ఉపాధి కల్పనలో..

ABN , First Publish Date - 2020-05-23T09:19:20+05:30 IST

జిల్లాలో ఇప్పుడున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో కీలక పాత్ర

ఉపాధి కల్పనలో..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలకం

నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించాలి: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 


కాకినాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పుడున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రాయితీలు సద్వినియోగం చేసుకుని మరిన్ని అవకాశాలు నిరుద్యోగులకు కల్పించాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి కోరారు. ఈ అంశంపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంస్థల యాజమన్యాలతో ఆయన సమావేశమయ్యారు. సదరు ఈ పరిశ్రమల రీస్టార్ట్‌  పాలసీ మేరకు జిల్లాలో 501 యూనిట్లకు పెండింగ్‌లో ఉన్న దాదాపు 92.65 కోట్లను ప్రోత్సా హం కింద విడుదల చేస్తామని, తొలి విడతగా రూ.41 కోట్లు విడుదల చేశామని ఆయన తెలిపారు. రెండో విడతలో జూన్‌ నెలలో ఇస్తామన్నారు. 6499 ఈ పరిశ్రమలకు విద్యుత్‌ బకాయిలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ప్రభుత్వం రద్దు చేస్తుందన్నారు. 65 మెగా పరిశ్రమలు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు చెల్లించాల్సిన విద్యుత్‌ చార్జీలు మూడు నెలల తర్వాత ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ఇప్పుడు ఉత్పత్తులు పెంచి విక్రయించడానికి అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి గృహ నిర్మాణ పథకాల్లో రూ.12 వేల నుంచి రూ. 15 వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ కింద సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమల యాజమాన్యాలు నష్టపోకుండా సీఎం జగన్‌ రీస్టార్ట్‌ ప్రోగ్రాం కింద పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక బకాయిలు తీర్చడం వల్ల పారిశ్రామిక వేత్తలు లాభపడతారన్నారు. రాయితీలు, ఇతర అవసరాలను పరిశీలించడం కోసం జేసీ రాజకుమారీకి బాధ్యతలు అప్పగించామని ఆయన తెలిపారు. పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కారం కోసం త్వరలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ దృష్ట్యా భౌతిక దూరం అమలు చేసి, నిరంతరం శానిటైజర్ల వినియోగం, మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని జేసీ యాజమాన్యాలకు సూ చించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్ర జీఎం బిశ్రీనివాసరావు, డీడీ డేవిడ్‌ సుందర్‌కుమార్‌, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏజీఎం అశోక్‌ నందా, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T09:19:20+05:30 IST