మా ప్రాణాలకు విలువలేదా?

ABN , First Publish Date - 2020-04-07T11:47:19+05:30 IST

‘‘కరోనా వైరస్‌బారిన పడిన వారికి, అనుమానిత లక్షణాలు వున్న వారికి..

మా ప్రాణాలకు విలువలేదా?

ఎన్‌-95 మాస్కులు అడుగుతుంటే పట్టించుకోవడం లేదు

ఇలాగైతే కరోనా వైరస్‌బారిన పడతాం

డీసీహెచ్‌ఎస్‌కి ఫోన్‌ చేస్తుంటే స్విచ్‌ఆఫ్‌ చేస్తున్నారు

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో డాక్టర్లు లేరు

ఆస్పత్రికి వస్తున్న రోగులకు వైద్యం సరైన అందడంలేదు

సంవత్సర కాలంగా గైనికాలజిస్టులు లేరు

ఎమ్యెల్యే, మంత్రి పట్టించుకోవడం లేదు

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు..

ఇక్కడ కనీస స్థాయిలో కూడా పట్టించుకోవడం లేదు..

ప్రాంతీయ ఆస్పత్రి ఎనస్థిస్ట్‌ డాక్టర్‌ సుధాకర్‌ ఆవేదన


నర్సీపట్నం టౌన్‌(విశాఖపట్నం): ‘‘కరోనా వైరస్‌బారిన పడిన వారికి, అనుమానిత లక్షణాలు వున్న వారికి రేయింబవళ్లు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది ఇబ్బందులను ప్రభుత్వంపట్టించుకోవడం లేదు. ఎన్‌-95 మాస్కులు అడుగుతుంటే పట్టించుకునే నాథుడు లేడు. ఇలాగైతే వైద్యులు, సిబ్బంది కూడా కరోనా వైరస్‌బారిని పడతారు. మా ప్రాణాలకు విలువ లేదా’’ అని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి ఎనస్థిస్ట్‌(మత్తు) డాక్టర్‌ సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ఆర్డీవో, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మునిసిపల్‌ కమిషనర్‌, ఏఎస్పీలతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు.


ఎన్‌-95 మాస్కులు అడుగుతుంటే ప్రాంతీయ ఆస్పత్రి వైద్యాధికారి పట్టించుకోవడం లేదని, డీసీహెచ్‌ఎస్‌కి ఫోన్‌ చేస్తుంటే స్విచ్‌ఆఫ్‌ చేసేస్తున్నారని తెలిపారు. అడగ్గా అడగ్గా ఒక మాస్కు ఇచ్చి, దొంగోడి చేత పోలీసు స్టేషన్‌లో సంతకం పెట్టించుకున్నట్టు తమతో సంతకం పెట్టుంచుకున్నారని బాధను వ్యక్తం చేశారు. పైగా ఒక మాస్కు ఇచ్చి, దీనిని 15 రోజులు వాడాలంటున్నారని, ఇలాగైతే కరోనా వైరస్‌బానరిన పడకుండా ఎలా వుంటామని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కానీ ఇక్కడ మాత్రం కనీసస్థాయిలో కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి కనీసస్థాయిలో కూడా డాక్టర్లు లేరని అన్నారు.


సంవత్సర కాలంగా గైనికాలజిస్టులు లేరని, కాంట్రాక్ట్‌ గైనికాలజిస్ట్‌ ఒకరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఎన్‌-95 మాస్కులే కాదు, ఆస్పత్రిలో ఏమీ లేవని అన్నారు. గదిలో కుర్చొని మీటింగ్‌లు పెట్టుకునే బదులు ఆస్పత్రికి వచ్చి స్వయంగా చూస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుందని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఉద్దేశించి అన్నారు. ఆస్పత్రికి ఒక మంత్రి రారు, ఎమ్మెల్యే రారు.... ఎవరూ పట్టించుకోరు అని తీవ్రఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సమస్యల గురించి డీసీహెచ్‌ఎస్‌కి చెబుతుంటే.. ఉద్యోగం మానేసి పొమ్మంటున్నారని డాక్టర్‌ సుధాకర్‌ వాపోయారు.


Updated Date - 2020-04-07T11:47:19+05:30 IST