet Freedom: ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ వెనుకంజ

ABN , First Publish Date - 2022-06-18T17:45:58+05:30 IST

ఆధునిక జీవన విధానంలో అంతర్జాలం (Internet) విడదీయలేని భాగంగా మారిపోయింది

Internet Freedom: ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్ వెనుకంజ

న్యూఢిల్లీ : ఆధునిక జీవన విధానంలో అంతర్జాలం (Internet) విడదీయలేని భాగంగా మారిపోయింది. నిత్య జీవితంలో అంతర్భాగం అయిపోయింది. పసికందులు సైతం టచ్ స్క్రీన్‌తో ఆటలాడుతున్న కాలంలో ఇంటర్నెట్ లేని క్షణాన్ని ఊహించుకోవడమే కష్టం. అలాంటిది మన దేశంలో నిరసనలు, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినపుడల్లా అంతర్జాల సేవలను రోజుల తరబడి నిలిపేస్తున్నారు. దీంతో అంతర్జాల స్వేచ్ఛలో మన దేశం చాలా వెనుకబడింది. 


తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దాదాపు ఏడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు  Internet Servicesను సస్పెండ్ చేస్తున్నారు. ఫలితంగా అన్ని రంగాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ గృహిణులు సైతం ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 


డిజిటల్ హక్కుల  కోసం గళమెత్తుతున్న సంస్థ యాక్సెస్ నౌ (Access Now) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018 నుంచి 2021 వరకు వరుసగా నాలుగేళ్ళపాటు మన దేశం ఇంటర్నెట్ స్వేచ్ఛలో వెనుకబడింది. 2021లో 106 సార్లు ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో ప్రపంచంలో అంతర్జాల స్వేచ్ఛను సక్రమంగా కల్పించని అతి పెద్ద అపరాధిగా భారత్ నిలిచింది. 


2020లో 29 దేశాల్లో 159 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది, 34 దేశాల్లో 182 సార్లు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. 2021లో భారత దేశం తర్వాతి స్థానంలో మయన్మార్, సూడాన్, ఇరాన్ నిలిచాయి. మయన్మార్‌లో 15సార్లు, సూడాన్‌లో ఐదుసార్లు, ఇరాన్‌లో ఐదుసార్లు అంతర్జాల సేవలకు అంతరాయం కలిగింది. 


రాజకీయ పరిస్థితులపై ప్రభావం పడినపుడు...

ముఖ్యంగా రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే ఎన్నికలు, నిరసనలు వంటివి జరిగేటపుడు ఇంటర్నెట్‌ను నిలిపేస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ, 2021లో ఇంటర్నెట్ షట్‌డౌన్స్ నాటకీయంగా పెరిగాయి. 2021లో సుదీర్ఘ అంతరాయాలతోపాటు తాత్కాలిక అంతరాయాలు కూడా కనిపించాయి. ఈ అంతరాయాలకు చెప్తున్న కారణాలు మాత్రం ఒకే విధంగా ఉంటున్నాయి. 



పారదర్శకత కరవు

Access Now మరొక ముఖ్యమైన ఆరోపణ చేసింది. ప్రభుత్వంలో పారదర్శకత లేకపోవడం వల్ల భారత దేశంలో కొన్ని నెట్‌వర్క్ అంతరాయాల గురించి తమ నివేదికలో ప్రస్తావించలేకపోయామని తెలిపింది. దేశవ్యాప్తంగా అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపేసినపుడు, ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేసే సమగ్ర వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తెలిపింది. సస్పెన్షన్ రూల్స్, 2017ను, వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చడంలో వైఫల్యం కనిపిస్తోందని పేర్కొంది. ఈ సమాచారాన్ని ఒకే చోట అందుబాటులో ఉంచే వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు, ఇతరులు అసలు వివరాలను తెలుసుకోలేకపోతున్నట్లు చెప్పింది. ఇంటర్నెట్ షట్‌డౌన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా మానిటర్ చేస్తూ, నమోదు చేయడం సాధ్యం కావడం లేదని, కొన్ని అంతరాయాలు నమోదవడం లేదని వివరించింది. 


పెద్దగా ఎవరూ లేవనెత్తని మరొక అంశం

చట్టాన్ని అమలు చేయవలసిన అంశాల్లో భారత ప్రభుత్వ అసమర్థతను ఇంటర్నెట్ షట్‌డౌన్లు కప్పిపుచ్చుతున్నాయని పౌర సమాజం, డిజిటల్ హక్కుల ఉద్యమకారులు చాలా కాలం నుంచి ఆరోపిస్తున్నారు. అయితే పెద్దగా ఎవరూ లేవనెత్తని మరొక అంశం కూడా ఉంది. అది ఏమిటంటే, దేశానికి జరిగే ఆర్థిక నష్టం. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ 2016లో నిర్వహించిన విశ్లేషణలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇంటర్నెట్ షట్‌డౌన్ల వల్ల భారత దేశానికి దాదాపు 1 బిలియన్ డాలర్ల నష్టం జరిగిందని అంచనా. ఈ సంస్థ 19 దేశాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో అత్యధిక ఆర్థిక నష్టం భారత దేశానికే జరిగినట్లు వెల్లడైంది. 


Updated Date - 2022-06-18T17:45:58+05:30 IST