Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 24 May 2022 22:14:36 IST

ఎంసీహెచ్‌లో అసౌకర్యాలు

twitter-iconwatsapp-iconfb-icon

కొత్త దవాఖానాలో సౌకర్యాల లేమి

పీడియాట్రిక్‌ విభాగంలో సిబ్బంది కొరత

దూర భారానికి గురవుతున్న రోగులు, బంధువులు

మాతా, శిశువుల కష్టాలు

మంచిర్యాల, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా, శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) సౌకర్యాలు లేక గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా మహిళలు, శిశువుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేయగా పట్టణ శివారులో ఉండటం కొంత ఆసౌకర్యానికి గురి చేస్తోంది. పైగా రవాణా వ్యవస్థ సక్రమంగా లేని ప్రాం తంలో ఆసుపత్రి ఉండటంతో ప్రజలు దూరభారానికి గురవుతున్నారు. గోదావరి రోడ్డులో రూ.17 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆసుపత్రి నిర్మా ణం పూర్తికాగా మార్చి 4న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. పెండింగ్‌ పనులు పూర్తికావడంతో ఇటీవలే జిల్లా వైద్యశాలలో నుంచి ప్రత్యేక భవనంలోకి తరలించారు. దీంతో ఇంతకాలం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందిన గర్భిణులు, బాలింతలు, శిశువులు అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుత భవనం బస్టాండ్‌ నుంచి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు బస్టాండ్‌, ఐబీ చౌరస్తాలో దిగి ఆటోల ద్వారా ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఐబీ చౌరస్తాలోనే జిల్లా ఆసుపత్రి ఉండటంతో బస్సు దిగి నేరుగా అందులోకి వెళ్లేవారు. ఇప్పుడు ఐబీ చౌరస్తా నుంచి ఆటోలో ప్రయాణించడానికి రాను, పోను ఖర్చులు దాదాపు రూ. 150 వరకు అవుతున్నట్లు మహిళలు వాపోతున్నారు. 

సౌకర్యాల లేమితో తప్పని ఇబ్బందులు

మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాల లేమితో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో కనీసం తాగునీటి సౌకర్యం లేకపోగా, వాష్‌ రూముల్లో నీరు రావడం లేదని మహిళలు చెబుతున్నారు. గదుల్లో సీలింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేసినప్పటికీ జనరేటర్‌ లేకపోవడంతో కరెంటు పోయినప్పుడల్లా ఉక్కపోతలో ఉండాల్సి వస్తుం దని వాపోతున్నారు. రిజిస్ట్రేషన్‌, బీపీ చెక్‌ చేసే వరండాలో ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి ఉక్కపోతలో నిల్చోవలసిన పరిస్థితులు ఉన్నాయి. పట్టణ శివారులో ఆసుపత్రి ఉండటంతో కనీసం చాయ్‌ కూడా దొరక్క అవస్థలు పడుతున్నారు. శిశు ఆరోగ్య కేంద్రం కూడా కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో పిల్లలు చికిత్స కోసం చేరు తున్నారు. వారికి బ్రెడ్డు, పాలు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోతోందని తల్లులు ఆవేదన చెందుతున్నారు. చిన్న అవసరానికి ఓవర్‌ బ్రిడ్జి వరకు రావాల్సి వస్తుండటంతో ఆటో కిరాయిలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతి ప్రయాణానికి ఆటో డ్రైవర్లు లోకల్‌ చార్జీ వసూలు చేస్తుండటంతో వారం రోజుల్లో దాదాపు వెయ్యి వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. పైగా ఆస్పత్రికి వెళ్లాలంటే గోదావరి రోడ్డులో దాదాపు పది స్పీడ్‌ బ్రేకర్లు దాటాల్సి ఉంటుంది. గర్భిణులు, బాలింతలు ఆటోల్లో కుదుపుల రోడ్డుపై ప్రయాణం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వైశ్య భవన్‌ సమీపంలోని 80 ఫీట్ల బైపాస్‌ రోడ్డును పూర్తిచేస్తే, అది నేరుగా ఎంసీహెచ్‌ వరకు వెళుతుంది. దీంతో రోగులు సులువుగా ప్రయాణాలు చేసేందుకు వెసలుబాటు కలుగుతుంది. 

