అక్రమ మైనింగ్‌పై కొరడా

ABN , First Publish Date - 2020-08-07T10:15:23+05:30 IST

ఆనందపురం మండలం రామవరంలో అనుమతి లేకుండా గ్రావెల్‌ తవ్వకం, తరలింపుపై గనుల శాఖ కొరడా ..

అక్రమ మైనింగ్‌పై  కొరడా

క్యూబిక్‌ మీటర్‌కు రూ.324 చొప్పున రూ.90 లక్షలు జరిమానా

రూ.36 చొప్పున రూ.9 లక్షలు సీనరేజ్‌

మొత్తం రూ.99 లక్షల వసూలుకు నేడో రేపో మరో నోటీసు 

రామవరం కొండ నుంచి 25 వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించినట్టు గనుల శాఖ నిర్ధారణ

జాతీయ రహదారి పనులకు వినియోగం

కాంట్రాక్టు సంస్థకు షోకాజ్‌ నోటీసు


విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):ఆనందపురం మండలం రామవరంలో అనుమతి లేకుండా గ్రావెల్‌ తవ్వకం, తరలింపుపై గనుల శాఖ కొరడా ఝళిపించింది. సర్వే నంబరు 121లో ఉన్న రామకొండ నుంచి 25 వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వి, తరలించినట్టు అధికారులు నిర్ధారించారు. రామకొండ వద్ద అక్రమంగా గ్రావెల్‌ తవ్వకా లు జరుపుతూ, టిప్పర్‌ లారీల్లో తరలిసు ్తన్నట్టు ఈ నెల ఐదున ఆంధ్రజ్యోతిలో ‘బరితెగింపు’ శీర్షికతో వచ్చిన కథ నంపై మైనింగ్‌ అధికారులు స్పందించారు. అదే రోజు రామకొండ వద్దకు వెళ్లి, గ్రావెల్‌ తవ్వకాలను పరిశీలిం చారు. ఏ మేరకు తవ్వారో నిర్ధారించ ుకోవడానికి కొలతలు తీసుకున్నారు. దాదాపు 25 వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వినట్టు తేల్చారు. 


జాతీయ రహదారి పనులకు గ్రావెల్‌ తరలింపు

రామవరం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు(వీరు... ఏ రాజకీయ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలో వుంటారని స్థానికులు చెబుతున్నారు) కొండ నుంచి గ్రావెల్‌ తవ్వి, జాతీయరహదారి నిర్మాణ పనులు చేస్తున్న డీబీసీ అనే సంస్థకు విక్రయించినట్టు గనుల శాఖ గుర్తించింది. సంస్థకు చెందిన టిప్పర్ల ద్వారానే గ్రావెల్‌ తరలించినట్టు నిర్ధారించారు.


తొలుత డీబీసీ సంస్థకు షోకాజ్‌ జారీచేసి, తరువాత సీనరేజ్‌, జరిమానా మొత్తం చెల్లించాలని నోటీస్‌ జారీ చేయనున్నట్టు గనుల శాఖ విశాఖ ఏడీ బైరాగినాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం కొండవాలు ప్రాంతాలు చదునుచేయ డానికి తమ శాఖ నుంచి అనుమతి తీసుకోనవ సరం లేదని, అయితే చదును చేసిన ప్రాంతం నుంచి గ్రావెల్‌, రాళ్లను మరోచోటుకి తరలిస్తే అనుమతి తీసుకోవడంతోపాటు సీనరేజ్‌ చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. 


రూ.90 లక్షలు జరిమానా...

సాధారణంగా గనుల శాఖ అనుమతితో గ్రావెల్‌ తవ్వకాలు జరిపితే ఘనపు మీటర్‌కు రూ.36 చొప్పున సీనరేజ్‌ కింద చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా అక్రమంగా తవ్వితే దీనికి పదిరెట్లు జరిమానా విధించాలి. రామవరం కొండ నుంచి అక్రమంగా 25వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వి, తరలించుకు పోయారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.36 చొప్పున రూ.9 లక్షలు, అక్రమంగా తరలించుకుపోయనందుకు రూ.90 లక్షలు జరిమానా... మొత్తం రూ. 99 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి.


బుక్కైన డీబీసీ సంస్థ

జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న డీబీసీ సంస్థ తమకు అవసరమైన గ్రావెన్‌ను రామవరం కొండ నుంచి తరలించింది. ఇక్కడ గ్రావెల్‌ విక్రయిస్తున్న వ్యక్తులకు గనుల శాఖ నుంచి అనుమతి ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకోలేదు. గ్రావెల్‌ తరలించిన టిప్పర్లు ఆ సంస్థకు చెందినవిగా నిర్ధారణ కావడంతో సీనరేజ్‌తోపాటు జరిమానా కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఆర్డీవోకు నివేదిక

రామవరంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వి తరలించిన వ్యవహారాన్ని పరిశీలించామని మండల ఆర్‌ఐ ప్రదీప్‌ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన నివేదికను విశాఖపట్నం ఆర్డీవోకు పంపుతామన్నారు. ఆర్డీవో ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. 


రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

 రెవెన్యూ సిబ్బంది అండదండలతోనే రామవరం కొండవాలులో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి, అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక రెవెన్యూ ఉద్యోగులతోపాటు గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టిన వారిపైనా విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును వారు కోరుతున్నారు.

Updated Date - 2020-08-07T10:15:23+05:30 IST