Abn logo
Dec 2 2020 @ 23:35PM

ఇంకెన్నాళ్లు?

జిల్లాలో కీలక శాఖలకు ఇన్‌చార్జీల పాలనలోనే..
వారి ద్వారానే కార్యక్రమాల అమలు
ఏళ్ల తరబడి భర్తీకాని కీలక పోస్టులు
నిజామాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నా ప్రభుత్వ శాఖల్లో మాత్రం కీలక పోస్టులను భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఇన్‌చార్జీల ద్వారానే పాలన కొనసాగిస్తున్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత కీలక శాఖలకు కూడా శాశ్వత అధికారులను నియమించలేదు. కొత్త పోస్టుల భర్తీ లేకపోవడం పదోన్నతులు రాకపోవడం వల్ల పలు శాఖల ఇన్‌ఛార్జీల ద్వారానే పాలన కొనసాగుతోంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేస్తున్న కీలకశాఖల్లో  తగినంత  మంది ఉద్యోగులు  లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్న అధికారులు, ఉద్యోగులపైనే పనిభారం పెరిగినా లక్ష్యాలకు అనుగుణంగా పనులను చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించడం లేదు. జిల్లాలో కీలకమైన శాఖలకు కూడా గత కొన్ని ఏళ్లుగా ఇన్‌చార్జీల ద్వారానే పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కొత్త పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఈ ఖాళీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో కీలకమైన వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్‌, గ్రామీణాభివృద్ధి, సాగునీటి శాఖ, బీసీ సంక్షేమ వంటి కీలక శాఖలకు అధికారులు లేరు. ఇన్‌చార్జీల ద్వారానే పరిపాలన కొనసాగిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు గడిచిన నాలుగేళ్లుగా పూర్తిస్థాయి అధికారులను నియమించడం లేదు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వోలకే పూర్తిస్థాయి బాధ్యతలను అప్పజెబుతున్నారు. కరోనా సమయంలో కూడా ఈ శాఖకు పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. కిందిస్థాయిలో కూడా వైద్యులు పారామెడికల్‌ సిబ్బంది ఖాళీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ శాఖలో  16 పైన వైద్యుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఉన్న వారిని కూడా డిప్యూటేషన్‌పై పంపించడం  వల్ల చాలా పీహెచ్‌సీల పరిధిలో రెండవ వైద్యులు లేరు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఎక్సైజ్‌ శాఖకు గత కొన్నేళ్లుగా పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించడం లేదు. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌కే ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పజెప్పారు. జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌ ఎక్సైజ్‌ శాఖకు కూడా ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెడుతున్న కీలకమైన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకూ కూడా ఇన్‌చార్జీ అధికారుల ద్వారానే పాలన కొనసాగుతోంది. ఈ శాఖలో సబ్‌ రిజిస్ట్రార్‌ల ఖాళీలు కూడా ఉన్నాయి. సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఇతరులకు ఇన్‌చార్జీలుగా ఇచ్చి పాలన కొనసాగిస్తున్నారు.  బీసీ సంక్షేమ అధికారి పోస్టు కూడా గత కొన్నేళ్లుగా ఖాళీగానే ఉంది. సహాయ అధికారికే ఇన్‌చార్జీ బాధ్యతలను ఇచ్చి కార్యక్రమాలను నిర్వహిస్తునారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు కూడా గడిచిన ఆరు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేరు. అదనపు పీడీకే పూర్తిస్థాయి బాధ్యతలను అప్పజెప్పారు. జిల్లా సాగునీటి శాఖకు కూడా ఎస్‌ఈ లేరు. సంవత్సరకాలంగా ఇన్‌చార్జీ  ద్వారానే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మెదక్‌  జిల్లా ఎస్‌ఈకే  ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పజెప్పి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిశ్రమల శాఖకు కూడా జీఎం లేరు. ఇన్‌చార్జీల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిశ్రమలతో పాటు ఇతర వాటికి అనుమతులు ఇస్తున్నారు. జిల్లాలో కీలకమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు కూడా ఎస్‌ఈ నియామకం చేయలేదు.  గతంలో ఉన్న ఎస్‌ఈ సీఈగా పదోన్నతి వచ్చి బదిలీపై వెళ్లగా నిర్మల్‌ ఎస్‌ఈకి ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పజెప్పారు. జిల్లాలో టూరిజం, స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ శాఖలకు కూడా అధికారులను నియమించలేదు. ఇన్‌చార్జీల ద్వారానే పాలన కొనసాగుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖకు కూడా ఇన్‌చార్జీ అధికారే కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి కూడా పూర్తి అదనపు బాధ్యతలతోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం కొత్త పోస్టులను భర్తీ చేయకపోవడం ఉన్న వారు రిటైర్డ్‌ కావడం పదోన్నతులు ఆలస్యం కావడం వల్ల కీలక శాఖలకు అధికారులు దొరకడం లేదు. మండల, డివిజన్‌ స్థాయిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌తో పాటు ఇతర శాఖల్లో కూడా మండల స్థాయిలో ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతోంది. ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా కార్యక్రమాలు మాత్రం లక్ష్యాలకు అనుగుణంగానే పూర్తి చేస్తున్నారు. పలు శాఖల్లో కిందిస్థాయిలో ఉన్న ఖాళీలను భర్తీచేస్తే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయిలో అన్ని  జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఖాళీల భర్తీ కావడం లేదు. కొన్నిశాఖలకు ఇన్‌చార్జీలు కూడా దొరకకపోవడంతో ఇతర శాఖల అధికారులకు బాధ్యతలను అప్పజెప్పారు. రాష్ట్రస్థాయిలో నూతన పోస్టుల భర్తీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కీలక శాఖల అధికారులు పూర్తిస్థాయిలో ఉంటే పథకాల అమలు కూడా వేగంగా జరగనుంది. నిర్ణయాలు కూడా అదే రీతిలో తీసుకోనున్నారు. ఇన్‌చార్జీలు ఉండడం వల్ల కొన్ని ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోంది. జిల్లాలో పలు శాఖల ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలవుతున్నాయి. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, రైతువేదికల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. హరితహారంతో పాటు  ఇతర కార్యక్రమాలు అమలవుతున్నాయి. కీలకశాఖలకు అధికారులను నియమిస్తే మరింత వేగవంతంగా పనులు జరిగే అవకాశం ఉంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు దృష్టిపెడితే కొన్ని ఖాళీలైనా భర్తీ అయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement