ఉత్తరాదిలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

ABN , First Publish Date - 2021-07-18T20:20:16+05:30 IST

ఉత్తర భారత దేశంలో నాలుగు రోజులపాటు భారీ వర్షా

ఉత్తరాదిలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

న్యూఢిల్లీ : ఉత్తర భారత దేశంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 18 నుంచి 21 వరకు ఉత్తరాదిలోనూ, జూలై 23 వరకు పశ్చిమ తీరంలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చునని తెలిపింది. 


ఆరుబయట ఉండే జంతువులు, ప్రజలు ప్రాణాపాయానికి గురయ్యే విధంగా గాయపడవచ్చునని హెచ్చరించింది. పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియవచ్చునని పేర్కొంది. చెదురు మదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, గిల్గిట్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తర మధ్య ప్రదేశ్‌లలో ఈ నెల 18 నుంచి 21 వరకు విస్తారంగా వర్షాలు పడవచ్చునని తెలిపింది. 


జూలై 18, 19 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో, జూలై 19న వాయవ్య ఉత్తర ప్రదేశ్‌లో చెదురు మదురుగా భారీ వర్షాలు కురియవచ్చునని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్‌లలో జూలై 18, 19 తేదీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పశ్చిమ భారత దేశం, దక్షిణ భారత దేశంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Updated Date - 2021-07-18T20:20:16+05:30 IST