కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఏడాది : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-01-16T17:13:56+05:30 IST

భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి..

కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఏడాది : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారంనాడు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.


''ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా ఇది నిలిచింది'' అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో 156.76 కోట్ల వ్యాక్సినేషన్ కవరేజ్ పూర్తి చేసుకుంది. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 45 పైబడిన వాళ్లకు విస్తరించారు. ఆ తదుపరి 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. 2022 జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టారు. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్‌లు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అర్హులైన వారికి 156 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. గత 24 గంటల్లో 66 లక్షల వ్యాకినేషన్ డోస్‌లు వేశారు.

Updated Date - 2022-01-16T17:13:56+05:30 IST