పెరిగిన ధరలే అడ్డంకి

ABN , First Publish Date - 2021-01-23T05:19:21+05:30 IST

ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి సిద్ధమైంది. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.

పెరిగిన ధరలే అడ్డంకి

- గతంతో పోలిస్తే గొర్రెలకు పెరిగిన ధరలు
- పంపిణీపై ప్రభుత్వం నుంచి అందని మార్గదర్శకాలు
- డీడీలు తీసి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
కామారెడ్డి, జనవరి 22: ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి సిద్ధమైంది. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే కామారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాలో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. అయితే జిల్లాకు సంబంధించి గొర్రెల పంపిణీ కోసం ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. మరో వారంలోపు మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గొర్రెల కొనుగోలుకు సంబంఽధించి పెరిగిన ధరలే అడ్డంకిగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఒకే ప్రాంతాన్ని కేటాయించడంతో అక్కడి వ్యాపారులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని ధరల్ని మరింతగా పెంచుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య లబ్ధిదారులకు నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
డీడీలు తీసి ఎదురుచూపులు
జిల్లాలో రెండో విడత కింద 500 పైచిలుకు మంది డీడీలు తీసి ఎదురుచూస్తున్నారు. వీరంతా ఒక్కో యూనిట్‌కు రూ.31,250 చెల్లించారు. రూ.93,750 సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తోంది. ఇలా లబ్ధిదారులు డీడీలు తీసి దాదాపు రెండేళ్లు దాటింది. ప్రస్తుతం ప్రభుత్వం గొర్రెల పంపిణీపై నిర్ణయం తీసుకోవడంతో తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. వీరితో పాటు రెండో విడతలో మరో 5 వేల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి జిల్లా అధికారులకు మార్గదర్శకాలు రాలేదు. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత గొర్రెల రవాణాకు సంబంఽధించిన వాహనాలకు టెండర్లు దాఖలు చేయడం, వాహనాలకు జియో ట్యాగింగ్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగేసరికి మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అధికారులు మాత్రం ముందుగా డీడీలు తీసిన వారికి ఏప్రిల్‌లోగా యూనిట్లను కేటాయించాలనే లక్ష్యంతో ఉన్నారు.
పెరిగిన ధరలతో ఇబ్బంది
గత రెండేళ్లలో పోలిస్తే ప్రస్తుతం గొర్రెలకు రేట్లు పెరిగాయి. గతంలో ఒక్కో గొర్రెకు రూ.5,200 చెల్లించి ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెల చొప్పున లబ్ధిదారులకు అందించారు. అయితే ఈ సారి మాత్రం ఈ ధరలకు గొర్రెలు దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.7వేల నుంచి 8వేల వరకు రేట్లు ఉండడంతో పథకంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో ఒక్కో యూనిట్‌ రూ.1,25,000 కేటాయిస్తే రూ.1,11,000లతో గొర్రెలను కొనుగోలు చేసి మిగతా డబ్బులను ఇన్యూరెన్స్‌, రవాణా ఖర్చులకు వినియోగించేవారు. అయితే ఇప్పుడు ఆ ధర చెల్లిస్తే కేవలం 16 గొర్రెలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గొర్రెల కొనుగోలులో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఒకే ప్రాంతాన్ని కేటాయించడంతో అక్కడి వ్యాపారులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని ధరలను మరింతగా పెంచుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య లబ్ధిదారులకు నష్టం ఏర్పడే అవకాశం లేకపోలేదు.
మార్గదర్శకాలు రాగానే పథకాన్ని ప్రారంభిస్తాం
- జగన్నాథచారి, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి, కామారెడ్డి.
ప్రస్తుతం గొర్రెల కొనుగోలు, పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. వారంలోగా వచ్చే అవకాశం ఉంది. రాగానే అర్హులైన లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మొదటి విడతలో డీడీలు తీసిన వారికి ఏప్రిల్‌ లోగా యూనిట్లను కేటాయించాలని ప్రణాళికలు రచిస్తున్నాం.

వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్ధిదారులకు గ్రౌడింగ్‌ చేయాలి
కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌
కామారెడ్డి, జనవరి 22: వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్ధిదారులకు గ్రౌండింగ్‌ చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వెటర్నరి అసిస్టెంట్‌ సర్జన్‌లతో గొర్రెల యూనిట్ల గ్రౌండింగ్‌పై సమీక్షించారు. ప్రభుత్వం కల్పించే 75శాతం సబ్సిడీ కింద క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి జగన్నాథచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-23T05:19:21+05:30 IST