ఇంటా.. బయట..!

ABN , First Publish Date - 2022-06-23T06:36:39+05:30 IST

బయటకు వెళ్లినా.. ఇంటిపట్టునే ఉన్నా.. ఆమెకు భద్రత లేదు. బంధువులు.. బయటివారు అన్న తేడా లేదు.

ఇంటా.. బయట..!

ఆమెపై పెరుగుతున్న లైంగిక దాడులు

ప్రేమ.. పెళ్లి పేరిట అమానుషం

రెండు వారాల్లో పది పోక్సో కేసులు

నిందితుల్లో  కొందరు పోలీసులు


అనంతపురం క్రైం : బయటకు వెళ్లినా.. ఇంటిపట్టునే ఉన్నా.. ఆమెకు భద్రత లేదు. బంధువులు.. బయటివారు అన్న తేడా లేదు. బాలికా..? వివాహితా..? అన్న విచక్షణ లేదు. అయితే ప్రేమ.. లేదంటే లైంగిక దాడి..! ఇవిగాక.. సంప్రదాయ వరకట్న వేధింపులు.. అత్తింటి ఆరళ్లు..! ఆధునికత ఎంత పెరిగినా అతివ కష్టాలు తగ్గడం లేదు. ఆమె కోసం ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితి మారడం లేదు. ఇప్పుడు దిశ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. అయినా జిల్లాలో బాలికలు, మహిళలపైౖ దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాల వ్యధిలోనే జిల్లా పరిధిలో 10కి పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం లైంగిక వేధింపులే. ఇవిగాక వరకట్నం, భర్త, అత్తింటి వేధింపులు లెక్కలేనన్ని. ప్రతి రోజూ నగరంలోని దిశ పోలీస్‌ స్టేషనకు ఉమ్మడి జిల్లా నుంచి కనీసం మూడు నాలుగు ఫిర్యాదులు అందుతు న్నాయి. 


పేట్రేగిపోతున్నారు


- రాప్తాడు మండలం భోగినేపల్లికి చెందిన బాలికను సమీప బంధువులు కిడ్నాప్‌ చేశారు. తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అనంతపురం మండలం చియ్యేడుకు చెందిన కమతం పుల్లన్న ఇలా చేసి జైలుపాలయ్యాడు. పుల్లన్నతోపాటు అతని కుమారుడు, ఓ కారు డ్రైవరు, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై.. బాధితురాలిని రక్షించారు.


- అనంతపురం నగరంలోని బుడ్డప్పనగర్‌లో ఇంటర్‌ విద్యార్థినిని అదే కాలనీకి చెందిన రఘు అనే పెయింటర్‌ ప్రేమించాలని తరచూ వేధించేవాడు. బాధితురాలి తల్లి వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇటీవల పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 


- ఈ నెల 4న అనంతపురం వినాయక నగర్‌లో ఇంటి బయట కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ యువతి పట్ల అర్ధరాత్రి సమయంలో అదే కాలనీకి చెందిన కారు డ్రైవర్‌ సురేష్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వనటౌన పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 


- అనంతపురం హనుమాన కాలనీకి చెందిన బేల్దారి వడ్డే రమణకు అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటి భార్య ఉంది. రెండో భార్య వదిలేసింది. పక్కనే ఉన్న యువజన కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలికను మాయమాటలతో నమ్మించాడు. గత నెల 25న బాలికను ఎత్తుకెళ్లి ధర్మవరంలో వడ్డే మహేష్‌ అనే వ్యక్తి ఇంట్లో దాచాడు. మూడురోజుల పాటు అక్కడే ఉన్నారు. త్రీటౌన పోలీసులు విచారించి, బాలికను రక్షించారు. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


- డీ.హీరేహాళ్‌ మండలం కాదలూరులో రెండు వారాల క్రితం ఓ బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. వరుసకు కోడలైన 14 ఏళ్ల బాలికపై హనుమంతప్ప అనే కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో దాడి చేసి, స్పృహ తప్పేలా చేశాడు. బాధితురాలిని గుర్తించిన గ్రామస్థులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


- ఈనెల 1వతేదీ పెద్దపప్పూరు మండలం వరదాయపల్లిలో ఓ బాలికపై చౌడయ్య అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద, అత్యాచారం కేసు నమోదు చేశారు. 


ఖాకీలదీ అదే దారి...

- మహిళలను వేధించేవారిలో కొందరు పోలీసులు ఉండటం విమర్శలకు తావిస్తోంది. బీకేఎస్‌ మండలం చెదళ్లకు చెందిన ఈశ్వరయ్య సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లిచేసుకోమంటే కులం కాదని నిరాకరించాడు. బాధితురాలు గత నెల 15న దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 420, 376, ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసు నమోదు చేశారు. 


- శింగనమల మండలం గురుగుంట్లకు చెందిన పవనకుమార్‌ అనంతపురం నగరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి నగరానికే చెందిన ఓ యువతితో 2013లో కట్నం కింద రూ.2 లక్షలు, 15 తులాల బంగారు నగలు ఇచ్చి పెళ్లి చేశారు. అదనపు కట్నం తేవాలని వేధించాడు. పెద్దలు పంచాయితీ  చేసినా మార్పు రాలేదు. దీంతో రూ.లక్ష అదనంగా ఇచ్చారు. అయినా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, భార్యను హింసించాడు. బాధితురాలు గత నెల 14న దిశ పోలీసులను ఆశ్రయించింది. 


- ఏఆర్‌ కానిస్టేబుల్‌ గౌస్‌కు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయిని సమీప బంధువు. వాట్సాప్‌లో చాట్‌ చేసే సమయంలో అశ్లీల, అభ్యంతకర సందేశాలు ఆమెకు పంపేవాడు. హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో బాధితురాలు ఈ నెల 9వ తేదీ దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 



మగాళ్లకూ దిశ యాప్‌

అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా దిశ పోలీస్‌ స్టేషన్ ఉంది. అక్కడ పనిచేసే కొందరు మహిళా పోలీసులు.. ఎవరైనా బైక్‌పై వెళుతున్నా నిలిపేస్తారు. పురుషులైనా సరే.. మీకు దిశ యాప్‌ ఉందా? అని నిలదీస్తారు. వెంటనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒత్తిడి చేస్తారు. పోలీసులు కావడంతో చేసేదిలేక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర రద్దీ ప్రాంతాల్లో పురుషుల మొబైల్స్‌లో దిశ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నారు. తమకు ఎందుకు అని ప్రశ్నిస్తే.. ‘మీ ఇంట్లో ఉన్న మహిళలకు ఇది ఉపయోగపడుతుంది’ అని అంటున్నారు.

Updated Date - 2022-06-23T06:36:39+05:30 IST