Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని రోజులుూ ఆదివారాల్లాగే ఉన్నాయని రొటీన్ తప్పారా..?

ఆంధ్రజ్యోతి(21-04-2020)


రొటీన్‌ తప్పారా?

పిల్లలకు స్కూళ్లు  లేవు, పెద్దలకు ఆఫీసులూ లేవు. అందరూ ఇంటిపట్టునే!ఎవరికీ ఉరుకులు పరుగులు లేవు. హడావిడి అంతకన్నా లేదు. ప్రతి రోజూ ఆదివారంలాగే తోస్తోంది. ఏ వారమో తెలుసుకోవడం కోసం క్యాలెండర్‌ చెక్‌ చేయవలసిన పరిస్థితి. ఇలా సమయం మీద పట్టు కోల్పోయే పరిస్థితి లాక్‌డౌన్‌ రోజుల్లో సహజం అంటున్నారు సైకాలజిస్ట్‌లు!


ఎక్కువ రోజులు సెలవు దినాల్లా గడిపినప్పుడు వారంలోని అన్ని రోజులూ ఆదివారాలే అనిపించడం అత్యంత సహజం. కొన్ని సార్లు సోమవారం బుధవారంలా, గురువారం శనివారంలా తోచడమూ సహజమే! ఇక వారాంతాలైతే నిరర్థకంగా తోస్తాయి. రాత్రుళ్లు అర్థరాత్రి దాటే వరకూ మేలుకున్నప్పుడు, మన మెదడు వాస్తవానికి అలవాటుపడేలోపే క్యాలెండర్‌లో తారీఖు మారిపోతూ ఉంటుంది. ఉదయం నాలుగు అయిందనే విషయం గమనించకుండానే అప్పటిదాకా మేలుకుని ఉంటూ ఉంటాం. ఆ సమయంలో తీసుకోవలసింది రాత్రి భోజనానికి బదులు అల్పాహారం కదా? అనే ఆలోచనలో పడతాం. ఇలాంటి గందరగోళం ఎందుకు?


రొటీన్‌ తప్పితే?

తోచినట్టు సమయం గడిపే వీలు ఉన్నప్పుడు దినచర్యలు క్రమం తప్పకుండా పాటించడానికి ఎవరూ ఇష్టపడరు. ఉదాహరణకు వెకేషన్‌లో ఉన్నప్పుడు ఆహార, నిద్ర వేళలు క్రమం తప్పుతాయి. ఇష్టం వచ్చినప్పుడు తింటాం, నిద్రపోతాం. లాక్‌డౌన్‌ సమయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. ఈ రోజుల్లో సమయం మీద నియంత్రణ కోల్పోతాం. రొటీన్‌కు తగ్గట్టుగా కాకుండా తోచినట్టు మసలుకుంటూ ఉంటాం కాబట్టి వారాలు, సమయాల మీద పట్టు ఉండదు. 


ఇలా సరిదిద్దుకోవాలి!


రొటీన్‌ను ఏర్పరుచుకోవాలి: క్యాలెండర్‌, టైమ్‌టేబుల్‌ ముందు పెట్టుకుని ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఎన్ని గంటలు వ్యాయామానికి, కుటుంబానికి కేటాయిస్తున్నారో నోట్‌ చేసుకోవాలి. అలాగే ఏ సమయానికి తింటున్నారు? ఏ సమయానికి నిద్రకు ఉపక్రమిస్తున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే ఓ క్రమం ఏర్పడుతుంది.


అతి వద్దు: టివి చూడడం, తినడం, నిద్రపోవడం, పని చేయడం... దేన్లోనూ అతి కూడదు. నిద్ర లేవడానికీ, పని ముగించడానికీ, ఆహారవేళలకూ అలారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ పనుల మధ్యలో స్వల్ప విరామాలు పాటించాలి.


సామాజిక మాధ్యమాలకు దూరంగా: సమయాన్ని ఉపయోగకరంగా మలుచుకోవాలంటే సోషల్‌ మీడియాకు చెక్‌ చెప్పాలి. నియమిత వేళకు నిద్రకు ఉపక్రమించడానికీ, నిద్ర క్రమం దెబ్బతినకుండా ఉండడానికీ సోషల్‌ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలి.


ప్రత్యేక వారాంతాలు!

వారం మొత్తం సెలవుల్లో గడిపితే వారాంతాల ప్రత్యేకత అర్థం కాదు. ఇలా కాకుండా వారాంతాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పరుచుకోవాలి. ఇలా చేస్తే శని, ఆది వారాలు అసలైన సెలవు దినాల్లా తోస్తాయి.


జీవగడియారం మెరుగ్గా!

నిద్ర... నిద్ర/మెలకువ హోమియోస్టాసిస్‌, చీకటి వెలుగుకు తగ్గట్టు స్పందించే సర్కేడియన్‌ బయలాజికల్‌ క్లాక్‌ అనే రెండు శరీర వ్యవస్థల మీద ఆధారపడి పని చేస్తూ ఉంటుంది అని అమెరికన్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ చెబుతోంది. ఎక్కువ దూరాలు విమాన ప్రయాణం చేసినప్పుడు, మారిపోయే టైమ్‌జోన్‌ ఫలితంగా ఎలాగైతే జెట్‌లాగ్‌ నిద్రను దెబ్బ తీస్తుందో, గతి తప్పిన దినచర్య కారణంగా లాక్‌డౌన్‌ సమయంలోనూ జెట్‌లాగ్‌ను పోలిన అయోమయ స్థితికి లోనవుతూ ఉంటాం. నియమానుసారంగా దినచర్యను అనుసరించడకపోవడం, ఎక్కువ సమయాలు ఇంట్లోనే గడపడం జీవగడియారంతో పాటు, నిద్రనూ దెబ్బతీస్తుంది. 

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...