వ్యవసాయం ‘భారం’

ABN , First Publish Date - 2020-06-27T10:05:12+05:30 IST

మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా ప్రకృతి వైపరీత్యాలతో సతమవుతున్న రైతన్నపై డీజలు రూపంలో మరో అదనపు భారం పడుతోంది.

వ్యవసాయం ‘భారం’

పెరిగిన డీజలు ధరలు

20 రోజుల్లో లీటరుపై రూ.10.15 పెంపు

పెరగనున్న సేద్యపు ఖర్చులు

ఆందోళనలో రైతన్నలు


(కడప-ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా ప్రకృతి వైపరీత్యాలతో సతమవుతున్న రైతన్నపై డీజలు రూపంలో మరో అదనపు భారం పడుతోంది. జిల్లాలో అడపా దడపా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ సీజన్‌కు రైతన్న సమాయత్తమవుతున్న వేల వరుసగా పెరుగుతున్న డీజలు ధరలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా 20 రోజుల వ్యవధిలో లీటరు డీజలుపై రూ.10.15 పెరిగింది. దీంతో ట్రాక్టరుతో చేసే సేద్యం ఖర్చులన్నీ పెరగనున్నాయి.


ఒకప్పుడు ఏ పల్లెలో చూసినా రైతుల ఇళ్ల ముందు కాడెద్దులు, పశువులు, వ్యవసాయ సామగ్రి కనిపించేవి. కాలక్రమేణా ఎడ్ల పోషణ భారంగా మారడం, కూలీలు దొరక్కపోవడం, కూలీ రేట్లు ఎక్కువ కావడంతో... సేద్యపు ఎడ్లు, పనిముట్ల స్థానంలో ట్రాక్టర్లు, యంత్రాలు ఆక్రమించాయి. ఇప్పుడు ఎక్కడో తప్ప కాడెద్దులు కనిపించవు. దుక్కి దున్నడం  మొదలు పంట కోత వరకు, మందుల పిచికారి కోసం యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డీజలు ధరలు ఇప్పుడు రైతుకు అదన పు భారమవుతున్నాయి.


పెరగనున్న రేట్లు

జిల్లాలో ఖరీ్‌ఫలో 1,15,836 హెక్టార్లలో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో ప్రధాన పంటలైన వరి 40వేల హెక్టార్లు, వేరుశెనగ 24,500, పత్తి 20వేల హెక్టార్లలో సాగు చేయనున్నారు. మొన్నటి వరకు ఎకరా సేద్యం చేసేందుకు తొమ్మిది చెక్కల సాలుకు రూ.500, మూడు మడకలకు రూ.1400, 7 మడకల సేద్యానికి రూ.700, తొమ్మిది చెక్కల సాలుకు రూ.500, గొంటికకు రూ.500, విత్తనం గొర్రుకు రూ.700, టిల్లర్‌కు 1200 తీసుకునేవారు. అయితే ఇప్పుడు డీజలు ధర పెరగడంతో రేటు కూడా పెంచాలనే యోచనలో ట్రాక్టరు యజమానులు ఉన్నారు. రూ.100 నుంచి రూ.200 దాకా పెంచే సూచనలు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు.


జిల్లాలో దాదాపు 43వేల వ్యవసాయ ట్రాక్టర్లు ఉన్నాయి. కొందరు రైతులు అద్దెకు తెచ్చుకుని సేద్యం చేస్తుండగా మరికొందరు సొంతంగానే పొలం పనులు చేసుకుంటున్నారు. ఈ నెల 6న డీజలు లీటరు రేటు రూ.67.75 పైసలు, 26న రూ.77.90 పైసలుకు చేరుకుంది. అంటే లీటరుపై రూ.10.15 పెరిగింది. రోజూ డీజలు ధరలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


వ్యవసాయానికి సబ్సిడీపై డీజలు అందించాలి - కె.వెంకటసుబ్బారెడ్డి, రైతు, ఉప్పరపల్లె చెన్నూరు మండలం

గిట్టుబాటు ధర లేక సాగు పెట్టుబడి రాక వ్యవసాయం భారమైంది. వస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టితో రైతులకు సాగు పెట్టుబడి కూడా అందడంలేదు. ఖరీఫ్‌ సీజన్‌ అవుతున్న సమయంలో రైతన్నపై డీజలు పెంపు భారంగా మారింది. లీటరుపై దాదాపు రూ.11 దాకా పెరిగింది. ఈ పెంపు ఇంతటితో ఆగేట్లు లేదు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో డీజలు అందించి ఆదుకోవాలి.

Updated Date - 2020-06-27T10:05:12+05:30 IST