నీళ్ల పేరిట.. దోపిడీ

ABN , First Publish Date - 2022-05-01T05:23:42+05:30 IST

జిల్లాలో విచ్చలవిడిగా వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. అధికారులు వాటర్‌ప్లాంట్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలో యథేచ్ఛగా మంచినీళ్ల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది.

నీళ్ల పేరిట.. దోపిడీ
మదనపల్లె సాయిబాబా గుడి వద్ద రూ.5కు కాయిన్‌ బాక్స్‌తో .. నీళ్లు పట్టుకుంటున్న దృశ్యం

జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని ప్లాంట్లు

కోట్ల రూపాయల వ్యాపారం

మంచినీటి సరఫరాపై చేతులెత్తేసిన ప్రభుత్వం


మనిషి.. పశువులు, పక్షులు ఏదైనా బతకాలంటే.. నిత్యం అవసరమైనవి నీళ్లు. తిండి లేకుండా.. రెండు మూడు రోజులు ఉండగలరేమో కానీ.. నీళ్లు లేకుండా బతకడం కష్టం. కేవలం నీళ్లు తాగైనా కొన్ని రోజులు ప్రాణాలు కాపాడుకోవచ్చు. పశువులు, పక్షులు అయితే.. మురికినీళ్లో.. బురదనీళ్లో.. తాగగలవు. అయితే మనిషి పరిస్థితి అలా కాదు.. రక్షిత మంచినీళ్లు తాగకపోతే.. అనారోగ్యం బారినపడతాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.. అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను గాలికొదిలేయడంతో.. ప్రజలే మంచినీళ్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ప్రజల అగచాట్లే.. ఆసరాగా.... జిల్లాలో విచ్చలవిడిగా వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. అధికారులు వాటర్‌ప్లాంట్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో జిల్లాలో యథేచ్ఛగా మంచినీళ్ల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి) : 

సాధారణంగా ఎక్కడైనా ఒక ఆర్‌వోప్లాంటు (శుద్ధి చేసిన నీటి సరఫరా కేంద్రం) ఏర్పాటు చేయాలంటే.. పెద్ద తతంగమే ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతి తప్పని సరి.. ఆర్‌వో ప్లాంటులో నీళ్ల కోసం బోరు వేయాలంటే.. వాల్టా చట్టం ప్రకారం.. తహసీల్దార్‌ దగ్గర అనుమతి పొందాలి. బోరు వేసిన తర్వాత నీటిని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలి. అదే నీటిని ఆర్‌వో ప్లాంటులో శుద్ధి చేసిన తర్వాత కూడా అదేవిధంగా పరీక్షలు చేయించాలి. ప్రజలు తాగడానికి ఈ నీళ్లు పనికొస్తాయో..? లేదో పరీక్షల్లో నిర్ధారించుకోవాలి. ఆ ల్యాబ్‌లో ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో.. (ఈ సర్టిఫికెట్‌కు కొన్ని నెలలు మాత్రమే గడువు ఉంటుంది. తీరిన తర్వాత మళ్ళీ పరీక్షలు చేయించుకోవాలి.) మునిసిపాలిటీలో ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. మునిసిపాలిటీ నుంచి అభ్యంతరం లేదనే సర్టిఫికెట్‌తో ట్రేడ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో ఏవి లేకున్నా... ట్రేడ్‌ లైసెన్స్‌ ఇవ్వకూడదు. అయితే పరిస్థితి జిల్లాలో ఏ ఆర్‌వో ప్లాంటు ఏర్పాటులోనూ.. లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు ట్రేడ్‌ లైసెన్స్‌ ఇస్తున్న వాళ్లు. ఆర్‌వో ప్లాంటును కనీసం చూడకుండానే.. ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో సుమారు 500కు పైగానే ఆర్‌వో ప్లాంట్లు ఉన్నాయి. అందులో సగానికి పైగా కనీసం ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా లేకుండా నడుస్తున్నాయి. మదనపల్లె పరిసర ప్రాంతాలలో పెద్ద ఆర్‌వో ప్లాంట్లు (ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయడానికి రూ.20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది.)  10 వరకు ఉన్నాయి. మఽధ్యతరహా ప్లాంట్లు (రూ. 5-10 లక్షల వ్యయం), చిన్నవి (రూ.5 లక్షల్లోపు వ్యయం) ఇళ్లలో ఏర్పాటు చేసినవి కలిపి 130 వరకు ఉన్నాయి. మదనపల్లె మునిసిపాలిటీలో ఉచితంగా సరఫరా చేసే ప్లాంట్లు 9 ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మధ్యతరహా ప్లాంట్లు 30 వరకు ఉన్నాయి. పీలేరు నియోజకవర్గంలో 135 ఆర్‌వో ప్లాంట్లు ఉన్నాయి. రాజంపేట నియోజకవర్గంలో 126 ఆర్‌వో ప్లాంట్లు ఉండగా.. రాయచోటిలో 60 వరకు ఉన్నాయి. 


