పెరిగిన జలనిధి

ABN , First Publish Date - 2020-07-06T11:01:43+05:30 IST

నదీ జలాల సదుపాయం లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది వానాకాలపు సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలతో భూగర్బజలాల

పెరిగిన జలనిధి

గత ఏడాది కంటే 4.36 మీటర్ల నీటి మట్టం పెరుగుదల

మే మాసం కంటే జూన్‌లో స్వల్పతగ్గుదల 


యాదాద్రి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నదీ జలాల సదుపాయం లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది వానాకాలపు సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలతో భూగర్బజలాల పరిస్థితి ఆశాజనకంగా మారింది. వర్షాధారంగా భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో భూగర్బజల వనరులశాఖ నివేదిక ప్రకారం ఈ ఏడాది భూగర్భ జలాలు గత ఏడాది కంటే 4.36 మీటర్లపైన  అందుబాటులోకి వచ్చాయి. అయితే జూన్‌లో వర్షాలు కురిసినప్పటికీ, 2020 మే నుంచి జూన్‌ మాసం నాటికి దాదాపు మీటర్‌ వరకు నీటి మట్టం తగ్గింది. అయితే రాబోయేది వర్షాకాలపు సీజనే కావడంతో ఈ ఏడాది భూగర్భ జలమట్టం ఆశించినస్థాయి కంటే పెరిగి పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందనే ఆశతో  రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.


గత ఏడాది కంటే 4.36మీటర్ల పెరుగుదల

యాదాద్రి భువనగిరి జిల్లాలో నీటి మట్టం గుర్తించడానికి 17 మండలాల్లో 38 భావులను భూగర్బ జలవనరుల శాఖ భూగర్బ జల మట్టాలను గణిస్తోంది. జిల్లాలో గత ఏడాది జూన్‌కు, ఈ ఏడాది జూన్‌కు భూగర్భ జలమట్టం గణనీయంగాపైకి వచ్చినట్టుగా అధికారుల నివేదిక స్పష్టం చేస్తోంది. 2019 వర్షాకాలంలో ఆలస్యంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడమే కాకుండా ఇంకా నీటి నిల్వలు ఉండటంతో భూగర్భ జలాలు పెరిగినట్టుగా భావిస్తున్నారు. 2019 జూన్‌లో జిల్లాలో సగటున 15.61 మీటర్ల భూగర్భ జలమట్టం 2020 జూన్‌ ఆఖరునాటికి 11.98 మీటర్లపైకి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే 2020 మే మాసం నుంచి జూన్‌ వరకు  నెల రోజుల్లోనే సగటున ఒక మీటరు దిగువకు నీటి మట్టం స్వల్పంగా పడిపోయినట్టుగా గుర్తించారు.  


నారాయణపూర్‌లో పడిపోతున్న జల మట్టం

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలమట్టం గత ఏడాది కంటే పెరుగుతున్నప్పటికీ, సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలో మాత్రం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో సగటున 4.36 మీటర్లు జల మట్టం పెరిగినప్పటికీ, నారాయణపూర్‌ మండలంలో మాత్రం గత ఏడాది జూన్‌ కంటే 0.51 మీటర్లు తగ్గుదల నమోదైంది. ఈ మండలంలో గత ఏడాది నుంచి సరైన వర్షాలు కురియకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. జిల్లాలోని గత ఏడాది అత్యంత దిగువకు భూగర్భ జలాలు పడిపోయిన యాదగిరిగుట్ట మండలంలో ఈ ఏడాది భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2019 జూన్‌లో ఈ మండలంలో 29.98 మీటర్ల దిగువనగల భూగర్భ జలమట్టం 2020 జూన్‌లో 15.85 మీటర్ల ఎగువకు చేరుకున్నాయి. ఈ మండలంలో 4.13 మీటర్ల భూగర్బ జలమట్టం పెరిగింది. అదే విధంగా జిల్లాలోని పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్‌, చౌటుప్పల్‌, తుర్కపల్లి, భువనగిరి అడ్డగూడూరు, చౌటుప్పల్‌ మండలాల్లో కూడ భూగర్బ జలమట్టాలు గత ఏడాది కంటే ఆశాజనకంగా పెరిగాయి.


తొలకరి వర్షాలతో.. సాగుపనులు ప్రారంభం

భూదాన్‌పోచంపల్లి, జూలై 5 : నైరుతి రుతుపవనాల ఆగమనంతోపాటు తరుచూ కురుస్తున్న వర్షాలతో జిల్లా రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మూసీ ఆయకట్టులోని మండలాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి నాట్లు, కలుపుతీయడం, అచ్చుకట్టడం, మందు చల్లడం వంటి పనుల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా, విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. 


మూసీ ఆయకట్టులో... జలకళ

యాదాద్రి-భువనగిరి జిల్లాలోని మూసీ ఆయకట్టులోని బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని మూసీనది పరివాహకంలోని చెరువులు నిండి జలకళను సంతరించుకున్నాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగి మూసీ కాలువల ద్వారా చెరువుల్లోకి చేరుతోంది. దీంతో క్రమంగా చెరువులు నిండుతున్నాయి. ప్రస్తుతం భూదాన్‌పోచంపల్లి మండలంలోని పోచంపల్లి పెద్దచెరువుతోపాటు రేవణపల్లి, జలాల్‌పూర్‌, ముక్తాపూర్‌ చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. ఆయకట్టు రైతులు మాత్రం వానాకాలం పంట సాగుకు సమాయత్తమవుతున్నారు. 

Updated Date - 2020-07-06T11:01:43+05:30 IST