కాంగ్రెస్ లేకపోయుంటే... : మోదీ

ABN , First Publish Date - 2022-02-08T19:11:37+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో

కాంగ్రెస్ లేకపోయుంటే... : మోదీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఉనికిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించిన తీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ రాజ్యసభలో సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నట్లు ఆరోపించారు. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. భారత దేశమంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌గా మార్చాలని సలహా ఇచ్చారు. 


కాంగ్రెస్ లేకపోయుంటే ఏం జరిగేది? అని కొందరు సభ్యులు అడుగుతున్నారని, ఈ ప్రశ్నకు తన సమాధానం ఇదేనని అంటూ, కాంగ్రెస్ లేకపోయుంటే, దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అమలయ్యేది కాదన్నారు. కుల రాజకీయాలు కూడా ఉండేవి కాదన్నారు. సిక్కులు ఊచకోతకు గురై ఉండేవారు కాదని చెప్పారు. కశ్మీరీ పండిట్ల సమస్యలు ఉత్పన్నమయ్యేవి కాదన్నారు. 


మోదీ మాట్లాడుతూండగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పారు. ప్రజాస్వామ్యం, చర్చలు మన దేశంలో అనేక శతాబ్దాల నుంచి ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తన వంశానికి భిన్నంగా దేనినీ చూడలేదని, ఆలోచించలేదని, ఇదే ఆ పార్టీ సమస్య అని ఆరోపించారు. కుటుంబంపై ఆధారపడిన పార్టీల వల్ల భారత దేశ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడుతోందన్నారు. దీనివల్ల ప్రతిభావంతులు దూరమవుతున్నారని, ఇదే పార్టీలకు జరుగుతున్న అతి పెద్ద నష్టమని తెలిపారు. 


ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ సమాఖ్య తత్వం (ఫెడరలిజం) గురించి ఉపన్యాసాలు ఇస్తుందన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాత్రం ముఖ్యమంత్రులను చిల్లర విషయాలపై తొలగిస్తుందని చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి కుమారుడు విమానాశ్రయంలో ఏర్పాట్లు ఇష్టపడనందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని తొలగించిందన్నారు. అదేవిధంగా కర్ణాటకలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను అగౌరవంగా తొలగించిందన్నారు. అది కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేనపుడు తొలగించిందన్నారు. 


ఇటువంటి సంకుచిత ఆలోచనా ధోరణితో బీజేపీ పని చేయదని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చినట్లయితే దేశం ప్రగతి సాధిస్తుందని తెలిపారు. 


ఆంధ్ర ప్రదేశ్ విభజనపై...

ఆంధ్ర ప్రదేశ్‌ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందన్నారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. విభజన తీరుతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు. 


Updated Date - 2022-02-08T19:11:37+05:30 IST