రూ.కోట్లలో వ్యాపారం.. 

జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో అక్రమ నీటి వ్యాపారం సాగుతోంది. మునిసిపాలిటీలలో 12 లీటర్లు పట్టే బిందెకు రూ.6 నుంచి రూ.10 వరకు (ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా ఉంది.) చెల్లించాలి. ఆటోల ద్వారా సరఫరా చేసే క్యాన్‌ ఒక్కోచోట రూ.13 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. మదనపల్లె మునిసిపాలిటీలో ప్లాంటు మరికొన్ని చోట్ల.. ఏర్పాటు చేసిన ఏటీఎం బ్యాంకులో రూ.5 కాయిన్‌ వేస్తే.. క్యాన్‌ వాటర్‌ తెచ్చుకోవచ్చు. పీలేరులో బిందె రూ.10కి పైనే అమ్ముతున్నారు. రాజంపేటలో పల్లెలు, మున్సిపాలిటీలో కూడా రూ.7కు తగ్గడం లేదు. రాయచోటిలో కూడా కొన్ని చోట్ల బిందె రూ.10 లెక్కన అమ్ముతున్నారు. పల్లెల్లో కూడా దాదాపు ఇదే ధర పెట్టి కొనాల్సి వస్తోంది.  ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల రూపాయలు అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. 


చేతులెత్తేసిన ప్రభుత్వం 

అటు మునిసిపాలిటీ, ఇటు పంచాయతీల ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షిత మంచినీటిని అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏ ఊర్లోనూ పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైన రక్షిత మంచినీళ్లు ఇవ్వడం లేదంటున్నారు. దీంతో నిబంధనల ప్రస్తావనే లేకుండా.. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా వీఽధికొక ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్లు పసుపురంగు, దుర్వాసన వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజలు ప్రైవేటు వాటర్‌ప్లాంట్ల దగ్గర నీళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి.. ప్రజలకు అవసరమైన రక్షిత మంచినీటిని అందించి... ప్రైవేటు వాటర్‌ప్లాంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. 


పూర్తిగా క్యాన్‌ వాటర్‌కు అలవాటుపడ్డాం

- నవీన్‌,  ఇందిరమ్మ కాలనీ, వాల్మీకిపురం

పూర్తిగా జనం క్యాన్‌ వాటర్‌కు అలవాటుపడ్డారు. వాల్మీకిపురంలో డోర్‌ డెలివరీ క్యాన్‌ వాటర్‌ రూ.15కు కొంటున్నాం. ప్రతి ఇంట్లోనూ మినరల్‌ వాటర్‌కు అలవాటుపడ్డారు. వేసవిలో ప్లాంట్ల వద్ద రద్దీ ఎక్కువ ఉంటుంది. 


వెలిగల్లు నీళ్లు తాగడానికి పనికిరావడం లేదు

- జబీవుల్లా, 8వ వార్డు, రాయచోటి మునిసిపాలిటీ

వెలిగల్లు ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లు తాగడానికి పనికి రావడం లేదు. మునిసిపల్‌ అధికారులు వెలిగల్లు నీళ్లు శుద్ధి చేసి ఇస్తున్నాం అంటున్నారు..అయితే ఆ నీళ్లను తాగలేకున్నాం. గతంలో మినరల్‌ వాటర్‌ బిందె రూ.5కు కొనేవాళ్ళం. ప్రస్తుతం వాటర్‌ప్లాంటు యజమానులు కరెంటు ఛార్జీలు పెరిగాయని, అమాంతంగా ధరలు పెంచేశారు. మునిసిపల్‌ అధికారులు .. వెలిగల్లు నీటిని తాగేందుకు వీలుగా శుద్ధి చేసి సరఫరా చేయాలి. 


వెలిగల్లు నీళ్లు తాగడానికి పనికి రావు అనేది వాస్తవం కాదు

- రాంబాబు, మునిసిపల్‌ కమిషనర్‌, రాయచోటి. 

వెలిగల్లు ప్రాజెక్టు నుంచి సరఫరా అవుతున్న నీళ్లు తాగడానికి పనికిరావు అనేది వాస్తవం కాదు. ఎప్పుడైనా ఒకసారి వెలిగల్లు నీళ్లు ..పసుపుపచ్చగా. దుర్వాసనతో వస్తున్నాయి. ప్రతిరోజూ శుద్ధి చేసిన నీటినే సరఫరా చేస్తున్నాం. రాయచోటి ప్రజలకు గతం నుంచి నీళ్లు కొనడం అలవాటు ఉంది. రాయచోటిలో ఉన్న ఆర్‌వో ప్లాంట్లు అన్నింటికీ ట్రేడ్‌ లైసెన్స్‌ ఉంది. 



Updated Date - 2022-05-01T05:23:42+05:30 IST