రెండేళ్లుగా పిల్లర్లలోనే..!

ABN , First Publish Date - 2022-05-21T06:35:04+05:30 IST

మండలంలోని కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మాణ పనులు రెండేళ్ల నుంచి పిల్లర్ల స్థాయిలోనే వుండిపోయాయి.

రెండేళ్లుగా పిల్లర్లలోనే..!
పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయిన కోరుకొండ పీహెచ్‌సీ భవనం నిర్మాణం

అసంపూర్తిగా కోరుకొండ పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణం

టీడీపీ హయాంలో రూ.90 లక్షలు మంజూరు

సాధారణ ఎన్నికలకు ముందు పనులు ప్రారంభం

మొదటి విడత రూ.30 లక్షలకు బిల్లు పెట్టిన కాంట్రాక్టర్‌

నెలలు దాటినా మంజూరుకాని వైనం

భవన నిర్మాణ పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

పట్టించుకోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు

అరకొర వసతితో వైద్య సిబ్బంది, రోగులు ఇక్కట్లు



చింతపల్లి, మే 20: మండలంలోని కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మాణ పనులు రెండేళ్ల నుంచి పిల్లర్ల స్థాయిలోనే వుండిపోయాయి. సుమారు రూ.30 లక్షల మేర తొలి బిల్లు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. ఇది జరిగి రెండేళ్లు దాటినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. దీంతో రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన రేకుల షెడ్డులోనే వైద్య సేవలు అందిస్తున్నారు.

మండలంలోని బలపం, తమ్మంగుల, కుడుముసారి పంచాయతీల పరిధిలో 52 గ్రామాల గిరిజనులకు వైద్యసేవలందించడానికి సుమారు 20 ఏళ్ల క్రితం కోరుకొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రేకులతో నిర్మించిన భవనంలో ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో గత తెలుగుదేశం ప్రభుత్వం నూతన భవనం నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరుచేసింది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో కోరుకొండ పీహెచ్‌సీకి భవనం నిర్మించేందుకు కాంట్రాక్టర్లు తొలుత ముందుకురాలేదు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు చొరవ తీసుకుని, కాంట్రాక్టర్లకు భరోసా ఇవ్వడంతో టెండ్లర్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియ 2018 డిసెంబరులో ముగిసింది. 2019 ఫిబ్రవరిలో కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. మొత్తం మూడు దశల్లో బిల్లులు మంజూరు అవుతాయని అధికారులు చెప్పారు. తరువాత మూడు నెలలకు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ యథావిధిగా పనులు కొనసాగించారు. పిల్లర్ల వరకు సుమారు రూ.30 లక్షల మేర పనులు పూర్తయిన తరువాత బిల్లు పెట్టారు. వారాలు.. నెలలు దాటినా బిల్లు మంజూరు కాలేదు. దీంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. బిల్లు క్లియర్‌ చేస్తే మిగిలిన పనులు పూర్తిచేస్తానని కాంట్రాక్టర్‌ పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల ద్వారా ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు. కానీ ఎటువంటి స్పందన లేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులను పునఃప్రారంభిస్తామని చెబుతున్నారు. నిధులు ఎప్పుడు మంజూరవుతాయని అడిగితే... అది తమ చేతుల్లో లేదని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.

అరకొర వసతితో వైద్య సిబ్బంది ఇక్కట్లు

కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న రేకుల భవనంలో నాలుగు చిన్నపాటి గదులు మాత్రమే వున్నాయి. ఆస్పత్రిలో వైద్యాధికారి, సిబ్బంది కలిపి పది మంది వరకు వున్నారు. వసతి చాలకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. రోగులను ఆస్పత్రిలో వుంచి (ఇన్‌పేషెంట్‌) వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. రక్తపరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌ లేదు. లేబర్‌ రూమ్‌ లేకపోవడంతో ప్రసవం కోసం వచ్చే గర్భిణులను లోతుగెడ్డ పీహెచ్‌సీకి తరలిస్తున్నారు. 

నిధులు మంజూరు చేయాలి

కిల్లో పూర్ణచంద్రరావు, టీడీపీ మండల అధ్యక్షుడు 

కోరుకొండ పీహెచ్‌సీ భవనం (రేకుల షెడ్డు) చాలా ఇరుకుగా వుంది. వైద్య సిబ్బంది కూర్చుని విధులు నిర్వహించడానికి కూడా వీలు కావడంలేదు. రోగుల పరిస్థితి చెప్పనవసరం లేదు. దీంతో పలువురు రోగులు లోతుగెడ్డ పీహెచ్‌సీకి వెళుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించి కోరుకొండ పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.


Updated Date - 2022-05-21T06:35:04+05:30 IST