భారత్‌ మమ్మల్ని బాగా చూడదు

ABN , First Publish Date - 2020-02-20T09:27:21+05:30 IST

‘‘భారత్‌ మమ్మల్ని బాగా చూడదు. కానీ ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత్‌లో తొలిసారి పర్యటనకు

భారత్‌ మమ్మల్ని బాగా చూడదు

కానీ.. మోదీ అంటే చాలా ఇష్టం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

తొలిసారి వస్తూ  భారత్‌ను అవమానించారు: కాంగ్రెస్‌ 

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ‘‘భారత్‌ మమ్మల్ని బాగా చూడదు. కానీ ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత్‌లో తొలిసారి పర్యటనకు వచ్చే నాలుగు రోజుల ముందు ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పరిశీలకులు అంచనా వేస్తున్నట్లు తన పర్యటనలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవచ్చని ఆయన సంకేతమిచ్చారు. వాషింగ్టన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.


ఢిల్లీ, అహ్మదాబాద్‌ను సందర్శిస్తారు. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌కు అవమానమని కాంగ్రెస్‌ విమర్శించింది. భారత్‌-అమెరికా సంబంధాల్లో ఎన్నో ఏళ్లుగా సాధించిన పురోగతిని తీసిపారేయడమే అవుతుందని ఆ పార్టీ ప్రతినిధి మనీశ్‌ తివారీ ఢిల్లీలో విమర్శించారు. 70 లక్షల మంది ప్రజలు స్వాగతం పలకడానికి ట్రంప్‌ ఏమైనా దేవుడా అని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి కేంద్రాన్ని ప్రశ్నించారు. 


260 కోట్ల డాలర్లతో అమెరికా నావల్‌ హెలికాప్టర్ల కొనుగోలు 

అమెరికా నావల్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ తయారు చేసే ఈ చాపర్ల కోసం భారత్‌ 260 కోట్ల డాలర్లు వెచ్చించనుందని సమాచారం. 


సబర్మతీ తీరం... తాజ్‌ విహారం!

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెల 24న ఉదయం అహ్మదాబాద్‌లోని వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్‌ దిగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని సబర్మతి ఆశ్రమం వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ట్రంప్‌ దాదాపు 25 నిమిషాలు ఆశ్రమంలో ఉంటారు. మహాత్మాగాంధీ నివసించిన కుటీరం ‘హృదయ కుంజ్‌’ను మొదట సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ట్రంప్‌ దంపతులు, ఇతర ప్రముఖులకు మోదీ విందు ఇస్తారు. తర్వాత ట్రంప్‌ దంపతులు ఆగ్రా వెళతారు. సాయంత్రం 5 గంటలకు వారు తాజ్‌మహల్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ 30 నుంచి 45 నిమిషాలు గడిపి ఢిల్లీ వెళతారు. 

Updated Date - 2020-02-20T09:27:21+05:30 IST