Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 3 2021 @ 19:25PM

భారత్‌కు బంగారు భవిష్యత్తు : సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ : భారత దేశ భవిష్యత్తు పట్ల తాను చాలా ఉత్తేజంతో ఉన్నానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. అక్కడి అనేక స్టార్టప్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకుంటుండటం సంతోషకరంగా, ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. ఆ దేశంలోని కంపెనీలకు సహకరించాలనుకుంటున్నట్లు, అవి తమ కార్యలాపాలను విస్తరించడం కోసం అవసరమైన కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ), సాంకేతిక పరిజ్ఞానాలను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. 


భారత్‌ను ఎలా చూస్తున్నామంటే...

సంస్థలను ఏర్పాటు చేసి, వాటిని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ప్రదేశంగా తాము భారత దేశాన్ని చూస్తున్నామని, అందుకే తాము గూగుల్ పేలో పెట్టుబడులు పెట్టామని  చెప్పారు. ఈ విధంగా తాము ఇతర మార్కెట్లలో కూడా చేస్తున్నామని చెప్పారు. అన్ని విధాలుగా ప్రోత్సహించగలిగే పాత్రను తాము పోషించాలనుకుంటున్నట్లు తెలిపారు. టెక్నలాజికల్ ప్లాట్‌ఫామ్‌ను సమకూర్చడమైనా, మార్కెట్‌కు సహకరించడమైనా పెద్దన్న పాత్రను పోషించాలనుకుంటున్నట్లు చెప్పారు. 


ప్రైవసీపై తటస్థ విధానం

డేటా ప్రైవసీ, రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతూ, తమ కంపెనీతోపాటు దేశాలకు ప్రయోజనకరమైన తటస్థ విధానం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రతి దేశంలోనూ స్థానిక సంస్థగా మెలగుతూ, ఆ దేశ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయడం గూగుల్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. తాను ఈ ముఖ్యమైన సిద్ధాంతంతోనే పని చేస్తానని వివరించారు. 


కోవిడ్‌తో మరింత వేగం

కోవిడ్-19 మహమ్మారి కారణంగా డిజిటల్ లావాదేవీలు వేగవంతమయ్యాయని తెలిపారు. కంప్యూటింగ్ ప్రజలకు తగినట్లు సహజంగా మారుతుందన్నారు. మొబైల్ ఫోన్ల రూపంలో కాకుండా త్రిముఖ చిత్రాలు పెరుగుతాయన్నారు. ఆగ్‌మెంటెడ్ రియాలిటీదే భవిష్యత్తు అని తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం గడియారాల్లో కనిపిస్తున్నాయన్నారు. దీని కోసం కృత్రిమ మేధాశక్తి (ఏఐ) ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. తాము దీని కోసం కృషి చేస్తున్నామని, గూగుల్ లాంబ్డా అటువంటి ప్రాజెక్టేనని చెప్పారు. మాటలను అర్థం చేసుకుని, సంభాషణకు దారి తీసే కృత్రిమ మేధాశక్తిని ఇది ఉపయోగించుకుంటుందన్నారు. 


Advertisement
Advertisement