వేధిస్తున్న వైద్యుల కొరత...

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆసుపత్రిని మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా గుర్తించడంతో వైద్య సిబ్బంది సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా పీడియాట్రిక్‌ విభాగంలో ఈ సమస్య మరింత జఠిలంగా ఉంది. పీడియాట్రిక్‌ విభాగంలో నిత్యం సగటున 30 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరుతు న్నారు. వీరికి చికిత్స అందించేందుకు ఆసుపత్రి స్థాయిని బట్టి ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా, అసోసియేట్‌ ప్రొఫెసర్లు అందుబాటులో లేరు. అలాగే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కేవలం ఒక్కరే ఉండగా, మరొకరు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. మహిళల విభాగంలోనూ స్థాయికి సరిపడా వైద్య సిబ్బంది లేరు. దీంతో జిల్లా ఆసుపత్రి నుంచి తాత్కాలికంగా గైనకాలజిస్టులు, డ్యూటీ నర్సులతో సేవలు అందిస్తున్నారు. 

పిల్లల చికిత్స అక్కడే...

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కేవలం పసిపిల్లలకు మాత్రమే చికిత్స అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 14 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా అక్కడే చికిత్స అందిస్తున్నారు. దీంతో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పిల్లల విషయానికొస్తే ఉదాహరణకు కంటి సమస్యతో ఆసుపత్రికి వచ్చే పిల్లలకు నేత్ర వైద్య నిపుణునితో చికిత్స అందించాలి. అయితే మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆప్తమాలజిస్ట్‌ అందుబాటులో లేరు. దీంతో ఇక్కడికి వచ్చిన పేషెంట్‌ను తిరిగి జిల్లా ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. అలాగే కుక్కకాటు చికిత్సకు సంబంఽధించి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కేవలం మందులు ఇచ్చే వరకే సేవలు అందుతున్నాయి. పెద్ద గాయం అయిన పక్షంలో  తిరిగి జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేయాల్సి వస్తోంది. దీంతో రోగులు వివిధ రకాల చికిత్స కోసం రెండు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. మహిళలు, పిల్లల విభాగం పూర్తిగా మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించడంతో జిల్లా ఆసుపత్రి కేవలం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారు, మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకే పరిమితం అవుతోంది. జిల్లా ఆసుపత్రిలో నిత్యం 400 ఓపీ ఉండగా, అందులో గైనిక్‌ విభాగానికి చెందినవే 300 వరకు ఉండటం గమనార్హం. దీంతో జిల్లా ఆసుపత్రి రోగులు లేక వెలవెలబోతోంది. 1 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఆ దిశగా ఉన్నతాధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నీళ్లు రావడం లేదు

జెట్టి మానస, దండేపల్లి మండలం చింతపెల్లి

ప్రసవం కోసం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాను. బాబు పుట్టడంతో ఇక్కడే ఉండి చికిత్స పొందుతున్నాను. బాత్రూంల్లో నీళ్లు రావడం లేదు. తాగునీరు కూడా దొరకడం లేదు. వాటర్‌ బాటిళ్లు కొందామన్నా అందుబాటులో లేవు. కరెంటు పోతే జనరేటర్‌ వేయడం లేదు.

రవాణా సౌకర్యం లేదు

దండేకర్‌ భవాని, రాజీవ్‌నగర్‌

రాజీవ్‌నగర్‌ నుంచి ఆసుపత్రికి రావడానికి రెండు ఆటోలు మార్చాల్సి వస్తోంది. మా ఏరియాలో 102 సేవలు అందుబాటులో లేవు. ఆటో చార్జీలు రాను, పోను రూ.150 అవుతున్నాయి. ఎనిమిది నెలల గర్భవతిని కావడంతో ప్రతి నెల టెస్ట్‌కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో జిల్లా ఆసుపత్రిలో పరీక్షలు చేసేవారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.