జోరుగా ఇసుక అక్రమ దందా

ABN , First Publish Date - 2020-10-10T08:22:38+05:30 IST

పరిగి కేంద్రంగా ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరిట కొందరు, ఎలాంటి అనుమతులు లేకుండా మరికొందరు యథేచ్ఛగా

జోరుగా ఇసుక అక్రమ దందా

కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మకాలు

టన్ను ఇసుకకు రూ.2000పై మాటే..

కోట్లకు పడగలెత్తుతున్న వ్యాపారులు

మామూళ్ల మత్తులో అధికారులు


పరిగి : పరిగి కేంద్రంగా ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరిట కొందరు, ఎలాంటి అనుమతులు లేకుండా మరికొందరు యథేచ్ఛగా ఇసుక అక్రమ వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇసుక లారీలు నిత్యం పరిగి సబ్‌ డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాల ముందు నుంచే తరలిపోతున్నాయి. ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఇసుక వనరులు తగ్గిపోవడంతో కరీంనగర్‌, పెద్దంపల్లి, మల్లారం, మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌సాగర్‌, కోస్గీ ప్రాంతాల నుంచి పరిగి ఇసుకను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్క వే బిల్లుతో లారీ తీసుకువచ్చి మరో రెండు లారీల ఇసుక దొడ్డి దారిన అమ్ముకుంటున్నారు. ఇటీవల కొత్తగా గండీడ్‌ మండలం రంగారెడ్డిపల్లివాగు, కులకచర్ల అంతారం వాగుల నుంచి ఇసుక తెస్తున్నారు. ఇళ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టే వారికి ఇసుక దొరకడం లేదని, రవాణా కష్టమవుతుందని ధరను పెంచుతున్నారు. డిమాండ్‌ లేకున్నా ఉన్నట్లు అధిక రేట్లకు అమ్ముకొని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అవసరాన్ని, నాణ్యతను బట్టి పరిగిలో టన్ను ఇసుకకు రూ.1800 నుంచి రూ.2200 వరకు కూడా విక్రయిస్తున్నారు. విధిలేక నిర్మాణదారులు ఎంత ధర చెప్పినా కొనుగోలు చేస్తున్నారు. 


చేతులు మారుతున్న లక్షలు

పరిగి ప్రాంతంలో ఇసుక మాఫియా ద్వారా కొందరు అధికారులకు లక్షల రూపాయలు అందుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాలో రెండు, మూడు శాఖల అధికారులు భాగస్వాములవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోలీస్‌ సిబ్బంది అయితే ఏకంగా ఇసుకలారీలు వచ్చే సమయానికి రహస్య ప్రాంతానికి వెళ్లి నేరుగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రెగ్యులర్‌గా వ్యాపారం చేసే వారి నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.10 నుంచి రూ.20వేల వరకు మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. లారీలకు రెట్టింపు తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చే లారీలు, ట్రాక్టర్లు దొరికినప్పుడు రూ.30 వేల వరకు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఇటీవల దోమ,కులకచర్ల పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని ఇసుక లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని భారీగానే డబ్బు వసూలు చేసి వదిలేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 


కృత్రిమ ఇసుకతో కూడా..

ఇరత ప్రాంతాల నుంచి తీసుకువచ్చే ఇసుకనే కాకుండా కృత్రిమ ఇసుకతోనూ జోరుగా అక్రమ వ్యా పారం చేస్తున్నారు. కోయిల్‌సాగర్‌, కొత్లాబాద్‌, యాలాల్‌, బొంసిరాపేట్‌, కొస్గీ ప్రాంతాల నుంచి రాత్రివేళ ఇసుకను తీసుకువచ్చి పరిగిలో అమ్మకాలు చేస్తున్నారు. పరిగి మండలం రంగంపల్లి, ఇబ్రహీంపూర్‌, గడిసింగాపూర్‌, దోమ మండలం కిష్టాపూర్‌, బుద్లాపూర్‌, పోతిరెడ్డిపల్లి, బడెంపల్లి, దాదాపూర్‌, కులకచర్ల మండలం అంతారం, పుట్టపహాడ్‌ల్లో కృత్రిమ ఇసుక స్థావరాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కృత్రిమ ఇసుకను తయారు చేసి ప్రతిరోజూ పట్టణాలకు తరలిస్తున్నారు. 


ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు  - జి.శ్రీనివాస్‌, డీఎస్పీ, పరిగి

ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తాం. అనుమతి లేని ఇసుకను రోడ్డుపైకి రానివ్వం. పోలీస్‌ శాఖ కింది స్థాయిలో ఎవరైనా ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చర్యలు తీసు కుంటాం. ఇసుక దందాలో ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే మా పరిధిలోని అన్ని పీఎస్‌లకు ఆదేశాలు ఇచ్చాం. 

Updated Date - 2020-10-10T08:22:38+05:30 IST