ఉక్రెయిన్‌లో భారతీయులకు సాయపడేందుకు భారత్ యత్నాలు

ABN , First Publish Date - 2022-02-24T19:54:11+05:30 IST

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులకు, మరీ ముఖ్యంగా

ఉక్రెయిన్‌లో భారతీయులకు సాయపడేందుకు భారత్ యత్నాలు

న్యూఢిల్లీ : రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులకు, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, సాయపడేందుకుగల మార్గాలను భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ సంఘర్షణ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో వేగంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌లో అత్యంత వేగంగా మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. 


ఉక్రెయిన్‌పై సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రకటించడంతో భారతీయులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఆ దేశంలోని భారతీయులను, విద్యార్థులను కాపాడేందుకుగల మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మరింత విస్తరించి, నిరంతరం పని చేసేలా ఆదేశించినట్లు తెలిపారు. 


ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసినందున అక్కడ ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించడానికి అవకాశం లేదని చెప్పారు. ఇండియన్ ఎంబసీ సిబ్బందిని తీసుకురావడానికి కూడా విమానాన్ని పంపించడం సాధ్యం కాదన్నారు. సామాన్య ప్రజల భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందువల్ల సివిలియన్ ఫ్లైట్స్‌ను అనుమతించబోమని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌లో దాదాపు 15,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 


Updated Date - 2022-02-24T19:54:11+05:30 IST