Abn logo
Mar 3 2021 @ 23:57PM

‘ఇఫ్కో’ రైతులకు ఊరట లభించేనా!?

సెజ్‌ భూములకు ఇంకా అందని పరిహారం

పాతికేళ్లుగా పోరాడుతున్న అన్నదాతలు

కాకినాడ సెజ్‌, రిలయన్స్‌ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తమకూ న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి

మరోవైపు ఈ నెల 16 నుంచి హైకోర్టులో వాదనలు!


ఒకటి కాదు.. రెండు కాదు... దాదాపు పాతికేళ్లుగా పోరాటం. తమ భూములకు పరిహారం ఇప్పించాలంటూ ఇఫ్కో కిసాన్‌ సెజ్‌కు భూములిచ్చిన రైతులు ఎక్కని   మెట్టు లేదు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు  అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు.. చివరకు హైకోర్టులోనూ వాదనలు.. కొన్ని వేల కుటుంబాలు ఎప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సెజ్‌, రియలన్స్‌ భూముల విషయాల్లో తీసుకున్న నిర్ణయాలతో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ రైతుల్లో ఆశలు చిగురించాయి.


నెల్లూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పుష్కరకాలం క్రితం కాకినాడలో సెజ్‌ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం భూములు సేకరించింది. కొంత భూమికి పరిహారం చెల్లించగా, మరికొందరు రైతులు తమకు పరిహారం సరిపోదని, భూములు ఇచ్చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అప్పటి నుంచి వేల మంది రైతులు పోరాటం చేస్తుండగా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కాకినాడ సెజ్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని నిర్ణయించింది.  అలానే పరిహారం చెల్లించిన భూములకు ఇంకొంత పరిహారం అందించాలని కూడా తీర్మానించింది. అలానే కృష్ణపట్నంలో థర్మల్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటుకు కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ (రిలయన్స్‌ భాగస్వామ్యం) సంస్థకు 2008లో అప్పటి ప్రభుత్వం 1730 ఎకరాలను కేటాయించింది. భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే సదరు భూముల్లో పనులే ప్రారంభం కాకపోవడంతో చాలా కాలం నుంచి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల ఆ భూములను స్వాధీనం చేసుకొంది. ఇప్పుడు ఇదే తరహాలో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ భూములపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వేల రైతు కుటుంబాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి.   


ఇదీ నేపథ్యం..


కొడవలూరు మండలం పరిధిలో ఇఫ్కో ఎరువుల కర్మాగారాన్ని స్థాపించేందుకు 1991లో నిర్ణయించారు. రేగడిచెలిక, రాచర్లపాడు, బొడ్డువారిపాలెం, ఊచగుంటపాలెం, చౌతపుత్తేడు, తడకలూరు, నార్త్‌ఆమలూరు గ్రామాల పరిధిలో 2776 ఎకరాలను సేకరించారు. మొదట భూమి ఇచ్చిన ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ ఎరువుల పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో రైతులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. అంతకముందు కోఆపరేటివ్‌ కిందనున్న ఇఫ్కో తర్వాత పూర్తిగా ప్రైవేటుపరమైంది. దీంతో 2008లో ఆ భూములను అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ పేరిట బదలాయించినట్లు రైతులు చెబుతున్నారు. అయితే రైతులకు మాత్రం ఉద్యోగం ఇవ్వకపోగా తర్వాత పరిహారం కూడా చెల్లించలేదు. కేవలం 229.78 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అసలు రైతులకు పరిహారం చెల్లించకుండా భూములను ఎలా మరొకరికి అప్పగిస్తారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతకముందు సుమారు 1500 కుటుంబాలు ఈ భూములను సాగు చేసుకుంటుండగా తర్వాత వారికి జీవనోపాధి కరువైంది. దీంతో రైతులు న్యాయ పోరాటానికి పూనుకున్నారు. కొన్నేళ్ల నుంచి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కాగా ఇఫ్కో కిసాన్‌ సెజ్‌కు భూములు కేటాయించినప్పటికీ ఇంకా వేల ఎకరాల భూములు నిరుపయోగంగానే ఉండడం గమనార్హం. ప్రస్తుతం హైకోర్టులో ఈ భూములపై వాదనలు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి రోజువారీ వాదనలు వింటామని హైకోర్టు చెప్పినట్లుగా రైతు నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకొంటున్నారు. కాకినాడ సెజ్‌ రైతులకు అక్కడి ప్రజాప్రతినిధులు అండగా నిలబడ్డారు. అదేవిధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా రైతులకు అండగా నిలబడితే వారికి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement
Advertisement
Advertisement