‘కట్టడి’ చేయరా?

ABN , First Publish Date - 2020-06-02T10:13:28+05:30 IST

కరోనా విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి

‘కట్టడి’ చేయరా?

పెరుగుతున్న కేసులు 


ముషీరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటి పరిసరాలను కట్టడి ప్రాంతంగా ప్రకటించి, అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ సమీపంలో నివసించే ఏపీ సచివాలయ ఉద్యోగికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయినా, ఆ ప్రాంతాన్ని కట్టడి చేయలేదు. బహదూర్‌యార్‌ జంగ్‌ వద్ద వృద్ధుడికి, రాంనగర్‌ బాకారం వెస్లీ చర్చి వద్ద మరో వృద్ధుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ కట్టడి చేయలేదు.


గతంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతం మొత్తాన్ని కట్టడి చేయగా, తాజా నిబంధనల ప్రకారం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి ఇంటినే కట్టడి చేస్తున్నారు. అయితే, నియోజకవర్గంలో కేసులు నమోదైన వారి ఇళ్లను కూడా కట్టడి చేయడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ అధికారులు పాజిటివ్‌ వ్యక్తుల వివరాలు, చిరునామాలు జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ను సంప్రదించగా.. పాజిటివ్‌  కేసుల చిరునామాలను ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ అధికారులకు అందజేస్తున్నామని చెప్పారు.


జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 15 డీఎంసీ ఉమాప్రకాష్‌ను సంప్రదించగా పాజిటివ్‌ వ్యక్తుల చిరునామాలు దొరకకపోవడం వల్లే కట్టడి ప్రాంతాల ఏర్పాటులో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడే సమాచారం అందిందని వెంటనే ఏర్పాట్లు చేస్తామన్నారు. ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ సమీపంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా కట్టడి లేకపోవడంతో రెండు రోజులుగా జాగ్రత్తలు పాటించకుండానే చేపల విక్రయాలు సాగుతున్నాయి. వైరస్‌ ప్రబలుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-06-02T10:13:28+05:30 IST