మళ్లీ అలజడి

ABN , First Publish Date - 2020-05-23T09:51:41+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లావాసులను కలవర పెడుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరికి కరోనా వైరస్‌

మళ్లీ అలజడి

శ్రీకాకుళంలో మరో ఇద్దరికి కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ఆందోళన చెందుతున్న జిల్లావాసులు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/గుజరాతీపేట)

కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లావాసులను కలవర పెడుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరికి కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. పుణ్యపువీధిలో ఒకరు, చౌదరి సత్యనారాయణ కాలనీలో మరొకరి నుంచి శ్వాబ్‌ తీసి అధికారులు పరీక్షల కోసం కాకినాడలో ల్యాబ్‌కు పంపించారు. జిల్లాలో ఇప్పటివరకూ 35 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇలా కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వస్తున్న వలస, మత్స్యకార కార్మికులను అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారికి ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు.


దీనిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై.. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గత నెల 29న పీఎన్‌ కాలనీలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో ఆ కాలనీలో పది లైన్‌లను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ‘పాజిటివ్‌’ బాధితుడు కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. కంటెన్మెంట్‌ జోన్‌ కూడా ఎత్తివేస్తారనుకునే సమయంలో.. ఇదే కాలనీకి ఆనుకుని ఉన్న చౌదరి సత్యనారాయణ కాలనీలో తాజాగా కరోనా పాజిటివ్‌ అనుమానిత లక్షణాలు బయటపడడంతో ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న పుణ్యపువీధిలో కూడా మరొకరికి అనుమానిత లక్షణాలు బయటపడడంతో కలవర పడుతున్నారు.


ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇటీవల ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వారితో కాంటాక్ట్‌ అయిన వారందరినీ గుర్తించి క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులకు ప్రాథమిక పరీక్షలు చేశారు. వారికి నెగిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. పుణ్యపువీధి ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్‌ ప్రాంతంగా పరిగణించారు. ఆ ప్రాంతం నుంచి వ్యక్తులు ఎవరూ బయటకు రాకుండా, ఇతరులు లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. పీఎన్‌ కాలనీ పరిధిలో కంటైన్మెంట్‌ జోన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. 


వీధుల్లో పరిశుభ్రత చర్యలు

శ్రీకాకుళం నగరంలో పుణ్యపువీధి, సత్యనారాయణ కాలనీల్లో శుక్రవారం నగరపాలక సంస్థ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. కరోనా పాజిటివ్‌ అనుమానితులు నివాసం ఉన్న గృహాల నుంచి రెండు వందల మీటర్ల పరిధి వరకూ పరిశుభ్రం చేశారు. కాలువల్లో పూడిక తీత, జంగిల్‌ క్లియరెన్స్‌, రోడ్లపై చెత్త తొలగింపు వంటి చర్యలను చేపట్టారు. బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లారు.  పుణ్యపు వీధి  కాలనీకి ఆనుకుని ఉన్న జాలరి, కానుకుర్తి, బ్యాంకర్స్‌ కాలనీల్లో సోడియం హైపో క్లోరైడ్‌(ఎస్‌హెచ్‌సి) ద్రావణాన్ని స్ర్పే చేశారు. తర్వాత ఫాగింగ్‌ చేశారు. చౌదరి సత్యనారాయణ కాలనీకి ఆనుకుని ఉన్న  ప్రాంతాల్లో కూడా పారిశుధ్య పనులు చేపట్టారు.  


తిరిగొచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి..

బతుకుదెరువు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కోసం ఇతర రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లి.. ఇటీవల జిల్లాకు వస్తున్నవారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ చెక్‌పోస్టు మీదుగా రోజూ కనీసం రెండు వందల మంది వరకు జిల్లాలోకి వస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  వీరందరినీ నేరుగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ, గడిచిన వారం రోజులుగా జిల్లాకు వస్తున్న వలస వాసుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడుతుండడంతో కేసుల సంఖ్య పెరుగుతుందేమోనని జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారికే పాజిటివ్‌ లక్షణాలు బయట పడుతున్నాయని, కావున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-23T09:51:41+05:30 IST