ఇన్‌చార్జి పేచీ

ABN , First Publish Date - 2022-05-02T05:19:11+05:30 IST

ఇన్‌చార్జి పేచీ

ఇన్‌చార్జి పేచీ


  • వివాదాస్పదమవుతున్న ఇన్‌చార్జి సర్పంచ్‌ పదవులు
  • ఎంపికపై కోర్టుకు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు
  • అవినీతికి పాల్పడుతూ పదవులు కోల్పోతున్న పంచాయతీల ప్రతినిధులు
  • ఇన్‌చార్జిలకు చెక్‌పవర్‌ లేక పనుల్లో జాప్యం 
  • నిబంధనల మేరకే నడుచుకుంటాం : డీపీవో

మేడ్చల్‌,  మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలతో పదవులు, చెక్‌పవర్లపై కోర్టులకు ఎక్కారు. మేడ్చల్‌ మండలం పూడూరు పంచాయతీ సర్పంచ్‌ పదవిపై వివాదం కొనసాగుతోంది. కీసర మండలం రాంపల్లిదాయరలో వార్డు సభ్యుడిని ఇన్‌చార్జి సర్పంచ్‌గా ఎంపిక చేయడం, యాద్గార్‌పల్లిలో ఉపసర్పంచ్‌ ఇన్‌చార్జి సర్పంచ్‌గా ఎన్నికైనా చెక్‌పవర్‌ ఇవ్వకపోవడం వంటి అంశాలపై వివాదం కొనసాగుతోంది. 

ఏసీబీకి చిక్కి పదవీఛ్యుతుడై..

పూడూరు సర్పంచ్‌ బాబుయాదవ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీంతో ఉపసర్పంచ్‌ జ్యోతిని ఇన్‌చార్జి సర్పంచ్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే కొన్ని నెలలకే ఆమెపై అవిశ్వాసం పెట్టారు. చెక్కులపై సంతకాలు, పాలనా వ్యవహారాల్లో సర్పంచ్‌ అవసరం ఉండడంతో జిల్లా పంచాయతీ అధికారుల చొరవతో జ్యోతినే సర్పంచ్‌గా కొనసాగారు. ఆమెకు టీఆర్‌ఎస్‌ నాయకుల అండతో రెండో సారి ఇన్‌చార్జిగా కొనసాగారు. తన పదవి తనకు ఇప్పించాలని.. జ్యోతిని పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా ఇన్‌చార్జిగా నియమించారని పదవి పోగొట్టుకున్న బాబు కోర్టుకు వెళ్లాడు. కోర్టు సైతం జ్యోతి ఎంపికను రద్దుచేసింది. దీంతో పూడూరు పంచాయతీ సర్పంచ్‌ స్థానం ఖాళీ అయింది. కీసర మండలం రాంపల్లి దాయర సర్పంచ్‌ అండాల్‌, ఉపసర్పంచ్‌ రాములను అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ చేశారు. వార్డు మెంబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని ఇన్‌చార్జి సర్పంచ్‌ చేశారు. వార్డు మెంబర్‌ను ఇన్‌చార్జిగా చేయడం సరికాదని ఉపసర్పంచ్‌ కోర్టుకు వెళ్లడంతో సర్పంచి ఎన్నిక చెల్లదని.. ఉపసర్పంచ్‌కే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. కానీ పంచాయతీ అధికారులు కోర్టు తీర్పును అమలు చేయడం లేదు. యాద్గార్‌పల్లి సర్పంచ్‌ పుట్ట రాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సస్పెండయ్యాడు. అతడి స్థానంలో ఉప సర్పంచి మల్లే్‌షయాదవ్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నాడు. కానీ అతడికి చెక్‌పవర్‌ ఇవ్వలేదు. 

ఏ అధికారం లేని పదవెందుకు?

అలంకారప్రాయ పదవితో ఏం లాభం అని, ఏ పనీ చేయలేకపోతున్నాం.. అంటూ ఇన్‌చార్జి సర్పంచ్‌లు వాపోతున్నారు. రెగ్యులర్‌ సర్పంచ్‌లు అవినీతితో పదవి కోల్పోవడం.. వచ్చిన ఇన్‌చార్జులు సైతం పంచాయతీ తీర్మానాలు కాకుండా సొంత ఎజెండా అమలు చేస్తుండడంతో కొన్ని గ్రామాల్లో పంచాయతీ పాలనలో స్తబ్దత నెలకొంది. ఇదిలా ఉంటే ఎవరెన్ని పేచీలు పెట్టినా పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారమే నడుచుకుంటామని, ఆర్డర్లు ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా నిబంధనల ప్రకారమే ఇన్‌చార్జిల వ్యవస్థ ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-02T05:19:11+05:30 IST