మీసేవా సర్వీస్‌ చార్జీల పెంపు

ABN , First Publish Date - 2022-04-18T04:46:57+05:30 IST

మీసేవా కేంద్రాల్లో సర్వీస్‌ చార్జీలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం వారం కిందట ఉత్తర్వులు జారీ చేసింది.

మీసేవా సర్వీస్‌ చార్జీల పెంపు


ఆలూరు, ఏప్రిల్‌ 16: మీసేవా కేంద్రాల్లో సర్వీస్‌ చార్జీలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం వారం కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సేవపై రూ.5 వరకు పెంచింది. ప్రాధానంగా క్యాటగిరి ఏ, బీ సేవలకు సంబంధించి అదనపు బాదుడుకు సిద్ధమైంది. దీనికి తోడు జిల్లాలో కొన్ని మీసేవా కేంద్రాల్లో అదనపు వసూళ్లకు పాల్పడు తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజా సర్వీస్‌ చార్జీల పేరుతో మరింతగా వసూలు చేస్తారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీసేవా కేంద్రాల ద్వారా 512 రకాల సేవలు అందుతున్నాయి. వీటిని ఏ, బీ క్యాటగిరీలుగా విభజించి వసూళ్లు చేస్తున్నారు. ఏ క్యాటగిరిలో అందిస్తున్న ఒక్కో ధ్రువపత్రానికి ఇప్పటి వరకు రూ.35 వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.40 వసూలు చేస్తున్నారు. బీ క్యాటగిరిలో ధ్రువపత్రాలకు ఇప్పటి వరకు రూ.45 వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.50కి పెరగనుంది. 

- నిర్వాహకుల్లో ఆందోళన..

ప్రభుత్వం నిర్ణయంపై అటు మీసేవా కేంద్రాల నిర్వాహకులు సైతం పెదవిరుస్తున్నారు. ఇప్పటికే ప్రభు త్వం 9 రకాల సేవలను మీసేవా కేంద్రాల్లో నిలిపివేసి సచివాలయాలకు బదలాయించింది. అందులో కీలకమైన 1బీ అడంగల్‌, ఆధార్‌, మార్పు వంటివి ఉన్నాయి. దీంతో తమకు ఆదాయం తగ్గిపోతుందని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ సమయంలో సర్వీస్‌ చార్జీల పెంపుతో ప్రజలను మీ సేవల నుంచి దూరం చేస్తున్నారని అంటున్నారు. 2012లో ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వేలాది మంది మీసేవా నిర్వాహకులకు ఉపాధిగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన మారిపోయింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభం కావడంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఒక్కో సేవను దూరం చేస్తుండడంతో గిట్టుబాటు కావడం లేదు. విద్యుత చార్జీలు, అద్దెలు కట్టుకోలేక భారంగా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. 


Updated Date - 2022-04-18T04:46:57+05:30 IST