ర్యాడికలైజేషన్‌తో పెను ముప్పు : మోదీ

ABN , First Publish Date - 2021-09-17T18:15:11+05:30 IST

ర్యాడికలైజేషన్ పెరుగుతుండటం అనేక సమస్యలకు కారణమవుతోందని

ర్యాడికలైజేషన్‌తో పెను ముప్పు : మోదీ

న్యూఢిల్లీ : ర్యాడికలైజేషన్ పెరుగుతుండటం అనేక సమస్యలకు కారణమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) సదస్సులో వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడుతూ, శాంతి, భద్రత, పరస్పర నమ్మక లోపం వంటివాటితో సంబంధంగల సవాళ్ళను ఈ ప్రాంతం ఎదుర్కొంటోందని చెప్పారు. పెరుగుతున్న ర్యాడికలైజేషన్ ఈ సమస్యలకు ప్రధాన కారణమని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవలి పరిణామాలు ఈ సవాలును నొక్కి వక్కాణిస్తున్నాయన్నారు. ఎస్‌సీఓ 20వ వార్షికోత్సవాలను జరుపుకుంటోందని, ఈ సంస్థ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. 


ఎస్‌సీఓ సదస్సు తజకిస్థాన్‌లోని దుషాంబేలో జరుగుతోంది. కొందరు నేతలు వర్చువల్ విధానంలోనూ, మరికొందరు నేతలు ప్రత్యక్షంగానూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు. మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన తజకిస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 


సైన్స్ దిశగా యువతను ప్రోత్సహించాలి

ప్రతిభావంతులైన యువతను సైన్స్, హేతుబద్ధ ఆలోచనల దిశగా ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం రంగంలో భారత దేశాన్ని భాగస్వామిగా చేసే దిశగా సృజనాత్మక స్ఫూర్తిని ప్రేరేపించే విధంగా స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూవర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చామని చెప్పారు. 


భారత్‌తో అనుసంధానం 

మధ్య ఆసియాతో అనుసంధానాన్ని పెంచుకోవడానికి భారత దేశం కట్టుబడి ఉందన్నారు. భారత దేశ విస్తృత స్థాయి మార్కెట్‌తో అనుసంధానం అవడం వల్ల మధ్య ఆసియా దేశాలకు గొప్ప ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. 


ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ దుషాంబే వెళ్ళారు. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం, దానివల్ల అంతర్గత, బాహ్య ప్రభావాలు, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన సమస్యలపై ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు చర్చిస్తారు. 


Updated Date - 2021-09-17T18:15:11+05:30 IST