భారత్‌ జయోటెక్‌

ABN , First Publish Date - 2021-01-03T07:05:24+05:30 IST

ఫార్మా హబ్‌గా ఓ వెలుగు వెలుగుతున్న హైదరాబాద్‌ పేరు మరోమారు యావత్‌ ప్రపంచంలో మార్మోగనుంది. కరోనాపై కదనం సలుపుతున్న భారతావనికి తొలి స్వదేశీ టీకాను అందించిన బంగారు గడ్డగా భాగ్యనగరి పేరు చరిత్ర

భారత్‌ జయోటెక్‌

హైదరాబాదీ కంపెనీ కరోనా టీకా ‘కొవాగ్జిన్‌’కు పచ్చజెండా

అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు

డీసీజీఐకు సిఫారసు చేసిన సీడీఎస్‌సీఓ నిపుణుల కమిటీ 

డీసీజీఐ అనుమతులు వచ్చేది నేడే!.. కోటి డోసులు సిద్ధం

ధర రూ.100లోపే ఉండొచ్చంటున్న ఔషధరంగ నిపుణులు

ఆరు నెలల్లోనే ఆవిష్కృతమైన స్వదేశీ వ్యాక్సిన్‌


న్యూఢిల్లీ, జనవరి 2: ఫార్మా హబ్‌గా ఓ వెలుగు వెలుగుతున్న హైదరాబాద్‌ పేరు మరోమారు యావత్‌ ప్రపంచంలో మార్మోగనుంది. కరోనాపై కదనం సలుపుతున్న భారతావనికి తొలి స్వదేశీ టీకాను అందించిన బంగారు గడ్డగా భాగ్యనగరి పేరు చరిత్ర పుటలకు ఎక్కనుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌)కు అనుమతులు మంజూరవగా.. రెండో రోజున హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌కు కూడా లైన్‌ క్లియర్‌ అయింది.

దాని అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులను ఇవ్వొచ్చంటూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫారసు చేసింది. దీనిపై సమీక్షించేందుకు డీసీజీఐ ఆదివారం(జనవరి 3న) సమావేశం కానుంది. ఈ భేటీలోనే టీకాకు అనుమతులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.


భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)ల సంయుక్త సహకారంతో కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. దీనిపై సరిగ్గా ఆరు నెలల క్రితం.. జూన్‌ 29న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 


నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే.. 

ప్రయోగ పరీక్షలు, వ్యాక్సిన్‌ భద్రత, ప్రభావశీలతలకు సంబంధించి భారత్‌ బయోటెక్‌ అందించిన అదనపు వివరాలను శుక్రవారం నుంచే పరిశీలిస్తున్న నిపుణుల కమిటీ.. తాజాగా శనివారం మధ్యాహ్నం జరిగిన భేటీలో మరోసారి వాటిపై సమీక్షించింది. ఈసందర్భంగా కమిటీ సభ్యులు భారత్‌ బయోటెక్‌ నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మొత్తం 25,800 మంది వలంటీర్లతో మూడోదశ ప్రయోగ పరీక్షలను నిర్వహించాలని భావించగా, ఇప్పటివరకు 23వేల మంది భర్తీ పూర్తయింది.


ఎంపిక చేసిన వలంటీర్లలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ట్రయల్స్‌ ఫలితాలను బట్టి వ్యాక్సిన్‌ భద్రమైందనే విషయం తేలింది. అయితే దాని ప్రభావశీలత ఎంత ఉందనేది ఇంకా తేలాల్సి ఉంది’’ అని వారు పేర్కొన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్లతో ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజాప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా.. అత్యవసర పరిస్థితుల్లో పరిమితులతో కూడిన వినియోగం కోసం కొవాగ్జిన్‌కు అనుమతులు ఇవ్వొచ్చని నిపుణుల కమిటీ సూచించింది. 




విదేశాలకూ..  

ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ వద్ద కోటి వ్యాక్సిన్‌ డోసులు సిద్ధంగా ఉన్నాయని ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై పనిచేస్తున్న హరియాణాలోని పీజీఐఎంఎస్‌ ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ సవితా వర్మ వెల్లడించారు. ఏటా 30 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. తమ కరోనా వ్యాక్సిన్‌ ధర వాటర్‌ బాటిల్‌ ధర కంటే తక్కువే ఉంటుందని చాలా సందర్భాల్లో భారత్‌ బయోటెక్‌ సీఎండీ  కృష్ణ ఎల్లా చెప్పారు.


ఆయన చెబుతున్న ప్రకారం.. ఏ లెక్కన చూసుకున్నా రెండు డోసుల కొవాగ్జిన్‌ ధర రూ.100లోపే ఉండొచ్చని ఔషధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం కంపెనీ దాదాపు రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అమెరికా మార్కెట్‌లోకి కూడా కొవాగ్జిన్‌ను తీసుకెళ్లే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.


ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన ఆక్యుజెన్‌ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిప్రకారం.. అక్కడ కొవాగ్జిన్‌ అభివృద్ధి, ప్రయోగ పరీక్షలు, ఔషధ నియంత్రణ సంస్థల అనుమతులు, టీకా మార్కెటింగ్‌ వంటి వ్యవహారాలన్నింటిపై హక్కులన్నీ ఆక్యుజెన్‌కే దక్కుతాయి. దక్షిణ అమెరికా, తూర్పు ఐరోపా, ఆసియా, మధ్య ఆసియాల్లోని మరిన్ని దేశాలతో ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్‌ బయోటెక్‌ సంప్రదింపులు జరుపుతోంది.  


మొదటి దశ ట్రయల్స్‌ : భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌తో మనుషులపై ప్రయోగ పరీక్షలను జూలై 15న ప్రారంభించింది. దేశంలోని 12 ఆస్పత్రుల్లో మొత్తం 375 మందిపై ప్రయోగాత్మక టీకాను పరీక్షించారు. ఒకే ఒక వలంటీర్‌లో దుష్ప్రభావాలు తలెత్తగా, మిగతా వారందరిలోనూ బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన కనిపించింది. 


రెండో దశ ట్రయల్స్‌ : కొవాగ్జిన్‌తో సెప్టెంబరు రెండోవారంలో ప్రారంభమైన రెండో దశ ట్రయల్స్‌లో 380 మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా అతి కొద్దిమంది వలంటీర్లలో ఇంజెక్షన్‌ వేయించుకున్న భాగంలో నొప్పి, వాపు వంటి స్వల్ప దుష్ప్రభావాలను గుర్తించారు. మిగతా వారందరిపైనా టీకా క్రియాశీలంగా పనిచేసింది. 


మూడో దశ ట్రయల్స్‌ : ఈ టీకాతో మూడో దశ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అక్టోబరు 23న భారత్‌ బయోటెక్‌కు అనుమతులు వచ్చాయి.

నవంబరు 17న ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 25 సెంటర్లలో 26వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 23వేల మంది వలంటీర్లను భర్తీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు మార్చికల్లా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 


డిసెంబరు 7 : కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులను కోరుతూ డిసెంబరు 7న డీసీజీఐకు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు సమర్పించింది. 


డిసెంబరు 9 : భారత్‌ బయోటెక్‌ దరఖాస్తును పరిశీలించిన సీడీఎ్‌ససీఓ నిపుణుల కమిటీ.. ప్రయోగ పరీక్షలు, వ్యాక్సిన్‌ ప్రభావశీలత, భద్రతలతో ముడిపడిన అదనపు సమాచారాన్ని అందించాలని కోరింది. 


డిసెంబరు చివరివారం : సీడీఎ్‌ససీఓ అడిగిన సమాచారాన్ని డిసెంబరు చివరివారంలో అందించింది. 


డిసెంబరు 30 : గత నెల 30న యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరైన వెంటనే  సీడీఎ్‌ససీఓ నిపుణుల కమిటీ సమావేశమైంది. భారత్‌ బయోటెక్‌ దరఖాస్తును మళ్లీ పరిశీలించింది.  


జనవరి 1 : భారత్‌ బయోటెక్‌ అందించిన అదనపు సమాచారాన్ని జనవరి 1న నిపుణుల కమిటీ మరోసారి సమీక్షించింది. 


జనవరి 2 : మరోసారి దరఖాస్తును సమీక్షించిన నిపుణుల కమిటీ.. కొవాగ్జిన్‌కు నియంత్రిత అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేయొచ్చని డీసీజీఐకి సిఫారసు చేసింది. 


‘ముక్కు’ టీకాపైనా దృష్టి

భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ను ముక్కు ద్వారానూ అందించేలా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇది సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ కావడం విశేషం. జనవరిలోనే దీనికి సంబంధించిన ప్రయోగ పరీక్షలు అమెరికాలోని సెయింట్‌ లూయీస్‌ వర్సిటీలో ప్రారంభంకానున్నాయి.  




రెండు డోసుల టీకా 

భారతదేశ పరిస్థితులు, రవాణా అవరోధాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని విరో సెల్‌ కల్చర్‌ టెక్నాలజీ ఆధారంగా కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రెండు డోసుల టీకా. మొదటి డోసును అందించిన 28 రోజుల తర్వాత రెండో డోసును ఇవ్వాల్సి ఉంటుంది. రెండో డోసును వేయించుకున్న 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్‌ ప్రభావం, రోగ నిరోధక ప్రతిస్పందన కనిపించడం ప్రారంభమవుతుంది. దీంతో విడుదలయ్యే టీ-సెల్‌, బీ-సెల్‌ రకం యాంటీబాడీలు కనీసం 6 నెలల నుంచి ఏడాదిపాటు క్రియాశీలంగా ఉంటాయని ప్రొఫెసర్‌ సవితా వర్మ తెలిపారు. 


ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ అంటే.. 

