స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పాల్గొన్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేత

కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

 సిద్దిపేట అగ్రికల్చర్‌/మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 6: జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై శనివారం డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్‌లోని బీఆర్‌బీకే భవన్‌ నుంచి  అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ..  ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ వేడుకలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని తెలిపారు.  ఇప్పటికే మార్గదర్శకాలు, ఆయా తేదీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలియజేశామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతీ విద్యార్థి సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు.  ప్రతీ సినిమా థియేటర్‌ గాంధీ సినిమా శాటిలైట్‌ లింక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, దీనిని తహసీల్దార్‌, ఎస్‌హెచ్‌వో ఽధ్రువీకరించాలని  మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌  మాట్లాడుతూ.. గాంధీ సినిమా ప్రదర్శన కోసం జిల్లాలో 10  సినిమా థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం అనంతరం సిద్దిపేట కలెక్టర్‌ అధికారులతో  మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిపై పతాకాన్ని ఎగురవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జెండాను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గాంధీ సినిమా చూసేందుకు పాఠశాలల నుంచి సినిమా థియేటర్లకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సీపీ శ్వేతా, జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్‌ ఖాన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్‌వో చెన్నయ్య, డీఈవో శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ సీఈవో రమేశ్‌, డీపీవో దేవకీదేవి, డీఆర్డీవో గోపాలరావు, జిల్లా రవాణాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, డీపీఆర్‌వో రవికుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మెదక్‌ కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, అడిషనల్‌ ఎస్పీ బాలస్వామి, జడ్పీ సీఈవో శైలేష్‌, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ తదితరులు సీఎస్‌ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST