అన్‌లాక్‌ వేళ.. జర జాగ్రత్త

ABN , First Publish Date - 2021-06-20T09:06:28+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌/కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు వివిధ కార్యకలాపాల ప్రారంభానికి అనుమతిస్తున్నాయి. ప్రజలు బయటకు వస్తున్నారు. మార్కెట్లలో రద్దీ నెలకొంటోంది. ఈ క్రమంలో

అన్‌లాక్‌ వేళ.. జర జాగ్రత్త

క్షేత్ర పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోండి

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం


న్యూఢిల్లీ, జూన్‌ 19: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌/కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు వివిధ కార్యకలాపాల ప్రారంభానికి అనుమతిస్తున్నాయి. ప్రజలు బయటకు వస్తున్నారు. మార్కెట్లలో రద్దీ నెలకొంటోంది. ఈ క్రమంలో జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు శనివారం సూచనలు జారీ చేసింది. ఆంక్షల ఎత్తివేత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, క్షేత్ర స్థాయి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.


కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన ఐదంచెల వ్యూహం.. నిబంధనల పాటింపు, టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌, వ్యాక్సినేషన్‌ను మరువొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ గొలుసు తెంపేందుకు టీకా అతి కీలకమని.. ఎక్కువమందికి పంపిణీ జరిగేలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ను వేగిరం చేయాలని లేఖలో నిర్దేశించారు. కరోనా మళ్లీ విజృంభించకుండా ఉండాలంటే మాస్క్‌ల ధారణ, చేతుల శుభ్రత, భౌతిక దూరం తదితర నిబంధనల పాటింపుపై పర్యవేక్షణ కొనసాగాలన్నారు. పరీక్షల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని, కేసులు/పాజిటివ్‌ రేటు పెరుగుదలను మొదట్లోనే గుర్తించాలన్నారు. కేసులు పెరిగితే తక్షణ చర్యలకు వీలుగా సూక్ష్మ స్థాయిలో వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని.. అక్కడితో కరోనాను కట్టడి చేయాలని నిర్దేశించారు. పరిస్థితిపై నిశితంగా దృష్టి సారించేలా జిల్లా స్థాయి యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్దేశించారు. కాగా, అజయ్‌ భల్లా నుంచి ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ అందింది.

Updated Date - 2021-06-20T09:06:28+05:30 IST