రైతు సంక్షేమానికి భరోసా!

ABN , First Publish Date - 2020-05-31T10:30:35+05:30 IST

అన్నదాతలకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

రైతు సంక్షేమానికి భరోసా!

 రైతుభరోసా కేంద్రాలతో మెరుగైన సేవలు

 స్పీకర్‌ తమ్మినేని సీతారాం


తొగరాం(ఆమదాలవలస రూరల్‌), మే 30: అన్నదాతలకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శనివారం ఆమదాలవలస మండలం తొగరాం గ్రామ సచివాలయం వద్ద  రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రైతులకే నేరుగా రాయితీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో అన్నదాతలను మోసగించే ఏజెన్సీల నుంచి రక్షణ కల్పించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల్లో నమోదు చేసుకుంటే  రైతులకు కావాల్సిన సామగ్రిని 48 గంటల్లో   అందిస్తాం. ఇందుకోసం కియోస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని నియమించాం.


ఇప్పటికే ప్రభుత్వం విద్యాదీవెన,  అమ్మఒడి, విద్యావసతి వంటి సంక్షేమ పథకాలను అందిస్తోంది. పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం చదువులను ప్రోత్సహించేలా చూస్తున్నామ’ని స్పీకర్‌ తమ్మినేని తెలిపారు. ముందుగా వ్యవసాయశాఖ, మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్‌, కేవీకే ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాల విధి విధానాల బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నివాస్‌, తహసీల్దార్‌ పి.రాంబాబు, ఎంపీడీవో పి.వెంకటరాజు, వ్యవసాయశాఖ ఏడీఆర్‌.రవిప్రకాష్‌,  వైసీపీ నాయకులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, బెండి గోవిందరావు, ఏఈవోలు పి.రమేష్‌, బి.ఝాన్సీ, సచివాలయ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


‘మా కాలనీని పరిశీలించండి’

తొగరాం ఎస్సీ కాలనీ కనీస అభివృద్ధికి నోచుకోలేదని,  కలెక్టర్‌ వచ్చి పరిశీలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి కలెక్టర్‌ వస్తారని తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు ప్లకార్డులతో అక్కడకు చేరుకున్నారు. దళితవాడలో మెయిన్‌రోడ్డుకు అనుసంధానం లేదని, కాలువలు లేవని తెలిపారు. ఇంటి ముందే పెంటకుప్పలు ఉన్నాయని, ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో తమ పేర్లు లేవని చెప్పారు. ఒకే ఇంటిలో మూడు నాలుగు కుటుంబాలు నివాసముంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్‌ తమ వాడకు రావాలని పట్టుపట్టారు. దీంతో గ్రామ పెద్దలు తమ్మినేని శ్రీరామ్మూర్తి, తమ్మినేని చిరంజీవి నాగ్‌ వారితో మాట్లాడారు. సమస్యలుంటే పరిష్కరించేలా అధికారులకు ఆదేశిస్తామని, ముందుగా తమకు తెలియజేయాలని చెప్పారు. 

Updated Date - 2020-05-31T10:30:35+05:30 IST