ఎన్నికల దృష్టితో వెళ్తే.. నగరాల అభివృద్ధి జరగదు!

ABN , First Publish Date - 2022-09-21T07:23:47+05:30 IST

ఎన్నికల్లో గెలవాలన్న దృక్పథంతో నగరాల సమగ్రాభివృద్ధికి తాత్కాలిక చర్యలు చేపట్టవద్దని ప్రధాని మోదీ సూచించారు.

ఎన్నికల దృష్టితో వెళ్తే.. నగరాల అభివృద్ధి జరగదు!

బీజేపీ మేయర్ల సదస్సులో ప్రధాని మోదీ హితవు

గాంధీనగర్‌, సెప్టెంబరు 20: ఎన్నికల్లో గెలవాలన్న దృక్పథంతో నగరాల సమగ్రాభివృద్ధికి తాత్కాలిక చర్యలు చేపట్టవద్దని ప్రధాని మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీ నుంచి ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్ల సదస్సును మంగళవారం గాంధీనగర్‌లో ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రెండ్రోజులు జరిగే ఈ కార్యక్రమానికి 18 రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 118 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఎన్నికల దృష్టితో వ్యవహరిస్తే నగరాలను అభివృద్ధి చేయలేమని స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. శాటిలైట్‌ టౌన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. టైర్‌-2, టైర్‌-3 నగరాలను అభివృద్ధి చేస్తే పెద్ద నగరాలపై ఒత్తిడి, భారం తగ్గుతాయని తెలిపారు. మేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమయం గడపాలి. వారి సమస్యలను అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పారు. గార్డెన్స్‌ వంటి ప్రజా ఆస్తుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని మోదీ నొక్కిచెప్పారు. డబ్బు ఖర్చుపెట్టడంతోనే అన్నీ సాధించలేమని.. అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-21T07:23:47+05:30 IST