పెరిగిన విద్యుత్‌ వాడకం

ABN , First Publish Date - 2022-05-31T05:59:59+05:30 IST

పెరిగిన విద్యుత్‌ వాడకం

పెరిగిన విద్యుత్‌ వాడకం


  • తాండూరు డివిజన్‌లో రికార్డు స్థాయిలో వాడకం
  • మే నెలలో 32 మిలియన్‌ యూనిట్ల కంన్సప్షన్‌
  • ట్రాన్స్‌కోకు అదనంగా రూ.కోటి ఆదాయం

తాండూరు, మే 30: తాండూరు డివిజన్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఈ వేసవిలో 32మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగించారు. ఎండల ప్రభావంతో ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువవడం, కొత్త కాలనీల్లో విద్యుత్‌ సర్వీసులు ఇవ్వడం, 24గంటల విద్యుత్‌ సరఫరా తదితర కారణాలతో విద్యుత్‌ వాడకం పెరిగింది. ఈసారి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినా ఓవర్‌ లోడ్‌ పడింది. దీంతో తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లైన్‌ ట్రిప్‌ వంటివి జరుగుతున్నాయి. వ్యవసాయానికి 24గంటలు త్రీఫేజ్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా డొమెస్టిక్‌లో గృహ వినియోగం డిమాండ్‌ ఎక్కువవడంతో సాయంత్రం త్రీఫేజ్‌ సరఫరా సమయాన్ని తగ్గించారు. డొమెస్టిక్‌ సరఫరాను మాత్రం నిరంతరం చేశారు. సాధారణ రోజుల్లో ప్రతినెలా 20మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం జరిగేది. ఈ మే నెలలో ఇప్పటికే 32మి.యూనిట్లు వాడారు.

భారీగా పెరిగిన గృహ వినియోగ కనెక్షన్లు

తాండూరు డివిజన్‌లో అన్నీ కలిపి లక్ష విద్యుత్‌ సర్వీసులున్నాయి. వాటిలో డొమెస్టిక్‌, కమర్షియల్‌ 73వేలుండగా, మిగిలినవి వ్యవసాయ కనెక్షన్లు.  ఇటీవల మరో 3వేల కొత్త సర్వీస్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఏటా రూ.7.5కోట్ల విద్యుత్‌ బిల్లుల వసూలయ్యేది. ఇటీవల విద్యుత్‌ చార్జీలు పెంపు, వినియోగం సైతం పెరగడంతో బిల్లుల్లో రూ.1కోటి ఆదాయం పెరిగింది. పరిశ్రమలకూ 24గంటల త్రీఫేజ్‌ కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ కింద పాత ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, అదనంగా కొత్తవి ఏర్పాటు చేస్తున్నా డిమాండ్‌తో ఓవర్‌లోడ్‌ పడుతోంది. తరచూ కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. తాండూరు డివిజన్‌కు గచ్చిబౌలి మెయిన్‌ లైన్‌ ద్వారా సరఫరా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాండూరులోని సోలార్‌ప్లాంట్‌ నుంచి కొద్దిమేర విద్యుత్‌ను విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. 

వ్యవసాయ కన్షెన్లకు పెరగని సబ్సిడీ

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లపై ఈ సారి సబ్సిడీ పెంచలేదు. కొత్త సర్వీసులకు విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ ఎంత ప్రతిపాదిస్తే అంత మొత్తం రైతులే భరించాల్సి వస్తోంది. పెరిగిన ఎస్టిమేషన్‌ భారాన్ని రైతులే మోయాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ ప్రతీ ఐదుగురు కలిసి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌కు రూ.30వేల డీడీ కడితే ప్రభుత్వం రూ.75వేలు సబ్సిడీపై ట్రాన్స్‌ఫార్మర్‌, పోళ్లు, ఎలక్ర్టిక్‌ లైనింగ్‌ వేసి రైతుల బోర్లకు విద్యుత్‌ సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఎల్టీ, హెచ్‌టీ ట్రాన్స్‌ఫార్మర్ల రేట్లు పెరగడంతో ఆ భారాన్ని రైతులే మోయాల్సి వస్తోంది. ఈ అదనపు భారం ప్రతీ ఐదుగురు రైతులకు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు ఉండనుంది. తాండూరుడివిజన్‌లో 27వేల వరకు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. కొత్త దరఖాస్తులు భారీగానే పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాన్స్‌కో దశలవారీగా కనెక్షన్లు మంజూరు చేస్తున్నా రైతులపై ఆర్థిక భారం తగ్గడం లేదు.

Updated Date - 2022-05-31T05:59:59+05:30 IST