కొవాగ్జిన్‌ అనేది ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ రకానికి చెందింది. ఇందులో పూర్తిగా నిర్జీవంగా మార్చిన వైర్‌సకు సంబంధించిన అణువులు ఉంటాయి. వీటికి సజీవ వైర్‌సలా ఇన్ఫెక్షన్‌ను కలిగించే శక్తి ఉండదు. వ్యాక్సిన్‌ డోసు ద్వారా ఈ నిర్జీవ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అది సజీవ వైరసేనని భావించి, దానిపై దాడి కోసం యాంటీబాడీలను విడుదల చేస్తుంది. హెపటైటి్‌స-ఏ, పోలియో, రేబిస్‌ వంటి వ్యాధుల కోసం కూడా ఇన్‌యాక్టివేటెడ్‌ రకం వ్యాక్సిన్లే వాడుకలో ఉన్నాయి. 


ప్రపంచంలోనే తొలి బీఎ్‌సఎల్‌-3 యూనిట్‌ 

వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచంలోనే తొలిసారిగా బయో సేఫ్టీ లెవల్‌-3 (బీఎ్‌సఎల్‌-3) ప్రమాణాలతో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడే కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా బీఎ్‌సఎల్‌-3 ల్యాబ్‌లు ఉన్నాయని.. అయితే ఆ ప్రమాణాలతో నిర్మించిన తొలి వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ మాత్రం ఇదేనని ఆ కంపెనీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) కృష్ణ ఎల్లా తెలిపారు. 




యూకేకు వారానికి 20 లక్షల డోసులు 


వ్యాక్సిన్ల పంపిణీ భారీ స్థాయిలో అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతుందా? అని సందేహించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వానికి సరఫరాతో సమాధానం చెబుతామంటున్నాయి ఫార్మా కంపెనీలు. ఈ నెల మూడో వారం నుంచి.. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా వారానికి 20లక్షల మోతాదు(డో్‌స)ల చొప్పున ఆక్స్‌ఫర్డ్‌ టీకా పంపిస్తామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.


ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం లక్షల కొలదీ  మోతాదులను పంపే ప్రక్రియ కొనసాగుతోందని ఫైజర్‌ తెలిపింది. వృద్ధులు, తొలి వరుసలో ఉన్న పోరాట యోధులకు సోమవారం(4వ తేదీ) నుంచి ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఇవ్వడానికి యూకే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం 10కోట్ల మోతాదులను ఆర్డర్‌ చేసింది. వారానికి 20లక్షల మోతాదులు అవసరమవుతాయని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. ఇక, ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ టీకా యూకేలో మొదటిగా అనుమతి పొందింది. 9.44లక్షల మంది ఆ టీకా మొదటి డోసు వేయించుకున్నారు.


అయితే, ఆయా కంపెనీలు చెప్పినట్లుగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ధరపై పరిమితి అనేది సరఫరా, పంపిణీకి అటంకం కలిగించే అవకాశం ఉందని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. ఆస్ట్రాజెనెకా డోసు సుమారు రూ.300(3 పౌండ్లు), ఫైజర్‌ డోసు రూ.1500(15 పౌండ్లు) చొప్పున యూకే కొనుగోలు చేస్తోంది. మరోవైపు.. భారత్‌ అంత భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌ నిల్వలను ఎలా సృష్టించింది?.. బ్రిటన్‌ పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ల సరఫరాకు సిద్ధంగా ఉందా? అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రశ్నలు లేవనెత్తింది.


గుజరాత్‌లో నలుగురికి కొత్త స్ట్రెయిన్‌

గుజరాత్‌లో శనివారం నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్‌గా తేలిన మరో 15 మంది నమూనాలు పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌(ఎన్‌ఐవీ)లో ఉన్నట్లు తెలిపింది. కాగా, దేశంలో శుక్రవారం 19,079 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 224 మంది మృతి చెందారు.




23వేల మంది వలంటీర్లు సిద్ధం

‘‘మూడోదశ ట్రయల్స్‌ కోసం మొత్తం 26వేల మంది వలంటీర్లకుగానూ ఇప్పటివరకు 23వేల మందిని భర్తీ చేసుకున్నాం. కొవాగ్జిన్‌ ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్న వలంటీర్లు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. వలంటీర్లుగా చేరి వారు అందించిన స్ఫూర్తి భారతదేశంతో పాటు యావత్‌ ప్రపంచానికి నైతిక బలాన్ని అందించింది. భారీ స్థాయిలో మేం తలపెట్టిన మూడోదశ ట్రయల్స్‌ కోసం సేవలు అందిస్తున్న ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, సహకరిస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. దేశానికి వ్యాక్సిన్‌ను అందించాలనే మా లక్ష్యాన్ని చేరుకునే వరకు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉంటాం’’ 

- సుచిత్ర ఎల్లా, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, భారత్‌ బయోటెక్‌


Updated Date - 2021-01-03T07:05:24+05:30 IST