తక్షణ శిక్ష...!

ABN , First Publish Date - 2022-04-15T09:16:03+05:30 IST

శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అల్లర్లు జరిగితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో నిందితులపట్ల స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది....

తక్షణ శిక్ష...!

శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అల్లర్లు జరిగితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో నిందితులపట్ల స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాతికకోట్ల జనాభా ఉన్న యూపీలో ఎనిమిదివందల ఊరేగింపులు జరిగితే, అల్లరన్నది లేకపోవడం తమ పాలనావిధానానికి నిదర్శమని ఉత్తర్‌ప్రదేశ్ పాలకుడు యోగి ఆదిత్యనాథ్ సగర్వంగా చెప్పుకున్న విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల్లో బుల్డోజర్ బీజేపీ విజయంలో ప్రముఖపాత్ర పోషించిందనీ, దాని పేరువింటే చాలు నేరస్థులు హడలెత్తిపోయి తమకుతాముగా జైళ్ళలోకి పోయి కూచుంటున్నారని చాలా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి కూడా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు యోగిని ఆవాహన చేసుకొని, ఆ వాహనాన్ని ఆయుధంగా వినియోగించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.


మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శోభాయాత్ర ఆరంభమైన కొద్దిసేపట్లోనే మతఘర్షణలు రాజుకొని అల్లరిమూకలు దాడులకు, దహనాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఖర్గోన్ హింసకు సంబంధించిన వీడియోలంటూ కొన్ని సామాజికమాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయి కూడా. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారి ఇళ్ళనీ, దుకాణాలనూ కూల్చివేయాలని ఉన్నతస్థాయినుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు వందమంది నిందితులను అరెస్టుచేయడమే కాక, పెద్దసంఖ్యలో వారి ఇళ్ళనూ దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. కేవలం ఒక వర్గంవారిని లక్ష్యం చేసుకొని, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోందన్న విమర్శ అటుంచితే, ఎవరి ఇళ్ళను కూల్చివేయాలన్నది ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్నకు రాష్ట్ర హోంమంత్రి స్వయంగా అల్లర్లకు సంబంధించిన వీడియోల్లో వారి మొఖాలు కనిపిస్తుంటే ఇంకా వేరే ఆధారాలూ సాక్ష్యాలూ ఎందుకని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్ర నాయకులు కూడా ఈ ఏకపక్ష తక్షణ శిక్షకు సంబంధించి చిత్తం వచ్చిన వ్యాఖ్యలు చేశారు. హిందువులపై రాళ్ళు విసిరినవారిని ఈ శిక్షతోనూ వదిలిపెట్టకూడదన్నారు. నిందితులను గుర్తించడం, ఆధారాలు సేకరించడం, కేసు నమోదుచేయడం, అరెస్టులు చేయడం, న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టడం వంటి సుదీర్ఘప్రక్రియల వల్లనే, అధికశాతం ప్రజల్లో అవిశ్వాసం ఏర్పడుతున్నదని, అందుకే తమ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుందని రాష్ట్ర పాలకులు అన్నారు.


రేపు న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారేమో తెలియదు కానీ, ఈ బుల్డోజర్‌ వ్యాఖ్యలు ఆ తరువాత కాస్తంత పలచబడుతూ వచ్చాయి. ఆ అల్లర్లకూ, ఈ కూల్చివేతలకూ సంబంధం లేదనీ, అల్లర్లలో పాల్గొన్న నిందితుల ఇళ్ళనీ, దుకాణాలనూ కూల్చివేస్తున్నమాట నిజమే అయినప్పటికీ, అవి అక్రమ నిర్మాణాలైనందునే ఆ పనిచేస్తున్నామని గొంతు సవరించుకున్నారు. ప్రభుత్వ స్థలాలను దురాక్రమించినందుకే ఈ శిక్ష వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ దెబ్బతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆయన అభిమానులు బుల్డోజర్ మామ అని ముద్దుగా పిలుచుకుంటున్నారట. ఇక, యాత్ర సందర్భంగా రేగిన అల్లర్ల ముసుగులో మెజారిటీ మతస్థులు ఇతరత్రా ప్రయోజనాలరీత్యా తమ ఇరుగుపొరుగుపై దాడులు చేశారన్న ఆరోపణలతో పాటు, వచ్చి రక్షించమని ప్రాధేయపడిన మైనారిటీలను కొందరు కాపాడిన దృష్టాంతాలూ ఉన్నాయి.


ఈ పరస్పరహననం కంటే తదనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. రాయి లేచిన ప్రతీ ఇల్లూ కూలిపోతుందని హోంమంత్రి మీడియా సమావేశంలో ప్రకటించిన కొద్దిగంటల్లోనే ముఖ్యమంత్రి కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత, ‘ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల పరిరక్షణ–నష్టాల భర్తీ’కి సంబంధించి డిసెంబరులో ఆమోదించిన ఓ చట్టాన్ని ప్రయోగించారు. దీని ఆధారంగా కూల్చివేసిన దుకాణాలు, ఇళ్ళూ అన్నీ ముస్లింలవేనని ఆరోపణ. వీటిలో కొన్ని అక్రమ నిర్మాణాలు ఉండవచ్చునేమో కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిర్మితమైనవాటిని కూడా కూల్చివేసినందున ఆ వాదన పూర్తిసత్యమని భావించలేం. కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కొందరు అధికారులు వాటిని తమ ట్వీట్లలో నేరానికి విధించిన శిక్షగా పేర్కొనడం విచిత్రం. బుల్డోజర్లతో వెంటనే గుణపాఠం చెప్పాలన్న యావలో, చట్టపరంగా వ్యవహరించాల్సిన కర్తవ్యానికి ప్రభుత్వం నీళ్ళువదిలేసింది. చివరకు తాను చేసిన చట్టాన్ని సరైన రీతిలో అమలుచేసే ఓపికా సహనం కూడా లేకపోయాయి. తక్షణ రాజకీయ ప్రయోజనాలకే తప్ప యావత్ దేశానికీ తలవంపులు తెస్తున్నామన్న స్పృహ నేతలకు లేకపోవడం దురదృష్టకరం.

Updated Date - 2022-04-15T09:16:03+05:30 IST